శ్రీమద్రామాయణం - సుందర కాండము - రెండవ సర్గ (Ramayanam - SundaraKanda - Part 2)
శ్రీమద్రామాయణము
సుందర కాండము
రెండవ సర్గ
హనుమంతుడు ఏ మాత్రమూ అలసట చెందకుండా నూరుయోజనముల దూరము కల దక్షిణ సముద్రమును దాటి లంకా ద్వీపంలో ప్రవేశించాడు. త్రికూట పర్వత శిఖరము మీద నిలబడి లంకా నగరమును చూచాడు. లంకా నగరములో ఉన్న అనేక రకములైన వృక్షజాతులు, పుష్పలతలను చూచాడు హనుమంతుడు. అనేకము లైన సరోవరములూ, ఉద్యానవనములను చూచాడు. లంకా నగరము మరో అమరావతిని తలపిస్తూ ఉంది. ఆ లంకా నగరమును పూర్వము విశ్వకర్మ నిర్మించాడు. ఆ లంకా నగరము మొదట కుబేరునికి చెందినది. లంకా నగరముచుట్టు పెద్ద అగడ్తను చూచాడు.
(శత్రువులు నగరంలోకి ప్రవేశించకుండా కోట చుట్టు గొయ్యి తవ్వి దానిని నీటితో నింపి అందులో మొసళ్లను వదులుతారు. దాని పేరు అగడ్త, పరిఖ అంటారు.)
ఆ లంకా నగరము పర్వతశిఖరము మీద ఉండటం వలన గాలిలో తేలుతున్న నగరంలా ప్రకాశిస్తూ ఉంది. లంకా నగరంలో తెల్లటి ఎత్తైన భవనములు, విశాలమైన వీధులు, వందలకొలదీ కోట బురుజులు, భవనముల మీద ఎగురు పతాకములు, ధ్వజములతో లంకా నగరము దేవేంద్రుని రాజధాని అమరావతిని తలపిస్తూ ఉంది.
లంకా నగరము చుట్టు బంగారు ప్రాకారము ఉంది. లంకా నగరమును అనుక్షణము ఆయుధములు ధరించిన సైనికులు కాపలా కాస్తున్నారు. లంకా నగర కోట గోడల మీద శతఘ్నులు అమర్చబడి ఉన్నాయి. లంకా నగరమునకు అమర్చబడిన పటిష్టమైన రక్షణ విధానమును, చుట్టు ఉన్న సముద్రమును చూచి రావణుని అంత సులభంగా గెలువలేమని అనుకున్నాడు హనుమంతుడు. దేవతలకే గెలువ శక్యము కాని ఈ లంకా నగరమును వానరులు ఎలా గెలువగలరు అని సందేహంలో పడ్డాడు హనుమంతుడు. రాముడు స్వయంగా వచ్చినా రావణుని గెలిచి లంకను స్వాధీనం చేసుకోడం అంత సులభం కాదు అని అనుకొన్నాడు హనుమంతుడు. ఇంకా ఇలా ఆలోచిస్తున్నాడు.
"ఈ రాక్షసులు సామ, దాన, భేదోపాయములకు లొంగరు. ఇంక యుద్ధమే శరణ్యము. యుద్ధము చేసి లంకను గెలవడం సాధ్యము అయ్యేట్టు లేదు. నేను, సుగ్రీవుడు, నీలుడు, అంగదుడు మేము నలుగురము మాత్రమే ఈ లంకానగరములోకి రాగలము. మరి మిగిలిన వారి సంగతి ఏమిటి? ముందు నేను పోయి సీత ఎక్కడ ఉన్నదో తెలుసుకోవాలి? అసలు సీత జీవించి ఉన్నదా లేదా అనే విషయం ధృవపరచుకోవాలి. తరువాత యుద్ధము విషయం ఆలోచించవచ్చును." అని తనలో తాను అనుకున్నాడు హనుమంతుడు.
“ఇప్పుడు లంకా నగరంలోకి ఎలా ప్రవేశించాలి. కాపలాగా ఉన్న రాక్షసులను ఏమార్చి ఏ రూపంతో ప్రవేశించాలి. నేను ఈ రూపంతో లోపలకు వెళితే రాక్షసులు పట్టుకొంటారు. కాబట్టి రాక్షసులను ఏదో విధంగా వంచించి సీతను వెదకాలి." అని ఆలోచిస్తున్నాడు హనుమంతుడు.
కాని హనుమంతుని ఆలోచనలు ఎంతకూ ఒక కొలిక్కిరావడం లేదు. ఉపాయంతో కార్యం సాధించాలి అని అనుకొన్నాడు.
