శ్రీమద్రామాయణం - కిష్కింధా కాండము - అరువది ఏడవ సర్గ (Ramayanam - KishkindhaKanda - Part 67)
శ్రీమద్రామాయణము
కిష్కింధా కాండము
అరువది ఏడవ సర్గ
హనుమంతునికి తాను నూరు యోజనముల దూరము ఎగరాలని తెలుసు. అందుకు తగ్గట్టు తన శరీరాన్ని పెంచాడు. వేగాన్ని అందుకోడానికి ముందుకు దూకబోతున్నాడు. త్రివిక్రముని వలె ప్రకాశిస్తున్న హనుమంతుని చూచి వానరులు హర్షధ్వానాలు చేసారు. ఆనందంతో పెద్దగా అరుస్తున్నారు. హనుమంతుడు కూడా సంతోషంతో తన తోకను విదిలించాడు. ఒక్కసారి ఆవులించాడు. తన కన్నా పెద్దవారికి నమస్కరించాడు.“నా తండ్రి వాయుదేవుడు తన బలముతో పర్వతశిఖరములను కూడా ఎగురగొట్టగలడు. నేను వాయుదేవుని ఔరస పుత్రుడను. ఎగరడంలో ఆయనకు సమానుడను. మేరు పర్వతము చుట్టు లెక్కలేనన్ని సార్టు చుట్టిరాగలను. ఈ సముద్రమును అవలీలగా దాటగలను. నేను ఎగిరే వేగానికి సముద్రములో ఉన్న జలచరములు అన్నీ పైకి లేస్తాయి. నేను కూడా గరుడుని కన్నా అత్యంత వేగంగా ఎగురగలను. సూర్యోదయము అయిన తరువాత నేను సూర్యుని వద్దకు వెళ్లి, భూమి మీదకు వచ్చి మరలా సూర్యాస్తమయము లోపు ఆయనకు ఎదురు వెళ్లగలను. ఆకాశంలో ఎగిరే అన్ని పక్షులను అధిగమించగలను. భూమిని బద్దలు కొట్టగలను. సర్వతములను పడగొట్టగలను. మహాసముద్రములనే దాటగలను. నేను ఎగిరే వేగానికి వృక్షములు లతలు కిందపడిపోతాయి.
ఓ వానరులారా! ఆకాశాన్ని మింగుతూ ఎగురుతున్న నన్ను మీరు కనులారా చూడండి. నేను మేఘములను ఎగురగొడుతూ ఎగురుతాను. నేను ఎగిరేటప్పుటు నన్ను నా తండ్రి వాయువు,
గరుత్మంతుడు తప్ప ఇంకెవరూ నన్ను అనుసరించలేరు. నేను నూరుయోజనములు కాదు, పదివేల యోజనముల దూరము కూడా ఎగురగలను అని అనుకొంటున్నాను. నేను దేవేంద్రుని ఓడించి అమృతమును తేగలను. లంకా పట్టణమునే పెకలించి తేగలను.” అని ఆత్మవిశ్వాసంతో పలుకుతున్న హనుమంతుని చూచి వానరులు, జాంబవంతుడు సంతోషంతో హర్షధ్వానాలు చేసారు. వారు కూడా హనుమంతుని కీర్తించడం మొదలెట్టారు.
"ఓ హనుమంతా! వీరుడా! కేసరీ కుమారుడా! వేగవంతుడా! మారుతాత్మజుడా! నీవే ఈ పనిచేయగల సమర్ధుడవు. మా శోకమును పోగొట్టగల వీరుడవు. మేము నీ శుభాన్ని కోరుతున్నాము. నీ క్షేమం కొరకు ఆ భగవంతుని ప్రార్థిస్తాము. మహాఋషుల అనుగ్రహముచేతా, పెద్ద వారైన వానరుల ఆశీర్వచనములచేతా నీవు సముద్రమును దాటగలవు. నీవు వచ్చు వరకూ మేము ఒంటి కాలిమీద నిలబడి నీ రాక కొరకు ఎదురుచూస్తుంటాము. శుభంగా వెళ్లిరా!" అని హనుమంతుని స్తుతించారు వానరులు.
హనుమంతుడు ఆ వానరులతో ఇలా అన్నాడు. “ఓ వానరవీరులారా! మీ అందరి శుభాశీస్సులతో నేను ఈ సముద్రాన్ని అవలీలగా లంఘిస్తాను. నా వేగాన్ని ఎవరూ తట్టుకోలేరు. నేను ఎత్తైన
ఈ మహేంద్ర పర్వతము మీద ఎక్కి ఎగురుతాను. నా వేగానికి ఈ పర్వతము కదిలిపోతుంది." అని మిక్కిలి ఆత్మవిశ్వాసంతో అన్నాడు.
తరువాత హనుమంతుడు మహేంద్రపర్వతము మీదికి ఎక్కాడు. తన కాళ్లతో మహేంద్రపర్వత శిఖరమును తన్నాడు. మహా వేగంతో పైకి లేచాడు. ఆ వేగానికి తట్టుకోలేక మహేంద్ర పర్వతము మీద ఉన్న వృక్షములు కూలిపోయాయి. జంతువులు భయపడి పరుగెత్తిపోయాయి. బండరాళ్లు కిందికి దొర్లాయి.
హనుమంతుడు లంకవైపుకు సాగిపోయాడు.
శ్రీమద్రామాయణము
కిష్కింధా కాండము అరవై ఏడవ సర్గ సంపూర్ణము.
కిష్కింధా కాండ సర్వం సంపూర్ణము.
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.
Comments
Post a Comment