శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - నాలుగవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 4)

శ్రీమద్రామాయణము

అయోధ్యా కాండము

నాల్గవ సర్గ

తరువాత దశరథుడు మంత్రులతో మరలా దీర్ఘంగా ఆలోచించాడు. మరునాడే పుష్యమీ నక్షత్రము. అందుకని, ఆలస్యం లేకుండా రాముని మరునాడు పుష్యమీ నక్షత్రము ఘడియలలో పట్టాభిషిక్తుని చేయవలెనని నిశ్చయించాడు. మంత్రులందరూ ఆ నిర్ణయానికి తమ ఆమోదము తెలిపారు. తరువాత దశరథుడు సభాభవనము నుండి తన అంత:పురమునకు వెళ్లాడు. సుమంత్రుని పిలిచి రాముని తన మందిరమునకు తీసుకొని రమ్మని ఆదేశించాడు. దశరథుని ఆదేశాను సారము సుమంత్రుడు రాముని వద్దకు వెళ్లాడు.

“ఇప్పుడేగా తండ్రి గారి వద్దనుండి వచ్చాను మరలా ఎందుకు వచ్చావు?" అని అడిగాడు.
“దశరథమహారాజుగారు తమరిని చూడాలని అనుకుంటున్నారు. మీరు మీ తండ్రి గారి వద్దకు వెళ్లాలో లేదో మీరే నిర్ణయించు కోండి." అని అన్నాడు సుమంత్రుడు. మారు మాటాడకుండా రాముడు సుమంత్రునితో కూడా దశరథుని వద్దకు వచ్చాడు. తండ్రి గారికి నమస్కరించి, ఆయన ఎదుట చేతులు కట్టుకొని నిలబడ్డాడు రాముడు. దశరథుడు రాముని ప్రేమగా లేవనెత్తి కౌగలించుకొని, పక్కనే ఉన్న ఆసనము మీద కూర్చోపెట్టాడు.

“రామా! నేను చెప్పబోవు మాటలు శ్రద్ధగా విను. నాకు వయసు అయిపోయింది. వృద్ధుడను అయ్యాను. రాజభోగాలు తనివిదీరా అనుభవించాను. ఎన్నో యజ్ఞములు, యాగములను చేసాను. ఈ భూలోకంలో సాటిలేని మేటి వీరులను సంతానంగా కలిగి ఉన్నాను. దేవ ఋణము, ఋషి ఋణము, పితృ ఋణము, విప్ర ఋణము, ఆత్మఋణము తీర్చుకున్నాను. ఇంక నీ పట్టాభిషేకము మాత్రము మిగిలి ఉన్నది. నీవు ఈ అయోధ్యకు రాజు కావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. అందుకని నిన్ను యౌవరాజ్యాభిషిక్తుని చేయ సంకల్పించాను.
ఎందుకనో నాకు కొన్ని దుశ్శకునములు పొడసూపు తున్నాయి. నా జాతకములో చెడ్డ గ్రహము లైన సూర్య, అంగారక, రాహు గ్రహములు ఉచ్ఛస్థితిలో ఉన్నట్టు జ్యోతిష్కులు చెప్పారు. ఇలాంటి పరిస్థితులలో నాకు మరణము కానీ, లేక తీవ్రమైన ఆపద కాని సంభవించే అవకాశం ఉంది. మనస్సు చంచల మైనది. ఏ నిముషానికి ఎలా ఆలోచిస్తుందో తెలియదు. అందుకే నాకు చాలా తొందరగా ఉంది. నా మనసులో మరొక ఆలోచన పొడసూపక ముందే నీ యౌవరాజ్యపట్టాభిషేకము జరిగిపోవాలి అని అనుకుంటున్నాను.

ఈ రోజు పునర్వసు నక్షత్రము. రేపు చంద్రుడు పుష్యమీ నక్షత్రములో ఉంటాడు. ఆ శుభ ముహూర్తము లో నీ పట్టాభిషేకము జరిగిపోవాలి. ఈ సందర్భములో నీవు ఈ రోజు రాత్రి అంతా నీ భార్య సీతతో సహా ఉపవాసము చేసి దర్భాసనము మీద నిద్రపోవాలి. ప్రస్తుతము భరతుడు అయోధ్యలో లేడు. భరతుడు అయోధ్యలో లేని సమయములోనే నీ పట్టాభిషేకము జరగాలని నా కోరిక. అంటే భరతుడు దుర్మార్గుడు అనికాదు. నీ సోదరుడు భరతుడు ఎల్లప్పుడూ నిన్ను అనుసరించి ఉంటూ నీ క్షేమమునే కోరుతుంటాడు. పైగా భరతుడు ధర్మాత్ముడు, దయాళువు. ఇంద్రియములను జయించిన వాడు. కానీ, మనస్సు చంచలమైనది. ఎటువంటి ధర్మాత్ముల మనస్సులు కూడా చలింపవని నమ్మకము లేదు కదా. ఎప్పుడు ఎవరికి ఎలాంటి బుద్ధిపుడుతుందో ఎవరికి తెలుసు! నీ పట్టాభిషేక వార్త విని నీ తమ్ముడు భరతుని మనస్సు కూడా మారుతుందేమో అని నా అనుమానము. అందుకని ఈ తొందర. ఇంక నీవు వెళ్లవచ్చు." అని పలికాడు దశరథుడు.

తండ్రి చెప్పిన మాటలు సావధానంగా విన్న రాముడు, తండ్రి గారి వద్ద సెలవు తీసుకొని నేరుగా తన తల్లి కౌసల్య అంతఃపురమునకు వెళ్లాడు. రాముని పట్టాభిషేక వార్త అంతకు మునుపే కౌసల్యకు తెలియడంతో, ఆమె సీతను, సుమిత్రను, లక్ష్మణుని తన వద్దకు పిలిపించుకొంది. కౌసల్య పట్టుబట్టలు ధరించి లక్ష్మీదేవికి పూజచేస్తూ ఉంది. ఆమె పక్కనే సుమిత్ర, సీత, లక్ష్మణుడు కూర్చుని ఉన్నారు.

రాముడు వచ్చి తల్లి కౌసల్యకు, సుమిత్రకు నమస్కరించాడు. ఆమెతో ఇలా అన్నాడు. “అమ్మా! తండ్రిగారు నన్ను ఇంక నుంచి ప్రజాపాలన చూడమన్నారు. అందుకని నన్ను యువరాజుగా పట్టాభిషిక్తుని చేయడానికి నిశ్చయించారు. రేపే యౌవరాజ్య పట్టాభిషేకము. ఈ రోజు రాత్రి అంతా నేను నా భార్య సీత ఉపవాసము చేసి దర్భాసనము మీద నిద్రించవలెనని ఋత్తిక్కులు, తండ్రిగారు ఆదేశించారు. అమ్మా! నీవు నాకూ, సీతకూ, రేపు జరగబోవు శుభకార్యమునకు చేయవలసిన మంగళకర కార్యక్రములు జరిపించు.” అని అన్నాడు.

తన కుమారునికి యౌవరాజ్యపట్టాభిషేకము అని తన కుమారుని నోటి నుండి విని ఆ తల్లి పొంగిపోయింది. ఆమె కండ్ల వెంట ఆనందభాష్పాలు రాలాయి. “వత్సా! రామా! చిరంజీవ, చిరంజీవ. చిరంజీవిగా వర్ధిల్లు. నీవు నీ తమ్ములకు, నీ తల్లి సుమిత్రకు సంతోషము కలుగచెయ్యి. నాయనా! నీవు పుట్టిన వేళా విశేషము చాలామంచిది. నీవు నీ మంచి గుణములతో నీ తండ్రిని సంతోషింప జేసావు. నేను శ్రీ మహావిష్ణువుకు లక్ష్మీదేవికి చేసిన పూజలు అన్నీ ఫలించాయి. అందుకే ఇక్ష్వాకు వంశానికి రాజువు అవుతున్నావు. సుఖంగా వర్థిల్లు." అని మనసారా దీవించింది.

తల్లి దీవెనలు అందుకున్న రాముడు, లక్ష్మణుని చూచి ఇలా అన్నాడు. “సోదరా! లక్ష్మణా! ఈ పట్టాభిషేకము నాకు కాదు. మన ఇద్దరికీ. మనం ఇద్దరం ఒకరికి ఒకరం తోడుగా రాజ్యపాలన చేద్దాము. నీవు నాకు రెండో ఆత్మ. అందుకే నీవే ఈ అయోధ్యకు యువరాజువు. నీ ఇష్టంవచ్ని రాజభోగములు అనుభవించు. పరిపాలన సాగించు. అసలు నీ కోసమే నేను ఈ యౌవరాజ్య పట్టాభిషేకము చేసుకుం టున్నాను." అని అన్నాడు.

తరువాత సీతా రాములు కౌసల్యకు, సుమిత్రకు నమస్కరించి, తమ మందిరమునకు వెళ్లిపోయారు.

శ్రీమద్రామాయణము
అయోధ్యా కాండము నాలుగవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)