శ్రీమద్రామాయణం - కిష్కింధా కాండము - అరువది ఐదవ సర్గ (Ramayanam - KishkindhaKanda - Part 65)
శ్రీమద్రామాయణము
కిష్కింధా కాండము
అరువది ఐదవ సర్గ
తరువాత ఒక్కొక్కరూ లేచారు. తమ తమ బలాబలాల గురించి చెప్పసాగారు. గజుడు అనే వానరుడు లేచి నేను పది యోజనముల దూరము ఎగురగలను అని అన్నాడు. గవాక్షుడు నేను ఇరువది యోజనముల దూరము ఎగురగలను అని అన్నాడు. శరభుడు ముప్పది యోజనములు, ఋషభుడు నలుబది యోజనములు, గంధమాధనుడు యాభైయోజనములు, మైందుడు అరువది యోజనములు, ద్వివిదుడు డెబ్బది యోజనములు, సుషేణుడు ఎనుబది యోజనములు ఎగురగలము అని వరుసగా లేచి చెప్పారు. వారు చెప్పినది అంతా విన్న జాంబవంతుడు లేచి ఇలా అన్నాడు."ఇదివరకు నేను కూడా ఎంతో కొంత ఎగురగలను. కానీ ఇప్పుడు వార్ధక్యములో ఉన్నాను. అందుకని ఎగురలేను. కాని ఇది రామ కార్యము. సుగ్రీవుని ఆజ్ఞ. కాబట్టి ఏదో ఓపిక చేసుకొని నేను తొంబది యోజనములు ఎగురగలను. పూర్వము నాకు ఇంకా ఎగిరే శక్తి ఉండేది. పూర్వము బలి చక్రవర్తి చేసిన యజ్ఞములో, బలి చక్రవర్తి త్రివిక్రమునికి మూడు అడుగులు దానం ఇచ్చాడు. ఆ త్రివిక్రముని చుట్టు నేను ప్రదక్షిణం చేసాను. అప్పుడు అంత శక్తి ఉండేది. వార్ధక్యము వలన నా శక్తి అంతా తగ్గిపోయింది. కాని కేవలము తొంబది యోజనములు ఎగరడం వలన రామ కార్యము సిద్ధించదు కదా! " అని అన్నాడు, జాంబవంతుడు.
తరువాత అంగదుడు లేచాడు. “నేను మంచి యవ్వనములో ఉన్నాను. నాకు నూరు యోజనములు దూకే శక్తి ఉంది. కానీ తిరిగి రావడానికి నా శక్తి చాలుతుందో లేదో తెలియడం లేదు." అని అన్నాడు అంగదుడు.
అంగదుని మాటలు విన్న జాంబవంతుడు ఇలా అన్నాడు. “అంగదా! నీ శక్తి నాకు తెలియదా! నీకు అమోఘమైన శక్తి ఉంది. నీవు నూరు కాదు ఇంకా ఎక్కువ దూరము ఎగుర గలవు తిరిగి రాగలవు. కాని నీవు మా నాయకుడవు. మాకు మార్గదర్శకుడవు. నీవు మమ్ములను ఆజ్ఞాపించాలి కానీ నీవు కార్య రంగములోకి దిగకూడదు. నిన్ను పంపడం మంచి పద్ధతి కాదు. మేమందరమూ కలిసి నిన్ను రక్షించుకోవాలి కానీ, నిన్ను ప్రమాదములోని నెట్టకూడదు. నీవు లేకపోతే మాకు ఆజ్ఞలు ఇచ్చే వాళ్లు ఎవరు? మూలము స్థిరముగా ఉన్నప్పుడే కదా చెట్టుకు మంచి ఫలములు కాస్తాయి. మా నాయకుడివి నీవు క్షేమంగా ఉంటేనే మేము రామ కార్యమును చేయగలుగుతాము. కాబట్టి నీవు వెళ్లకూడదు. "అని పలికాడు జాంబవంతుడు.
ఆ మాటలు విన్న అంగదుడు ఇలా అన్నాడు.
"జాంబవంతా! అందరి కంటే ఎక్కువ దూరం ఎగురగలిగిన వాడను నేనే కదా. నేనూ వెళ్లక, ఇతర వానరులూ వెళ్లక పోతే, రామ కార్యము ఎలా సఫలము కాగలదు. అటువంటప్పుడు మనకు మరలా మరణమే శరణ్యము. మనము సీతజాడ తెలుసుకొని వెళితే సుగ్రీవుడు మనలను ఆదరిస్తాడు. వట్టిచేతులతో వెళితే మనమీద ఆగ్రహిస్తాడు. నీవు అన్నీ తెలిసిన వాడవు. మా అందరికంటే వయస్సులో పెద్దవాడవు. ఈ పరిస్థితులలో ఏమి చెయ్యాలో నీవే నిర్ణయించు." అని అన్నాడు అంగదుడు.
ఆ మాటలు విన్న జాంబవంతుడు ఇలా అన్నాడు.
"అంగదా! రామ కార్యము గురించి నీవు దిగులు చెందనవసరము లేదు. రామ కార్యము సాధించగల వానిని నేను ఉత్సాహపరుస్తాను. ఉద్యుక్తుడిని చేస్తాను. ." అని అన్నాడు.
వానరులందరూ తమ బలాబలముల గురించి చెబుతూ ఉంటే హనుమంతుడు దూరంగా కూర్చుని ఏదో ఆలోచిస్తున్నాడు. జాంబవంతుడు దూరంగా కూర్చుని ఉన్న హనుమంతుని వద్దకు వెళ్ళాడు.
శ్రీమద్రామాయణము
కిష్కింధా కాండము అరువది ఐదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment