శ్రీమద్రామాయణం - సుందర కాండము - మొదటి సర్గ (Ramayanam - SundaraKanda - Part 1)
శ్రీమద్రామాయణము
సుందర కాండము
మొదటి సర్గ
జాంబవంతుని ప్రేరణతో, వానర వీరులు ఇచ్చిన ప్రోత్సాహంతో, అమితమైన ఉత్సాహంతో, హనుమంతుడు ఆకాశవీధిన లంకకు పోవడానికి నిశ్చయించుకున్నాడు. తన మెడను ముందుకు చాచాడు. తల పైకి ఎత్తాడు. ఆకుపచ్చని రంగులో ఉన్న హనుమంతుడు వైడూర్యము వలె ప్రకాశిస్తున్నాడు.హనుమంతుడు ఎగరడానికి ఆయత్తమైన మహేంద్ర పర్వతము మీద ఎంతో మంది యక్షులు, కిన్నరులు, గంధర్వులు, నాగులు నివసిస్తున్నారు. వారే కాకుండా సింహములు, ఏనుగులు, పెద్దపులులు కూడా ఆ పర్వతము మీద స్థిరనివాసము ఏర్పరచు కున్నాయి.
ఆకాశంలోకి ఎగరడానికి ముందు హనుమంతుడు తూర్పు దిక్కుగా తిరిగి, బ్రహ్మదేవునికి, దేవేంద్రునికి, తన తండ్రి వాయు దేవునకు, ప్రత్యక్ష దైవము సూర్యభగవానుడికి, సమస్త దేవతలకు భక్తిపూర్వకంగా నమస్కరించాడు. తరువాత దక్షిణ దిక్కుగా తిరిగి లంకాద్వీపమునకు పోవుటకు తన శరీరమును పెంచాడు. అక్కడ ఉన్న వానర వీరులు, వానరులు అందరూ హనుమంతుని వంక కళ్లప్పగించి చూస్తున్నారు.
వీలైనంత పెద్దదిగా తన శరీరాన్ని పెంచాడు హనుమంతుడు. తన చేతులను, కాళ్లను పర్వత శిఖరము మీద తొక్కిపట్టాడు. హనుమంతుడు తన బలమంతా ఉపయోగించి మహేంద్ర పర్వత శిఖరమును తొక్కిపట్టడంతో ఆ పర్వతము ఊగిపోయింది. దాని మీద ఉన్న జంతువులు, భూకంపము వచ్చినది అనే భ్రమతో, అన్నీ కకావికలై అటు ఇటు పరుగులు తీసాయి. ఆ జంతువుల వికృతమైన అరుపులతో ఆ పర్వతము ప్రతిధ్వనించింది. విష సర్పాలు అన్నీ భయపడి విషాన్ని కక్కాయి. చెట్లనుండి పూలు జలా జలా రాలాయి. పెద్ద పెద్ద బండరాళ్లు కిందికి దొర్లాయి. మరి కొన్ని రాళ్లకు బీటలు ఏర్పడ్డాయి.
ఆ పర్వతము మీద తపస్సు చేసుకుంటున్న మునులు, ఆ ఉత్పాతాలకు భయపడి ఆశ్రమాలు విడిచిపెట్టి పారిపోయారు. అప్పటిదాకా తమ తమ ప్రియురాళ్లతో, మద్యపానము చేస్తూ ఆనందిస్తున్న విద్యాధరులు, ఆ ఉత్పాతాలు చూచి, పాన పాత్రలు అక్కడే పడవేసి, తమ తమ ప్రియురాండ్రతో పారిపోయారు.
దేవతలు, విద్యాధరులు, మహర్షులు, చారణులు,సిద్ధులు ఈ చోద్యాన్ని చూడటానికి ఆకాశంలో బారులు తీరారు. ఆకాశంలో నిలబడిన వారంతా ఇలా అనుకుంటున్నారు. "అహో ఏమి ఆశ్చర్యము. రామ కార్యము కొరకు హనుమంతుడు ఎవరూ చేయలేని సాహసం చేస్తున్నాడు. నూరుయోజనముల సముద్రమును లంఘించు చున్నాడు.” అని తమలో తాము అనుకుంటున్నారు.
అలా నిలబడ్డ హనుమంతుడు ఒక్కసారి భయంకరంగా గర్జించాడు. తన తోకను గట్టిగా విదిలించాడు. హనుమంతుని తోక నిటారుగా నిలబడింది. హనుమంతుడు తన చేతులను గట్టిగా బిగించాడు. పాదములను ఎగరడానికి సిద్ధంగా ఉంచాడు. తన భుజములను మెడను ముందుకు వంచాడు. చూపు తన వెళ్లవలసిన ఆకాశ మార్గము వైపు నిలిపాడు. ఎటు వైపు ఎగరాలో నిర్ణయించుకున్నాడు. ఆకాశం వంక చూస్తూ తన ఊపిరిని స్తంభింపజేసాడు. హనుమంతుని చెవులు రిక్కపొడుచుకున్నాయి.
హనుమంతుడు వానరులను చూచి ఇలా అన్నాడు. "నేను రాముని ధనుస్సునుండి వెడలిన బాణము మాదిరి లంక వైపుకు ఎగిరిపోతాను. లంకలో సీత కనపడకపోతే అటునుంచి అటే స్వర్గలోకమునకు వెళతాను. స్వర్గలోకంలో కూడా సీత జాడ తెలియకపోతే, ఆ రావణుని కట్టి తెచ్చి రాముని పాదముల మీద పడవేస్తాను. నేను వెళ్లి రామ కార్యమును సాధించుకొని వస్తాను. సీతతో వస్తాను. లేకపోతే రావణుని బంధించి తెస్తాను. అదీ కాకపోతే లంకను కూకటి వేళ్లతో పెకలించి తీసుకొని వస్తాను. ఇదే నా నిశ్చయము" అని పలికాడు.
హనుమంతుడు తన కాళ్లను పర్వతశిఖరము మీద తన్నిపెట్టి పైకి ఎగిరాడు. ఆ సమయంలో తాను గరుత్మంతుడు అని అనుకొన్నాడు హనుమంతుడు. హనుమంతుడు పైకి ఎగిరిన వేగానికి మహేంద్ర పర్వతము మీద ఉన్న పెద్ద పెద్ద వృక్షములు కూకటి వేళ్లతో సహా పైకి ఎగిరి అల్లంత దూరంలో పడ్డాయి. హనుమంతుని వేగానికి పెకలింప బడ్డ వృక్షాలు ఎగిరి సముద్రంలో పడ్డాయి. ఆ వృక్షముల నుండి రాలిన పూలు ఆకాశంలో చెల్లాచెదరుగా ఎగురుతూ నేలమీద రాలుతున్నాయి.
హనుమంతుడు ఆకాశంలో దూసుకుపోతుంటే, ఆకాశాన్ని మింగుతున్నాడా అన్నట్టు కనపడుతూ ఉంది. హనుమంతుడు తన రెండు చేతులూ ముందుకు, రెండు కాళ్లు వెనక్కు, చాచి, తోక పై కి ఎత్తి దూసుకుపోతంటే, ఐదుతలలతో ఉన్న మహాసర్పము ఆకాశంలో ఎగురుతూ ఉన్నదా అని భ్రమకలికిస్తూ ఉంది. నిప్పుకణముల మాదిరి మండుతున్న హనుమంతుని కళ్లు సూర్యచంద్రుల మాదిరి ప్రకాశిస్తున్నాయి. హనుమంతుడు ఎగురుతుంటే, హనుమంతుని పొడవాటి తోక పైకి లేచి నిటారుగా నిలబడి ఇంద్రుని ధ్వజము మాదిరి ప్రకాశిస్తూ ఉంది.
సముద్రము మీద హనుమంతుడు మహావేగంతో ఎగురుతూ ముందుకు దూసుకుపోతుంటే, కిందకు నెట్టబడిన గాలి జంఝామారుతంలాగా పెద్దగా ధ్వని చేస్తూ ఉంది. ఆకాశంలో ఎగురుతున్న హనుమంతుడు చూచేవారికి పెద్ద కాంతి పుంజము మాదిరి కనపడుతున్నాడు. సముద్రము మీద ఆకాశంలో హనుమంతుడు ఎగురుతుంటే ఆయన నీడ కూడా సముద్రము నీటి మీద అదే వేగంతో అనుసరిస్తూ ఉంది. హనుమంతుని నీడ ముప్పది యోజనముల పొడవు, పదియోజనముల వెడల్పు కలిగి ఉంది.
మహావేగంతో హనుమంతుడు సముద్రము మీద ఎగురుతుంటే ఆ వేగానికి సముద్రము అలలు ఉవ్వెత్తున లేచి కిందపడుతున్నాయి. సముద్రపు నీటి అలలతో పాటు ఆ సముద్రములో ఉన్న జలచరములు కూడా పైకి లేస్తున్నాయి. హనుమంతుడు సముద్రము మీద ఎగురుతుంటే మహేంద్రపర్వతము రెక్కలు వచ్చి ఆకాశంలో ఎగురుతూ ఉందా అన్నట్టు చూచేవారికి భ్రమకలుగుతూ ఉంది. సముద్రజలముల మీద హనుమంతుడు ఏ ప్రాంతంలో ఎగురుతుంటే, ఆ ప్రాంతంలో జలము సుడులు తిరుగుతూ ద్రోణి ఏర్పడుతూ ఉంది. తనకు అడ్డం వచ్చిన మేఘాలను చీల్చుకుంటూ పోతున్న హనుమంతుడు, మబ్బుల్లో చంద్రుడి మాదిరి ప్రకాశిస్తున్నాడు. హనుమంతుని ప్రయాణాన్ని ఆశ్చర్యంతో తిలకిస్తున్న దేవతా గణాలు, హనుమంతుని మీద పూలవాన కురిపించారు.
హనుమంతునికి ఎక్కడ వేడి తగులుతుందో అని సూర్యుడు తన కిరణాల తీవ్రతను తక్కువ చేసాడు. వాయుదేవుడు కూడా హనుమంతుడు వెళ్లే దిశకు అనుకూలంగా వీస్తున్నాడు. రామకార్యము నిమిత్తము తన మీదుగా ఎగురుతున్న హనుమంతుని చూచిన సముద్రుడు ఇలా అనుకున్నాడు. “ఇప్పుడు నేను హనుమంతునికి సాయం చెయ్యకపోతే అందరూ నన్ను తప్పు పట్టడానికి అవకాశము ఇచ్చిన వాడిని అవుతాను. రాముడు పుట్టిన ఇక్ష్వాకు వంశము వాడైన సగర చక్రవర్తి వల్లనే కదా సముద్రములు ఏర్పడినవి. నూరుయోజనములు ఎగరాలంటే సామాన్యము కాదు. హనుమంతుడు ఎగిరి ఎగిరి అలసి పోతాడు. హనుమంతునికి కొంత విశ్రాంతి అవసరము. కొంచెం సేపు విశ్రాంతి తీసుకున్న తరువాత మరలా హనుమంతుడు రెట్టించిన బలంతో ఎగురగలడు." అని ఆలోచించాడు.
వెంటనే సముద్రుడు తనలో మునిగి ఉన్న బంగారముతో నిండిన మైనాక పర్వతమును చూచి ఇలా అన్నాడు. “ఓ పర్వత రాజమా! పాతాళంలో దాగి ఉన్న అసురులు పైకి రాకుండా దేవేంద్రుడు నిన్న పాతాళ ద్వారానికి అడ్డుగా నిలిపాడు. నీవు పాతాళ ద్వారమును మూసివేసి అడ్డుగా నిలబడి ఉన్నావు. నీకు పైకి లేచే శక్తి ఉంది. కొంచెంగా ఎగుర గలవు. ఇక్ష్వాకు వంశమునకు చెందిన రాముని కార్యము నిమిత్తము హనుమంతుడు సముద్రం మీద ఎగురుతూ నీవు ఉన్న ప్రదేశము మీదుగా వస్తున్నాడు. మనము ఆయనకు సాయం చెయ్యాలి. కాబట్టి నీవు నిటారుగా పైకి లేచి, నీ మీద హనుమంతుడు కాసేపు విశ్రాంతి తీసుకొనేట్టు చెయ్యి. నీ శిఖరము మీద కాసేపు విశ్రాంతి తీసుకొని మరలా హనుమంతుడు లంక వైపు సాగిపోగలడు. ఇది మనము చేయవలసిన పని. చేయవలసిన పని చేయకపోతే అది అధర్మము అవుతుంది. కాబట్టి హనుమంతుడు నీ స్వర్ణ శిఖరము మీద నిలబడటానికి వీలుగా నీవు సముద్రజలాల నుండి పైకి లేచి నిలబడు. హనుమంతుడు నీ మీద కొంచెం సేపు విశ్రాంతి తీసుకోగలడు." అని అన్నాడు.
సముద్రుని మాటలు మన్నించాడు మైనాకుడు. సముద్ర గర్భంలో ఉన్న మైనాక పర్వతము నీటిని ఛేదించుకుంటూ పైకి లేచింది. నట్టనడిసముద్రములో నిలబడింది. స్వర్ణ శిఖరములతో ప్రకాశిస్తున్న పర్వత రాజము ఉదయించుచున్న సూర్యుని మాదిరి ప్రకాశించింది. తన దారిన తాను వెళుతుంటే ఈ పర్వతము ఏంటి తనకు అడ్డంగా వచ్చి నిలబడింది అని అనుకున్నాడు హనుమంతుడు. తనకార్యమునకు విఘ్నము కలిగించడానికి అలా నిలబడింది అని
అనుకున్నాడు. కాని ఆగలేదు. ఆ పర్వత శిఖరమునకు హనుమంతుని వక్షస్థలము ఢీకొట్టింది. అంత పెద్ద మైనాక పర్వతశిఖరము హనుమంతుని వక్షస్థలము దెబ్బకు ఛిన్నాభిన్నమై పక్కకు
పడిపోయింది. హనుమంతుడు ఎగురుతున్న వేగానికి ఆశ్చర్యపోయాడు మైనాకుడు. మనుష్యరూపము దాల్చి హనుమంతుని ఎదుట నిలిచాడు.
అనుకున్నాడు. కాని ఆగలేదు. ఆ పర్వత శిఖరమునకు హనుమంతుని వక్షస్థలము ఢీకొట్టింది. అంత పెద్ద మైనాక పర్వతశిఖరము హనుమంతుని వక్షస్థలము దెబ్బకు ఛిన్నాభిన్నమై పక్కకు
పడిపోయింది. హనుమంతుడు ఎగురుతున్న వేగానికి ఆశ్చర్యపోయాడు మైనాకుడు. మనుష్యరూపము దాల్చి హనుమంతుని ఎదుట నిలిచాడు.
“వానరోత్తమా! నా పేరు మైనాకుడు. నేను పర్వత రాజును. నీవు ఇక్ష్వాకు వంశ రాజైన రాముని కార్యము నిమిత్తము లంకకు పోతున్నావని సముద్రునికి తెలుసు. ఇక్ష్వాకు వంశము వారి వలననే కదా సముద్రుడు అభివృద్ధి చెందాడు. కాబట్టి ఇక్ష్వాకు వంశము రాజైన రామునికి ప్రత్యుపకారము చేయవలెనని సముద్రుడు తలిచాడు. అందుకని నన్ను పంపాడు. నీవు నూరు యోజనముల దూరము ప్రయాణిస్తున్నావు. నీకు అలసట కలిగి ఉంటుంది. కాబట్టి కాసేపు నా శిఖరము మీద విశ్రాంతి తీసుకొని వెళ్లు. ఇది సముద్రుని అభిలాష. నా విజ్ఞప్తి.
నీవు తినడానికి కంద మూలములు ఫలములు సిద్ధము చేసాను. వాటిని ఆరగించి కాసేపు విశ్రాంతి తీసుకో. ఈ రోజు నీవు మాకు అతిధివి. అతిధిని సత్కరించడం మా ధర్మము. పైగా నీవు వాయుదేవుని కుమారుడవు. నిన్ను సత్కరిస్తే వాయుదేవుని సత్కరించినట్టే. అదీ కాకుండా, మనకు దగ్గర సంబందము ఉంది. పూర్వము పర్వతములకు రెక్కలు ఉండేవి. పర్వతములు కూడా గరుడునితోనూ, వాయువుతోనూ సమానమైన వేగముతో ఎగురుతూ ఉండేవి. ఆ ప్రకారంగా పర్వతములు ఎగురుతుంటే కింద ఉన్న ఋషులు, మునులు, దేవతా గణములు, మానవులు, ఇతర జంతు జాలములు ఆ పర్వతములు ఎక్కడ తమ మీద పడతాయో అని భీతి చెందేవారు. అప్పుడు దేవేంద్రుడు కోపించి పర్వతములకు ఉన్న రెక్కలను తన వజ్రాయుధము తో ఖండించాడు. ఆ ప్రక్రియలో నా రెక్కలు కూడా ఖండించడానికి దేవేంద్రుడు వజ్రాయుధమును చేతబూని వస్తుంటే, నీ తండ్రి వాయుదేవుడు అడ్డు పడి నన్ను దూరంగా తీసుకొని వెళ్లి ఈ సముద్రగర్భంలో దాచి పెట్టాడు. ఆ ప్రకారంగా నేను నా రెక్కలు ఖండింపబడకుండా రక్షింపబడ్డాను. అందువలన వాయుదేవుడు నాకు పాణదాత. ఆ వాయుదేవుని కుమారుడవు నువ్వు. అందుచేత, నువ్వు కూడా నాచేత గౌరవింపతగ్గవాడవు. కాబట్టి నువ్వు మా ఆతిధ్యము స్వీకరించి నన్ను, సముద్రుని సంతోషపెట్టు. మేము చేయుపూజలు అందుకో. నా మీద కొంచెము సేపు విశ్రాంతి తీసుకో." అని వినయంగా పలికాడు మైనాకుడు.
మైనాకుని మాటలు విన్న హనుమంతుడు ఇలా అన్నాడు. “ఓ పర్వత రాజా! నీ ఆతిధ్యమునకు చాలా సంతోషించాను. కాని, ప్రస్తుతము నీ ఆతిధ్యము స్వీకరించలేను. నాకు సమయము మించి పోతూ ఉంది. సీతాన్వేషణలో ఇప్పటికే చాలా ఆలస్యం అయింది. అందుకని నేను మార్గ మధ్యలో ఎక్కడా ఆగలేను. ఏమీ అనుకోకు" అని అంటూనే తన దారిన తాను ఎగురుకుంటూ వెళ్లాడు హనుమంతుడు. అలా వెళుతున్న హనుమంతుని కార్యదీక్షకు ముగ్ధులయ్యారు మైనాకుడు, సముద్రుడు. హనుమంతునికి తమ ఆశీస్సులు అందించారు.
హనుమంతుడు మైనాక పర్వతమును వదిలి ఆకాశంలోకి ఇంకా ఎత్తుగా ఎగిరాడు. దక్షిణ దిక్కుగా ఆకాశంలో పయాణం చేస్తున్నాడు. ఈ సంగతి విన్న దేవేంద్రుడు కూడా ఎంతో సంతోషించాడు. మైనాకునికి అభయం ఇచ్చాడు. “ఓ మైనాకుడా! నీవు రామకార్యము మీద పోతున్న హనుమంతునికి ఎంతో సాయం చేసావు. నాకు చాలా ఆనందం కలిగింది. ఇంక నా వలన నీకు ఏలాంటి భయము లేదు. నీ ఇష్టం వచ్చినచోట ఉండ వచ్చును." అని అన్నాడు. దేవేంద్రుని మాటలు విని మైనాకుడు చాలా సంతోషించాడు. ఇంక తనకు దేవేంద్రుని వలన ఎలాంటి భయం లేదనుకున్నాడు.
అప్పటికి హనుమంతుడు చాలా దూరం వెళ్లిపోయాడు. హనుమంతుని గమనమును చూస్తున్న దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు హనుమంతునికి కొంచెము విఘ్నములు కల్పిచవలెనని అనుకున్నారు. సురస అనే నాగమాతను పిలిచారు. “అమ్మా నాగమాతా! హనుమంతుడు సముద్రము మీద ఎగురుతున్నాడు. నీవు అతనికి విఘ్నము కల్పించాలి. నీవు పర్వత సమానమైన రాక్షస రూపము ధరించి, నీ నోరు పెద్దదిగా తెరిచి హనుమంతునికి అడ్డంగా నిలబడు. హనుమంతుడు ఉపాయంతో నిన్ను జయిస్తాడా లేక తాను తల పెట్టిన కార్యమునకు విఘ్నము కలిగినదని విచారిస్తాడా తెలుసుకోవాలని అనుకుంటున్నాము.” అని అన్నాడు.
దేవతల కోరికను మన్నించింది సురస. ఆమెకు కూడా హనుమంతుని పరీక్షించవలెనని కోరిక పుట్టింది. వెంటనే కొండంత రాక్షస రూపం ధరించింది. తన నోరు తెరిచి హనుమంతుని మార్గమునకు అడ్డంగా నిలిచింది.
“ఓ వానరా! ఈరోజు నీవు నాకు ఆహారము అయ్యావు. నేను నిన్ను నమిలి తింటాను. నువ్వు నా నోట్లో ప్రవేశించు." అని నోరు తెరిచింది సురస. హనుమంతుడు ఏమీ తొణక లేదు. ఆమెకు రెండు
చేతులు ఎత్తి నమస్కరించాడు.
“అమ్మా! నీవు ఎవరో నాకు తెలియదు. నేను రామ కార్యము నిమిత్తము వెళుతున్నాను. దశరథుని కుమారుడు రాముడు, ఆయన భార్య సీత, తమ్ముడు లక్ష్మణుడు దండకారణ్యములో ఉండగా, రావణుడు అనే రాక్షసుడు రాముని భార్య సీతను అపహరించి తీసుకొని వెళ్లాడు. లంకలో ఉంచాడని తెలిసింది. ప్రస్తుతము నేను రాముని దూతగా సీత వద్దకు వెళుతున్నాను. నీవు కూడా రాముని రాజ్యములోనే ఉన్నావు కదా! రాజుకు సాయం చెయ్యడం మన ధర్మం కదా! అందుకని నాకు దారి వదులు. నేను రామ కార్యము ముగించుకొని తిరిగి వచ్చునపుడు నీ ముఖంలోకి ప్రవేశించి నీకు ఆహారం అవుతాను. నేను సత్యమునే పలుకుతున్నాను." అని అన్నాడు హనుమంతుడు.
కాని సురస అంగీకరించలేదు. నన్ను దాటి ఎవరూ పోలేరు. ఆ ప్రకారంగా నాకు బ్రహ్మ ఇచ్చిన వరం ఉంది. కాబట్టి నువ్వు నన్ను దాటిపోలేవు. నువ్వు నా ముఖంలోకి ప్రవేశించాలి. తప్పదు."అని పలికింది సురస.
సురస మాటలకు హనుమంతునికి కోపం వచ్చింది. కాని తమాయించుకున్నాడు.
“అలాగా! అయితే నీవు ఎంత పెద్దగా నీ నోరు తెరవగలవో తెరువు. అప్పుడు నేను నీ నోట్లో దూరుతాను." అని అన్నాడు. సురస నోరు తెరిచింది. అంతకన్నా తన దేహమును పెంచాడు హనుమంతుడు. సురస తన నోటిని ఇరువది యోజనముల వెడల్పు తెరిచింది. హనుమంతుడు ముప్పది యోజనముల లావు పెరిగాడు. సురస నోరు పట్టలేదు. సురస తన ముఖమును నలుబది
యోజనముల వెడల్పు పెంచింది. హనుమంతుడు ఇంకా లావు పెరిగాడు. ఆఖరుకు సురస తన ముఖమును ఎనభై యోజనముల వెడల్పు పెంచింది. హనుమంతుడు తన శరీరమును తొంభై
యోజనముల లావు పెంచాడు. వెంటనే హనుమంతుడు చిన్న బొటన వేలి ప్రమాణం అంత చిన్న వాడయ్యాడు. చటుక్కున సురస నోట్లోకి వెళ్లి మరలా బయటకు వచ్చేసాడు.
“ఓ మాతా! నీవు కోరినట్టు నీ ముఖంలోకి ప్రవేశించి బయటకు వచ్చాను కదా! ఇంక నాకు దారి ఇవ్వు. నేను తొందరగా వెళ్లాలి." అని అన్నాడు. ఆమాటలకు సురస ఎంతో సంతోషించింది. తన నిజస్వరూపంతో హనుమంతుని ఎదుట నిలిచింది.
“కుమారా హనుమా! నీ బుద్ధికుశలతకు సమయస్ఫూర్తికి మెచ్చాను. నీవు రామ కార్యము మీద వెళ్లవచ్చును. నీకు విజయం సిద్ధిస్తుంది." అని ఆశీర్వదించింది సురస. ఇది చూచిన దేవతలు హనుమంతుని తెలివికి ఎంతో సంతోషించారు.
(ఇక్కడ ఒక్క మాట. హనుమంతుడు దాటవలసిన దూరము నూరు యోజనములు. అప్పటికే కొంత దూరం ప్రయాణం చేసాడు. సురస ఎనభై యోజనములు పెరిగితే, ఇంకేముంది, ఆమె
మీదుగా దూకుతూ లంకలోకి దూకవచ్చు కదా!హనుమంతుడు తన శరీరమును తొంభై యోజనములు పెంచాడు అని ఉంది. తొంభై యోజనముల లావు ఉన్న హనుమంతుడు మధ్య నిలబడితే అటు ఐదు, ఇటు ఐదు యోజనముల దూరమే ఉంటుంది. వానరులందరూ అటునుంచి ఇటు ఇటు నుంటి అటు లంకలో దూకేయవచ్చుకదా! ఈ ఎగరడాలు ఎందుకు? కాబట్టి, ఈ సురస కధలో ఇచ్చిన దూరముల కొలతలు హనుమంతుని తెలివి తేటల గురించి, శక్తి సామర్థ్యముల గురించి మనకు బాగా తెలియజెయ్యడానికి, చిన్న పిల్లలకు ఆసక్తి కలిగించడానికి చమత్కారంగా రాయబడినవి అని పండితుల అభిప్రాయము.)
తరువాత హనుమంతుడు తన ప్రయాణమును కొనసాగించాడు. మరలా హనుమంతునికి ఒక ఆటంకం కలిగింది. సింహిక అనే రాక్షసి ఉంది. ఆ రాక్షసి ఆకాశమార్గంలో పోతున్న హనుమంతుని చూచింది. ఇవ్వాళ నాకు మంచి ఆహారము దొరికింది అని అనుకొంది. ఆ సింహికకు నేల మీద పడ్డ నీడను పట్టుకొని పైన ఎగురుతున్న పక్షులను పట్టుకొనే శక్తి ఉంది. ఆ ప్రకారంగా పైన ఎగురుతున్న హనుమంతుని నీడను పట్టుకొంది. కిందికి లాగుతూ ఉంది. ఎవరో తనను పట్టి లాగుతున్నట్టు అనిపించింది హనుమంతునికి. కిందికి చూచాడు. సింహిక కనపడింది. సముద్ర జలాల మీద పడ్డ నీడను పట్టుకొని పక్షులను, జంతువులను తన వైపుకు లాక్కునే వికృతమైన ఆకారాల గురించి సుగ్రీవుడు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి హనుమంతునికి. సుగ్రీవుడు చెప్పిన వికృతమైన ఆకారము ఇదే అనుకున్నాడు హనుమంతుడు.
హనుమంతుడు తన దేహమును పెంచాడు. అది చూచిన సింహిక తన నోరు అంత కన్నా పెద్దగా తెరిచి అరుస్తూ హనుమంతుని వైపుకు వెళ్లింది. హనుమంతుడు తన శరీరమును చిన్నదిగా చేసి సింహిక నోట్లోకి దూరాడు. ఆమె శరీరములోకి ప్రవేశించిన హనుమంతుడు తన వాడిఅయిన గోళ్లతో ఆమె లోపల భాగములను, గుండెను, ఊపిరితిత్తులను, పేగులను చీల్చాడు. వెంటనే బయటకు వచ్చాడు. శరీరం ఛిన్నాభిన్నం కావడంతో సింహిక సముద్రంలో పడి మరణించింది. ఆకాశంలో సంచరిస్తున్న సిద్ధులు, గంధర్వులు మొదలగు దేవతలు హనుమంతుడు సింహికను చంపడం చూచి బాగు బాగు అని మెచ్చుకున్నారు.
సింహికను చంపిన హనుమంతుడు మరలా పైకి ఎగిరాడు. ఆకాశంలో ప్రయాణం సాగిస్తున్నాడు. సముద్రము ఆవల ఒడ్డుకు చేరుకున్నాడు. సముద్రము ఒడ్డున వరుసగా ఉన్న వృక్షములను చూచాడు. హనుమంతుడు ఆకాశము నుండి కిందికి దిగుతున్నాడు. అప్పటికి హనుమంతుడు తన శరీరమును చాలా రెట్లు పెద్దది చేసాడు. తన ఆకారమును చూచి రాక్షసులు భయపడతారని తన వంక అనుమానంగా చూస్తారని అనుకున్నాడు హనుమంతుడు. అందుకని తన నిజరూపమును ధరించాడు. సాధారణ వానర రూపమును ధరించాడు హనుమంతుడు. హనుమంతుడు లంకా
ద్వీపములో ఉన్న త్రికూట పర్వత శిఖరము మీదకు దిగాడు. ఆ పర్వతము పైన నిర్మింపబడిన లంకా పట్టణమును చూచాడు హనుమంతుడు.
ఆ లంకా పట్టణము దేవేంద్రుని రాజధాని అయిన అమరావతి మాదిరి శోభిల్లుతూ ఉంది. ఆ పర్వత శిఖరము మీద పూలచెట్ల కింద నిలబడి ఉన్న హనుమంతుని మీద ఆ పూల చెట్లు పూలవాన కురిపించాయి. ఆ పూలతో నిండిపోయిన హనుమంతుడు కదులుతున్న పూలవిగ్రహము మాదిరి శోభించాడు.
శ్రీమద్రామాయణము
సుందర కాండము మొదటి సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment