శ్రీమద్రామాయణం - కిష్కింధా కాండము - అరువది ఆరవ సర్గ (Ramayanam - KishkindhaKanda - Part 66)
శ్రీమద్రామాయణము
కిష్కింధా కాండము
అరువది ఆరవ సర్గ
జాంబవంతుడు దూరంగా కూర్చుని ఉన్న హనుమంతుని వద్దకు వెళ్లాడు. హనుమ పక్కనే కూర్చుని ఇలా అన్నాడు. “హనుమా! ఇక్కడ ఉన్న వానరులలో కెల్లా వీరుడవు నీవే కదా. పైగా సమస్త శాస్త్రములు చదివినవాడవు. అందరూ వారి బలాబలాలు గురించి చెబుతూ ఉంటే నీవు ఎందుకు ఇలా ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తున్నావు.ఓ హనుమా! నీ గురించి నీకు సరిగా తెలియదు. నీవు తేజస్సులోనూ, బలంలోనూ, పరాక్రమం లోనూ రామలక్ష్మణులతోనూ, రాజైన సుగ్రీవునితోనూ సమానుడవు. పక్షులలో కెల్లా గరుడుడు ఉత్తముడు. ఆ గరుత్మంతుడు సముద్రము మీద ఎగురుతూ సముద్రగర్భములో ఉన్న పెద్ద పెద్ద పాములను పైకి లాగడం నేను ప్రత్యక్షంగా చూచాను. గరుత్మంతుని రెక్కలకు ఎంత బలమూ, శక్తి
ఉన్నాయో నీ భుజాలకు కూడా అంతే శక్తి, బలం ఉన్నాయి. బలంలో కానీ ఎగిరే శక్తిలో కానీ నీవు గరుడునికి ఏ మాత్రం తీసిపోవు.
ఉన్నాయో నీ భుజాలకు కూడా అంతే శక్తి, బలం ఉన్నాయి. బలంలో కానీ ఎగిరే శక్తిలో కానీ నీవు గరుడునికి ఏ మాత్రం తీసిపోవు.
నీ తల్లి సామాన్యురాలు కాదు. నీ తల్లి పుంజికస్థల అనే అప్సరస. పుంజికస్థలకు అంజన అనే పేరు కూడా ఉంది. ఆమె శాప వశమున కుంజరుడు అనే వానర ప్రభువుకు కుమార్తెగా వానర స్త్రీగా జన్మించింది. ఆమె వానర స్త్రీగా జన్మ ఎత్తినా, మనుష్య రూపముతోనే లోకోత్తర సుందరిగా ప్రకాశించింది. కేసరి అను వానరుని వివాహమాడింది.
ఒక నాడు ఆమె పర్వత శిఖరము మీద విహరిస్తూ ఉంది. వాయుదేవుడు మంద్రంగా వీస్తున్నాడు. ఆ సున్నితమైన గాలికి ఆమె వేసుకున్న పమిట తొలగిపోయింది. అప్పుడు వాయు దేవుడు ఆమెను, ఆమె అంగాంగ సౌందర్యమును చూచి మోహించాడు. వాయు దేవునిలో కామ వాంఛ తలెత్తింది. వాయుదేవుడు ఆమెను కౌగలించు కున్నాడు.
అప్పుడు ఆమె భయపడింది. "ఎవరు వాడు! నా పాతివ్రత్యమును భంగపరచు వాడు ఎవరు?” అని అడిగింది.
“అంజనా! నేను వాయుదేవుడను. నిన్ను ఏమీ చేయను. భయపడకు. నేను నిన్ను కౌగలించుకున్నాను. నా మనస్సులో నిన్ను కోరుకున్నాను. మానసికంగా నీతో సంగమించాను. నీ పాతివ్రత్యమునకు భంగము కలగ కుండా, నా వలన నీకు ఒక కుమారుడు
జన్మిస్తాడు. నా కుమారుడు నాతో సమానమైన పరాక్రమము వేగము కలవాడు. ఎగరడంలో, దుమకడంలో నాతో సమానమైన బలపరాక్రమములు కలవాడు.” అని అన్నాడు.
తరువాత వాయుదేవుడు వెళ్లిపోయాడు. నీ తల్లి అంజన పక్కనే ఉన్న ఒక గుహలో నిన్ను ప్రసవించింది. పుట్టగానే నీకు అమిత మైన బల పరాక్రమములు వాయువుతో సమానమైన వేగము సంక్రమించాయి. అప్పుడే సూర్యుడు తూర్పుదిక్కున ఉదయిస్తున్నాడు. నీ తల్లి నీకు బాలసూర్యుడిని చూపించింది. బాలసూర్యుని చూచి నీవు ఫలము అనుకున్నావు. బాలసూర్యుని పట్టుకొనవలెనని నీవు ఆకాశం లోకి ఎగిరావు. నీవు మూడు వందల యోజనముల దూరము ఎగిరావు. సూర్యుని తేజస్సు నిన్ను ఆక్రమించింది. కాని నీవు భయపడలేదు. అలా ఎగురుతూనే ఉన్నావు.
సూర్యుని మీదికి వెళుతున్న నిన్ను చూచి ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని నీ మీద ప్రయోగించాడు. ఆ వజ్రాయుధము నీ ఎడమ వైపు గడ్డానికి తగిలింది. అక్కడ నీ గడ్డము కొంచెము పగిలింది. అందువలన నీకు హనుమంతుడు అనే పేరు సార్ధకము అయింది.

నిన్ను ఇంద్రుడు తన వజ్రాయుధముతో కొట్టడం చూచాడు వాయుదేవుడు. తన కుమారుని కొట్టాడు అన్న కోపంతో ముల్లోకము లలో వాయువును బంధించాడు. మూడు లోకములు గాలి లేక అల్లల్లాడిపోయాయి. అప్పుడు దేవతలందరూ వాయుదేవుని ప్రార్ధించారు. బ్రహ్మదేవుడు కూడా నీ తండ్రి వాయుదేవుని వద్దకు వచ్చాడు. నీకు ఏ అస్త్రములతో కానీ, శస్త్రములతో కానీ చావులేకుండా నీకు వరం ఇచ్చాడు. నీకు వజ్రాయుధముతో కూడా ఎలాంటి అపకారము జరగలేదు కాబట్టి, నువ్వు కోరినపుడు నీకు మరణం వచ్చేట్టు వరం ప్రసాదించాడు.
నీవు కేసరికి క్షేత్రజ న్యాయమున పుత్రుడవు. కాని వాయుదేవునికి ఔరస పుత్రుడవు. మహా బలవంతుడవు. వాయుదేవునితో సమానమైన బలము, వేగము కల వాడవు. ప్రస్తుతము మా అందరిలోకీ బలవంతుడివి, పరాక్రమ వంతుడివి, వేగముగా ఎగురగలవాడివి నీవు ఒక్కడివే. కాబట్టి నీవు విజృంభించు. సముద్రాన్ని దాటు. సీతను చూడు. మాకందరికీ మేలు చేకూర్చు. నీ వేగము పరాక్రమము చూడాలని మా అందరికీ కోరికగా ఉంది. హనుమంతా! అంజనీ పుత్రా! లే! నీ శక్తిని చూపించు. సముద్రాన్ని లంఘించు.” అని హనుమంతుని జాంబవంతుడు ఉత్సాహపరిచాడు.
జాంబవంతుని మాటలతో హనుమంతుడు పొంగిపోయాడు. తనేమిటో తన శక్తి ఏమిటో తెలుసుకున్నాడు. తన శరీరాన్ని పెంచాడు. అలా పెరిగిపోతున్న హనుమంతుని చూచి వానరులందరూ జయజయధ్వానాలు చేసారు.
శ్రీమద్రామాయణము
కిష్కింధా కాండము అరువది ఆరవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment