శ్రీమద్రామాయణం - సుందర కాండము - మూడవ సర్గ (Ramayanam - SundaraKanda - Part 3)

శ్రీమద్రామాయణము

సుందర కాండము

మూడవ సర్గ

హనుమంతుడు ధైర్యం చేసి లంకా నగర ముఖద్వారము వద్దకు వచ్చాడు. అక్కడి నుండి లంకా నగరాన్ని చూచాడు. లంకా నగరంలో భవనాలు తెల్లగా అందంగా ఉన్నాయి. లంకా నగరము ముఖద్వారము వద్ద అసంఖ్యాకంగా ఏనుగులు నిలిచి ఉన్నాయి. అక్కడ సైనికులు కాపలా కాస్తున్నారు. లంకా నగరము చుట్టు బంగారముతో కట్టబడిన ప్రాకారమును చూచాడు హనుమంతుడు. మెల్లిగా ఆ ప్రాకారము దగ్గరకు వెళ్లాడు. అక్కడి నుండి లంకానగరమును దూరంనుండి చూచాడు.

లంకా నగరంలో ఉన్న ఇండ్లకు అమర్చబడిన ద్వారములు అన్నీ బంగారముతో నిర్మించబడి ఉన్నాయి. ఆ భవనములకు ఉన్న అరుగులు అన్నీ మణులు, మాణిక్యములతో అలంకరింపబడి ఉన్నాయి. లంకా నగరములో భవనములు అన్నీ ఆకాశాన్ని అంటుతున్నాయి. అంత ఎత్తుగా ఉన్నాయి. దేవేంద్ర నగరమువలె ఉన్న ఆ లంకా నగరమును చూచి హనుమంతుడు ఎంతో సంతోషించాడు.

అంతలోనే హనుమంతునికి ఒక సందేహము కలిగింది.

"ఈ లంకా నగరమును రావణుని సైన్యములు అహర్నిశములు కాపలా కాస్తున్నారు. కాబట్టి వీరిని బలప్రయోగంతో ఎదిరించడం చాలా కష్టము. అసలు ఇక్కడి దాకా వానరులు రావాలి కదా! కుముదుడు, అంగదుడు, సుషేణుడు, మైందుడు, ద్వివిదుడు వీరు మాత్రము సముద్రము దాటి ఈ లంకకు రాగలరేమో! తరువాత సుగ్రీవుడు, కుశపర్వుడు, ఋక్షుడు, నేను మాత్రము ఇక్కడికి రాగలము." అని అనుకున్నాడు. 

“అయినా రామలక్ష్మణుల పరాక్రమము ముందు ఈ రాక్షసులు ఎంత?" అని తనలో తాను సమాధాన పరచుకున్నాడు. ఇంతలో లంకా నగరంలో ఉన్న గృహములలో దీపములు వెలిగాయి. లంకా నగరము దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉంది. అటువంటి లంకా నగరంలోకి ప్రవేశించాడు హనుమంతుడు.

లంకా నగరానికి ఒక అధిదేవత ఉంది. ఆమె పేరు కూడా లంక. అమె లంకను నిరంతరమూ రక్షిస్తూ ఉంటుంది. హనుమంతుడు ఎంత చిన్న రూపంలో ఉన్నా లంకకు అధి దేవత అయిన లంక దృష్టిని తప్పించుకోలేక పోయాడు. లంక హనుమంతుని చూచింది. తన అనుమతి లేకుండా లంకలో ప్రవేశించిన హనుమంతుని చూచిన లంక భయంకర రూపంతో హనుమంతుని పట్టుకొంది.

“ఓ వానరా! నీవు ఎవరు? లంకా నగరంలో ఎందుకు ప్రవేశించావు? నేను నిన్ను చంపేలోగా నిజం చెప్పు. ఈ లంకా నగరాన్ని అనుక్షణం రాక్షసులు కాపలా కాస్తుంటారు. నీవు అడుగు కూడా ముందుకు వెయ్యలేవు. కాబట్టి నీ గురించి చెప్పు." అని గద్దించింది లంక.

హనుమంతుడు ఆ లంకాధి దేవతను చూచి ఇలా అన్నాడు. 

