శ్రీమద్రామాయణం - బాలకాండ - నలభై నాల్గవ సర్గ (Ramayanam - Balakanda - Part 44)
శ్రీమద్రామాయణము
బాలకాండ
నలభై నాల్గవ సర్గ
భగీరథుని మనోరథమునెరవేరినది. గంగా జలము సగర పుత్రుల భస్మరాసుల మీద ప్రవహించినది. వారిని పునీతులను చేసినది. వారందరికీ స్వర్గలోక ప్రాప్తి కలిగించినది. అప్పుడు బ్రహ్మదేవుడు భగీరథునితో ఇలా పలికాడు." నీవు కోరినట్టు గంగ సగరపుత్రుల భస్మరాసుల మీదుగా ప్రవహించినది. 60,000 మంది సగర కుమారులు స్వర్గమునకు వెళ్లినారు. సాగరములు ఉన్నంత వరకూ వారు స్వర్గములో ఉండగలరు. గంగను నీవు స్వర్గము నుండి భూమికి తీసుకొని వచ్చావు కాబట్టి ఆమె నీకు పుత్రికతో సమానము. అందుకని గంగ ఇప్పటి నుండి భాగీరథి అనే పేరులో పిలువబడుతుంది. ఈ గంగ దేవ లోకము నుండి భూలోకమునకు అక్కడి నుండి పాతాళమునకు ప్రవహించింది కాబట్టి గంగకు త్రిపధ అనే పేరుతో కూడా పిలువబడుతుంది.
ఓ భగీరథా! ఈ పవిత్ర గంగా జలముతో నీ పితరులకు తర్పణములు విడిచి నీ మాట నిలబెట్టుకో. ఎందుకంటే పూర్వము సగర చక్రవర్తి మనుమడు అంశుమంతుడు, దిలీపుడు, ఎవరూ ఈ పని చేయలేకపోయారు. దేవలోకములో ఉన్న గంగను భూలోకమునకు తీసుకొని వచ్చి మహోపకారము చేసావు. అఖండ మైన కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్నావు. ఈ రోజు నుండి ప్రతిరోజూ ఈ పుణ్య గంగాజలములలో స్నానము చేసి పునీతుడవు కా! నీకు పుణ్యం వస్తుంది." అని పలికాడు బ్రహ్మ. తరువాత బ్రహ్మ తనలోకమునకు వెళ్లిపోయాడు.
తరువాత భగీరథుడు తన పితరులకు, పితామహులకు, ప్రపితామహులకు జల తర్పణములు విడిచి వారికి పుణ్యలోకములు ప్రాప్తించేటట్టు చేసాడు.
ఓ రామా! ఇదీ గంగావతరణము కథ. ఈ గంగావతరణము కథ చదివిన వాడు, విన్న వాడు పాపములు నశించి పుణ్యలోకములు పొందుతాడు. రామా! సంధ్యాకాలము అయినది. వెళ్లి సంధ్యావందనాది కార్యక్రమములు నిర్వర్తించెదము." అని పలికాడు విశ్వామిత్రుడు.
ఇది వాల్మీకి విరచిత
రామాయణ మహాకావ్యములో
బాలకాండలో నలభై నాల్గవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ంతత్సత్ ఓంతత్సత్.
Comments
Post a Comment