శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)
శ్రీమద్రామాయణము
బాలకాండ
ముప్పది ఏడవ సర్గ
ఓ రామా! పూర్వము దేవతల సేనలకు ఒక సైన్యాధి పతి కావాల్సి వచ్చాడు. దేవతలు అందరూ బ్రహ్మ దేవుని వద్దకు పోయి అగ్ని దేవుని ముందు పెట్టుకొని తమ కోరిక ను బ్రహ్మదేవునికి ఈ విధంగా విన్నవించుకున్నారు.“ఓ బహ్మ దేవా! ఇప్పటి దాకా దేవతా సేనలకు మహేశ్వరుడు సైన్యాధి పతిగా ఉండేవాడు. కాని ప్రస్తుతము మహేశ్వరుడు హిమాచలము మీద తపస్సు చేసుకుంటున్నాడు. కాబట్టి మాకు వేరొక సైన్యాధి పతిని నీవే ఏర్పరుప వలెను." అని వేడుకున్నారు.
ఆ సమయంలో మహేశ్వరుడు హిమాచలము మీద తపస్సు చేసుకుంటున్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు. “ ఓ దేవతలారా! ఉమాదేవి శాపము వలన మీలో ఎవ్వరికీ సంతానయోగ్యత లేదు. కాబట్టి మీలో ఎవరూ సైన్యాధి పతిని పుట్టించలేరు. ఆకాశ గంగ ఉన్నది కదా. అగ్ని దేవుని యందు ఆ మహాదేవుని వీర్యము నిక్షిప్తమై ఉన్నది కదా. గంగాదేవి అగ్నిదేవుని నుండి మహేశ్వరుని వీర్యమును స్వీకరించును. గంగాదేవికి అగ్నిదేవుని ద్వారా ఒక పుత్రుడు జన్మించును ఆయనే మీ దేవసేనకు అధిపతి కాగలడు. దీనికి ఉమాదేవి కూడా ఏమీ అభ్యంతరపెట్టదు." అని అన్నాడు.
బహ్మదేవుని మాటలకు సంతోషించి దేవతలందరూ తమ తమ స్థానములకు వెళ్లిపోయారు. తరువాత దేవతలందరూ పుత్రుని కొరకై అగ్నిదేవుని ప్రార్థించారు. అగ్నిదేవుడు గంగ దేవి దగ్గరకు పోయి " ఓ గంగాదేవీ ! దేవతల కోరిక మేరకు నీవు నావలన గర్భము ధరింపుము." అని కోరాడు.
గంగాదేవి ఒక దివ్యమైన రూపము ధరించింది. అగ్నిదేవుడు గంగాదేవిని ఆవహించాడు. తనలో నిక్షిప్తమైన మహాదేవుని వీర్యమును గంగాదేవిలో విడిచిపెట్టాడు. గంగాదేవి దేహమంతయూ తాపంతో రగిలిపోయింది.
గంగాదేవి ఒక దివ్యమైన రూపము ధరించింది. అగ్నిదేవుడు గంగాదేవిని ఆవహించాడు. తనలో నిక్షిప్తమైన మహాదేవుని వీర్యమును గంగాదేవిలో విడిచిపెట్టాడు. గంగాదేవి దేహమంతయూ తాపంతో రగిలిపోయింది.
“ఓ అగ్నీ! నేను ఈ వీర్యమును ధరింపలేను. నా వళ్లు అంతా దహించికుపోతూ ఉంది. నాకు శరీరం వశం తప్పి పోతూ ఉంది. నా వల్ల కాదు." అని చెప్పింది.
"ఓ గంగాదేవీ! అటులయిన నేను నీలో విడిచిన వీర్యమును నీవు హిమాచలము వద్ద ఉన్న ఒక పర్వతము మీద విడువుము." అని అన్నాడు అగ్ని.
గంగానది అగ్ని దేవుడు చెప్పినట్లే మహాదేవుని వీర్యమును ఒక పర్వతము మీద విడిచింది. అప్పుడు ఆ పర్వతము మహాదేవుని వీర్య ప్రభావము వలన బంగారము, వెండి, రాగి, ఇనుము మొదలగు ఖనిజ సంపదలతో నిండిపోయింది. మహాదేవుని వీర్యము పడిన చోట రెల్లు పొదలు దట్టంగా పెరిగాయి. ఆ రెల్లు పొదలలో నుండి ఒక కుమారుడు పుట్టాడు. అది చూచి దేవతలు అందరూ సంతోషించారు. ఆ కుమారుని పాలు ఇచ్చి పెంచే బాధ్యత కృత్తికలకు అప్పగించారు. దేవతల ఆజ్ఞను శివసావహించిన కృత్తికలు ఆ బాలునికి స్తన్యము ఇచ్చి పెంచారు. అందుకని ఆ బాలుడు కార్తికేయుడు అనే పేరుతో పిలువ బడ్డాడు.
గంగాదేవి గర్భము నుండి జారి పడ్డాడు కాబట్టి స్కంధుడు అని కూడా పిలువ బడ్డాడు. కృత్తికలు ఆరుగురు. ఆరుగు కృత్తికలు ఒకే సమయంలో ఆ బాలునికి స్తన్యము (చనుబాలు) ఇచ్చారు. ఆ బాలుడు కూడా ఒకే సారి ఆరుముఖములతో ఆ తల్లుల చనుబాలు తాగాడు. అందుకని ఆ బాలునికి షణ్ముఖుడు అనే పేరు వచ్చింది.
తరువాత ఆ కుమారుడు దేవ సేనలకు సైన్యాధి పతి గా నియమింప బడ్డాడు. అసురులను జయించాడు. ఓ రామా! దీనినే కుమార సంభవము అని అంటారు." అని విశ్వామిత్రుడు రామునికి కుమార స్వామి జననము గురించి చెప్పాడు.
ఇది వాల్మీకి విరచిత
రామాయణ మహాకావ్యములో
బాలకాండలో ముప్పది ఏడవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ంతత్సత్ ఓంతత్సత్.
Comments
Post a Comment