“ఏమి చేసినా, ఇతరుల కంట పడకుండా, కనపడీ కనపడకుండా ఉన్న అతి చిన్నరూపమును ధరించి లంకలో ప్రవేశించాలి. సీతను వెదకాలి. రామకార్యము చెడిపోకుండా నెరవేర్చాలి. ఒంటరిగా ఉన్న సీతను చూచినపుడు ఎవరైనా చూస్తే ఏం చెయ్యాలి? అసలు సీత కనపడిన తరువాత ఆమె దగ్గరకు ఎలా వెళ్లాలి? ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా మొత్తం కార్యము చెడిపోతుంది. స్థిరమైన మనసు లేకుండా పనులు చేస్తే, ఆ పనులు చెడిపోవడం తథ్యం. నాకు అన్నీ తెలుసు అని అహంకరిస్తే, ఆ అహంకారంతో తప్పులు చేయడం, ఆ కార్యము చెడిపోవడం జరుగుతుంది నూరు యోజనముల సముద్రము దాటిన ఫలము చిన్న పొరపాటుతో సర్వనాశనము అవుతుంది. అలా కాకుండా కార్యము ఎలా నిర్విఘ్నంగా నెరవేర్చాలి? పొరపాటున నేను రాక్షసుల కంటపడితే, రాముని కార్యము సమూలంగా నాశనం అవుతుంది.
ఒకవేళ రాక్షస రూపంలో సంచరిస్తే? అప్పుడు కూడా రాక్షసులు నన్ను గుర్తు పడితే. రాక్షసులకు తెలియకుండా వాళ్లలో ఒక రాక్షసుడుగా లంకలో సంచరించడం అతి కష్టం. లంకలో రాక్షసులకు తెలియని ప్రదేశము లేదు. వారికి తెలియకుండా గాలి కూడా లంకలో చొరబడలేదు. నేను ఈ రూపంతో లంకలో ప్రవేశిస్తే రాక్షసులు నన్ను పట్టుకొని చంపుతారు. కాబట్టి అతి చిన్న రూపంతోనే ఈ రాత్రికి లంకలో ప్రవేశించాలి. రాక్షసులకు కనపడీ కనపడకుండా సీతను వెదకాలి. అదే ప్రస్తుత కర్తవ్యము. ఈరాత్రికి లంకా నగరంలో ప్రవేశించి, రావణుని మందిరము అంతా సీత కోసం వెదుకుతాను." అని నిశ్చయించుకున్నాడు హనుమంతుడు.
చీకటి పడేదాకా వేచి ఉన్నాడు. సూర్యుడు అస్తమించాడు. చీకట్లు నలుమూలలా అలముకున్నాయి. అప్పుడు హనుమంతుడు అతి సూక్ష్మ రూపం ధరించాడు. దాదాపు ఒక మార్జాలము (పిల్లి) అంత రూపం ధరించాడు. చకా చకా ఎగురుతూ సుందరమైన లంకానగరంలోకి ప్రవేశించాడు హనుమంతుడు. లంకా నగరాన్ని తేరిపార చూచాడు. లంకా నగరంలో ఎత్తైన భవనాలు బారులు తీర్చి ఉన్నాయి. బంగారు, వెండి స్తంభములతో ప్రకాశిస్తున్నాయి. ఆ ఎత్తు అయిన భవన పైభాగములకు స్ఫటికములు, మణులు అమర్చిఉన్నాయి. హనుమంతుడు ఆ లంకా నగరమును ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఇంత పెద్ద నగరంలో సీతను కనుక్కొడం సాధ్యమా అని దిగులుపడు తున్నాడు.
ఆ నగరము అంతా భయంకరమైన రాక్షసులు అనుక్షణం కాపలా కాస్తున్నారు. వారి కంట పడకుండా సీతను ఎలా వెదకడం అనే సందేహం పట్టుకుంది హనుమంతునికి. ఇంతలో చంద్రోదయం అయింది. చంద్రుడు తెల్లటి చల్లటి వెన్నెల కురిపిస్తున్నాడు. లంకా నగరంలో సీతను వెదకడానికి హనుమంతునికి సాయం చేయడానికా అన్నట్టు చంద్రుడు ఆకాశంలో పైపైకి వస్తున్నాడు. మనసుకు ఆహ్లాదాన్ని కలిగించే చంద్రుని చూచాడు హనుమంతుడు.
శ్రీమద్రామాయణము
సుందర కాండము రెండవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment