శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఐదవ సర్గ (Ramayanam - Balakanda - Part 35)
శ్రీమద్రామాయణము
బాలకాండ
ముప్పది ఐదవ సర్గ
మరునాడు విశ్వామిత్రుడు, రామ లక్ష్మణులు వారి వెంట వచ్చిన మునులు అందరూ ప్రాతః కాలముననే నిద్ర లేచి, సంధ్యావందనము, అగ్నిహోత్రము మొదలగు కార్యక్రమములు ముగించుకొని ప్రయాణమునకు సిద్ధము అయ్యారు. అందరూ తమ ప్రయాణమును కొనసాగించారు. మధ్యాహ్న సమయమునకు గంగానదీ తీరమునకు చేరుకున్నారు.గంగానదీ దర్శనము చేసుకున్న రామలక్ష్మణులు, మునులు ఎంతో సంతోషించారు. వారందరూ గంగానదిలో స్నానములు చేసి పితృ తర్పణములు విడిచారు. మధ్యాహ్న భోజనములు అయిన తరువాత అందరూ విశ్వామితుని చుట్టు కూర్చున్నారు.
విశ్వామిత్రుని చూచి రాముడు ఇలా అన్నాడు. “ ఓ మహర్షీ! ఇచ్చట గంగానది మూడు పాయలుగా ప్రవహించుచున్నది కదా. ఇది ఎలా ఏర్పడినది. ఈ గంగానది ఎక్కడ సముద్రములో కలుస్తుంది. వివరించండి." అని అడిగాడు. విశ్వామిత్రుడు గంగా నది గురించి దాని ఉత్పత్తి గురించి ఇలా చెప్పసాగాడు.
ఓ రామా! హిమవంతుడు అనే రాజు ఉండేవాడు. అతనికి హిమవత్పర్వతము నివాసము. హిమవత్పర్వతము సకల ధాతువులకు. ఓషధులకు నిలయము. హిమ వంతుని భార్మ పేరు మనోరమ. ఆమె మేరు పర్వతము కుమార్తె. వారికి ఇద్దరు కుమార్తెలు ఉండేవారు. వారి పేర్లు గంగ, ఉమ. దేవతలందరూ హిమవంతుని వద్దకు పోయి గంగను తమకు ఇమ్మని అడిగారు. లోకముల యొక్క మేలు కోరిన హిమవంతుడు, తన పెద్ద కుమార్తె గంగను దేవతలకు ఇచ్చాడు. గంగ దేవతలతో పాటు వెళ్లిపోయింది.
హిమవంతుని రెండవ కుమార్తె ఉమ తపస్సు చేయడం మొదటు పెట్టింది. హిమ వంతుడు తనరెండవ కుమార్తె ఉమను మహాశివునికి ఇచ్చి వివాహము చేసాడు. గంగ, ఉమ అక్కా చెల్లెళ్లు. గంగ ఆ ప్రకారము దేవతల వెంట ఆకాశమునకు వెళ్లింది. ఉమ శివుని వెంట కైలాసమునకు వెళ్లింది.
గంగ నదీ రూపంలో దేవతల నదిగా దేవలోకములో ప్రవహిస్తూ ