శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణము

బాలకాండ

ఇరవై ఆరవ సర్గ

విశ్వామిత్ర మహర్షి మాటలను శ్రద్ధగా విన్న రాముడు వినయంతో ఇలా అన్నాడు. “ ఓ మహర్షి! మా తండ్రి దశరథుడు నన్ను తమరి వెంట పంపాడు. తమరు ఏమి చెబితే అలా చెయ్యమన్నాడు. నా తండ్రి గారి మాటను జవదాటలేను. అందుకే తమరి మాట నాకు శిరోధార్యము. తమరు ఏం చెబితే అలా చేస్తాను. గోవులు, బ్రాహ్మణుల యొక్క హితము కొరకు, లోక క్షేమము కొరకు తమరు చెప్పినట్టే చేస్తాను. ” అని పలికాడు రాముడు.

వెంటనే తన ధనుస్సు చేతిలోకి తీసుకున్నాడు. వింటి నారిని గట్టిగా లాగి వదిలాడు. ఆ శబ్దానికి తాటకా వనములోని వారందరి గుండెలు అదిరిపోయాయి. భయంతో గడా గడా వణికిపోయారు. ఆ శబ్దము విన్న తాటక పరుగు పరుగున ఆ శబ్దము వచ్చిన వైపుకు వచ్చింది.

వికారంగా ఉన్న తాటకిని చూచి రాముడు లక్ష్మణునితో ఇలా అన్నాడు. “లక్ష్మణా! ఆ భయంకరాకారముతో ఉన్న యక్షిణిని చూడు. పిరికి వాళ్లు అయితే ఆమెను చూచి గుండె ఆగి చనిపోతారు కదా! ఆమె మాయావి. అందుకని ఈమె ముక్కు చెవులు కోసి వదిలేద్దాము.
ఎందుకంటే ఈమె స్త్రీ, అదే ఈమెను రక్షిస్తూ ఉంది. కాబట్టి ఈమెను చంపకుండా ఈమె పరాక్రమును నశింప చేస్తాను." అని అన్నాడు రాముడు.

రాముడు అలా లక్ష్మణుడితో చెబుతూ ఉండగానే తాటకి రాముని మీదికి గర్జిస్తూ దూకింది. ఇంతలో విశ్వామిత్రుడు కోపంతో హుంకరించాడు, తాటకిని అదిలించాడు. రామలక్ష్మణులకు స్వస్తి వాచకం పలికాడు. రాముడికి జయం కలగాలని ఆశీర్వదించాడు.

విశ్వామితుని హుంకారమునకు తాటకి భయపడలేదు. తన మాయా శక్తిచేత వారి మీద రాళ్ల వర్షము కురిపించింది. రాముడికి కోపం వచ్చింది. వెంటనే తాటకి మీద శరవర్షము కురిపించి ఆ రాళ్ల వర్షమును ఆపు చేసాడు.

తాటకి ఊరుకోలేదు, తన చేతులు చాచి రాముని మీదికి వచ్చింది. రాముడు తన బాణములతో తాటకి రెండు చేతులు ఖండించాడు. లక్ష్మణుడు ఒక కత్తి తీసుకొని తాటకి ముక్కు చెవులు కోసి ఆమెను విరూపిని చేసాడు. అయినా తాటకి ఊరుకోలేదు. తన మాయా శక్తితో వివిధము లైన ఆకారములను ధరించి మరలా రామ లక్ష్మణుల మీద రాళ్ల వర్షము కురిపించింది. రామలక్ష్మణుల మీద రాళ్ల వర్షం కురుస్తుంటే విశ్వామిత్రుడు చూచాడు.

అప్పుడు విశ్వామిత్రుడు రామునితో ఇలా అన్నాడు. “రామా! ఆమె మీద జాలి చూపకు. ఈమె పాపాత్మురాలు, దుర్మార్గురాలు. ఈమె మాయావి, వివిధములైన రూపములను ధరించగలదు. రాత్రి
సమీపించుచున్నది. ఈ లోపలే ఈమెను చంపి వెయ్యి. సంధ్యాకాలములో రాక్షసుల బలం పెరుగుతుంది. త్వరపడు." అని అన్నాడు విశ్వామిత్రుడు.

విశ్వామితుని మాటలు విన్న రాముడు వెంటనే శబ్దవేధి బాణాన్ని ఎక్కుపెట్టాడు. (శబ్ద వేధి అంటే, టార్గెట్ కనిపించనపుడు, కేవలం శబ్దం ఆధారంగా, శబ్దమును విని టార్గెట్ ను కొట్టడం). తాటక నుండి వచ్చు శబ్దమును బట్టి రాముడు బాణాన్ని విడిచాడు. ఆ బాణం సూటిగా తాటకిని తాకింది. రామ బాణం తగిలిన తాటకి రెట్టించిన కోపంతో రాముని మీదికి ఉరికింది. రాముడు మరొక బాణంతో తాటకి వక్షస్థలము మీద కొట్టాడు. ఆ బాణము సరిగా తాటకి గుండెలోంచి దూసుకుపోయింది. తాటకి కిందపడి మరణించింది.

తాటకి మరణించడం చూచి దేవతలు అంతా సంతోషించారు. దేవతల అందరి బదులు దేవేంద్రుడు విశ్వామిత్రుని తో ఇలా అన్నాడు. “ఓ మహర్షీ! నీవు రాముని యందుఎక్కువ వాత్సల్యము చూపుము. భృశాశ్వునిచే సృష్టింప బడిన అస్త్ర శస్త్రములను అన్నింటినీ రామునికి ఉపదేశింపుము. ఎందు కంటే రాముడు భవిష్యత్తులో లోక కంటకులైన రాక్షసులను సంహరించవలసి ఉన్నది. " అని పలికాడు.

తరువాత దేవేంద్రుడు దేవతలు వెళ్లిపోయారు. ఇంతలో సంధ్యాసమయము అయింది. తాటకను చంపిన రాముని సంతోషంతో చూచాడు విశ్వామిత్రుడు. వాత్సల్యంలో అతని తల
నిమిరాడు. 

" ఓ రామా! సంధ్యాసమయము అయినది. మనము ఈ రాత్రికి ఇచ్చటనే విశ్రమించి రేపు ఉదయము మన ప్రయాణము కొన సాగిద్దాము" అని అన్నాడు. రామ లక్ష్మణులు దానికి అంగీకరించారు. అందరూ ఆరాత్రికి తాటకా వనములో విశ్రమించారు. మరునాడు ఉదయము విశ్వామిత్రుడు రామలక్ష్మణులను మేల్కొలిపాడు.

ఇది వాల్మీకి విరచిత
రామాయణ మహాకావ్యములో
బాలకాండలో ఇరవై ఆరవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓంతత్సత్ ఓంతత్సత్.

Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)