శ్రీమద్రామాయణం - బాలకాండ - నలభై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 46)
శ్రీమద్రామాయణము బాలకాండ నలభై ఆరవ సర్గ “ఓ రామా! దేవాసుర యుద్ధంలో దితి కుమారులు అయిన దైత్యులు మరణించారు అని చెప్పాను కదా. తన కుమారులు మరణమునకు తల్లి దితి ఎంతో చింతించింది. తన భర్త అయిన కశ్యపుని వద్దకు పోయి ఇలా అడిగింది. “నాధా! నీ కుమారులైన దేవతలు నా కుమారులైన దైత్యులను చంపివేసారు. ఆ దేవతలను చంపేవాడు నాకు పుత్రుడుగా కావాలి. దేవేంద్రుని చంపగల పరాక్రమ వంతుడిని నాకు పుత్రుడుగా ప్రసాదించు. నాకు కుమారుడు కావాలని నేను తపస్సు చేస్తాను. నాకు అనుమతి ఇవ్వండి." అని అడిగింది. ఆ మాటలు విన్న కశ్యపుడు దితి తో ఇలా అన్నాడు. "ఓ దితీ! నీ కోరిక నెరవేరుతుంది. యుద్ధంలో ఇంద్రుని జయించ గల పుత్రుడు నీకు కలుగుతాడు." అని వరం ఇచ్చాడు. దితిని తన చేతితో ఒళ్లంతా తడిమాడు. దితిని ఆశీర్వదించి తపస్సుకు వెళ్లిపోయాడు కశ్యపుడు. కశ్యపుని మాటలకు దితి చాలా ఆనందపడింది. తాను కూడా కుశప్లవనము అనే ప్రదేశములో తపస్సు చేసింది. ఆమె తపస్సు చేస్తున్న సమయంలో దేవేంద్రుడు స్వయంగా వచ్చి ఆమెకు పరిచర్యలు చేసాడు. అగ్ని కార్యము చేయుటకు సమిధలు, దర్భలు, నీళ్లు, పళ్లు అన్నీ సకాలములో సమకూర్చేవాడు. ఆమెకు శ్రమగా ఉంటే ఆమె కాళ్లు పట్టేవాడు...