“నేను ఉన్నది ఉన్నట్టు చెబుతాను కానీ ఇంతకూ నువ్వు ఎవరు? ఈ లంకా నగర ద్వారము వద్ద ఎందుకు ఉన్నావు? నన్ను ఎందుకు బెదిరిస్తున్నావు?" అని అడిగాడు హనుమంతుడు.

అప్పటి దాకా తనను చూచి భయపడ్డ వాళ్లేకానీ తనను ఎదిరించిన వాళ్లు లేకపోవడంతో లంకకు కోపం వచ్చింది. “లంకాధి నేత రావణుని ఆజ్ఞ మేరకు నేను ఈ లంకానగరమును రక్షిస్తుంటాను. నా అనుమతి లేకుండా ఎవరూ ఈ లంకానగరంలో ప్రవేశించలేరు. ఇప్పుడు నువ్వు ప్రవేశించావు కాబట్టి నీకు చావు తప్పదు. నాచేతిలో చావడానికి సిద్ధంగా ఉండు. నేను ఎవరో చెప్పాను కదా! ఇంక నువ్వు ఎవరో చెప్పు? " అని పరుషంగా అడిగింది లంక. అవసరమైతే లంక అధిదేవతను ఎదుర్కోడానికి సిద్ధంగా ఉన్నాడు హనుమంతుడు. ఆమె మాటలు విని ఇలా అన్నాడు.

"ఏమీలేదు. ఈ లంకానగరం ఎంతో సుందరంగా ఉంది. ఎత్తైన బురుజులతోనూ, ప్రాకారములతోనూ, తోరణములతోనూ అందంగా ఉంది. అందుకని చూడటానికి వచ్చాను. ఈ లంకా నగరంలో ఉద్యానవనములు, తోటలు, సరోవరములు, ఎత్తైన భవనములు చాలా బాగున్నాయి. మరి ఇవన్నీ నేను చూడాలి కదా! నన్ను పోనివ్వు." అని అన్నాడు హనుమంతుడు అమాయకంగా.

“నా అనుమతి లేకుండా ప్రవేశించావు. నన్ను జయించు. తరువాత ముందుకు నడువు.” అంది లంక.

“నేను కేవలం లంకానగరాన్ని చూడటానికి వచ్చాను. ఈ జయించడాలు ఎందుకు. అలా చూచి ఇలా పోతాను. నన్ను పోనివ్వు.” అని అన్నాడు హనుమంతుడు.

వీడు మాటలతో వినే రకం కాదని లంక తన అరిచేతితో హనుమంతుని ఒక చరుపు చరిచింది. ఆ దెబ్బకు హనుమంతుడు కుయ్యోమని అరిచాడు. ఎడమ చేతి పిడికిలితో ఒక్కపోటు పొడిచాడు. ఆ దెబ్బకు లంక దిమ్మతిరిగి నేలమీద పడింది. “అయ్యో ఆడదాన్ని కొట్టానే." అని బాధపడ్డాడు హనుమంతుడు.

హనుమంతుని పిడికిలి దెబ్బతిన్న లంక హనుమంతునితో ఇలా అంది. “ఓ వానరా! నన్ను చంపకు. నీ లాంటి బలవంతులు స్త్రీలను చంపరు కదా! నీవు నన్ను జయించావు. నేను లంకా నగరాన్ని. నువ్వు నీ పరాక్రమంతో లంకను జయించావు. పూర్వము బ్రహ్మ నాకు ఓ వరం ప్రసాదించాడు. ఎప్పుడైతే నన్ను ఒక వానరుడు జయిస్తాడో అప్పుడే రాక్షసులకు భయం అనేది తెలుస్తుంది. ఇప్పుడు వానరుడవైన నీవు నన్ను జయించావు. బహ్మ చెప్పిన సమయము ఆసన్నమయింది.

రాక్షసులకు చేటుకాలము దాపురించింది. సీత మూలంగా రావణునికి, లంకలో రాక్షసులకు వినాశము సమీపించింది. ఓ వానరా! నీవు నీ ఇష్టం వచ్చినట్టు లంకలో ప్రవేశించు. సీత కోసరం వెదుకు. నీవు ఏం చెయ్యాలను కొన్నావో అది చెయ్యి. ఈ లంకా నగరానికి శాపం తగిలింది. దానిని ఎవరూ తప్పించలేరు.” అని పలికింది లంక.

శ్రీమద్రామాయణము
సుందర కాండము మూడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్



Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)