శ్రీమద్రామాయణం - సుందర కాండము - నాలుగవ సర్గ (Ramayanam - SundaraKanda - Part 4)
శ్రీమద్రామాయణము
సుందర కాండము
నాలుగవ సర్గ
లంక అధిదేవతను ఓడించిన హనుమంతుడు లంకలోకి ఎలా ప్రవేశించాలా అని ఆలోచించాడు. తాను రావణునికి మిత్రుడు కాదు. అందుకని సింహద్వారము గుండా ప్రవేశించడం ఉచితంకాదు. కాబట్టి, శత్రువు మాదిరి నగరము చుట్టుకట్టిన ప్రాకారము పైకి ఎక్కి లోపలకు దూకాడు. ఎడమ కాలు ముందు పెట్టి లంకానగరంలో ప్రవేశించాడు. లంకా పుర రాజమార్గముల గుండా వెళుతున్నాడు హనుమంతుడు.
లంకాపురములోని గృహముల నుండి వాద్య ధ్వనులు శ్రావ్యంగా వినపడుతున్నాయి. గృహములన్నీ మంగళకరంగా అలంకరింపబడి ఉన్నాయి. లంకానగరములోని గృహములు అన్నీ వాస్తు ప్రకారము నిర్మింపబడి ఉన్నాయి. ఒక్కొక్క గృహము ఒక్కొక్క విధముగా కట్టబడి ఉన్నాయి. కొన్ని గృహముల నుండి స్త్రీలు నాట్యము చేయు ధ్వనులు వినబడుతున్నాయి. కొన్ని చోట్ల మల్లయోధులు చేయు సింహ నాదములు వినపడుతున్నాయి. కాని కొన్ని గృహముల నుండి సుస్వరంతో మంత్రోచ్ఛారణలు, వేదాధ్యయనములు వినపడుతున్నాయి. హనుమంతుడు ఒక్కొక్క ఇంటినీ చూచుకుంటూ వెళుతున్నాడు.
లంకలో ఉన్న సైనిక సమూహములను, ప్రచ్ఛన్న వేషములతో తిరుగుతున్న రావణుని గూఢచారులను కూడా చూచాడు హనుమంతుడు. రాక్షసులు అంటే అందరూ దుష్టులు క్రూరులు అనుకున్నాడు కానీ, వారిలో కొందరు వేదాధ్యయన పరులు, నిష్టాగరిష్టులు కూడా ఉన్నారని అనుకున్నాడు హనుమంతుడు.
రాక్షసులలో కొందరు యజ్ఞదీక్ష వహించి ఉన్నారు. కొందరు శిరోముండనము చేయించుకున్నారు. (నున్నగా గుండు గీయించుకున్నారు) మరి కొందరు మంత్రోచ్ఛాటన చేస్తున్నారు. కొందరు శత్రువులను నాశనం చెయ్యడానికి మంత్రించిన దర్భలు చేత ధరించి ఉన్నారు. మరి కొందరు మారణహోమములు చేయడంలో నిమగ్నమయి ఉన్నారు. మరి కొందరు ఆయుధ ధారులై ఉన్నారు. మరి కొందరు వికృత రూపాలతో ఉన్నారు. ఇంకా మరి కొందరు శృంగార పురుషులుగా చేత పూల మాలలు ధరించి, లేపనములు పూసుకొని ఉన్నారు.
రావణుని అంత:పురము దగ్గర లక్ష మంది సైనికులతో ఒక సైనిక నివేశము ఎటువంటి పరిస్థితి నైనా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉండటం హనుమంతుడు చూచాడు. అలా చూచుకుంటూ
హనుమంతుడు రావణుని అంతఃపురము వద్దకు వచ్చాడు.
హనుమంతుడు రావణుని అంతఃపురము వద్దకు వచ్చాడు.
అంత:పురము చుట్టు ఇతరులు ఎవరూ ప్రవేశించకుండా ఎత్తైన ప్రాకారము కట్టబడి ఉంది. ఆ ప్రాకారమునకు పెద్ద ముఖ ద్వారము ఉంది. రావణుని గృహము స్వర్గము వలె ప్రకాశిస్తూ ఉంది. రావణుని అంతఃపురము నుండి మధురమైన సంగీత ధ్వనులు, నాట్యరవళులు వినిపిస్తున్నాయి. రావణుని గృహమును నిరంతరమూ రాక్షసులు కాపలా కాస్తున్నారు. అటువంటి రావణుని గృహములోకి హనుమంతుడు రహస్యముగా ప్రవేశించాడు.
శ్రీమద్రామాయణము
సుందర కాండము నాలుగవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment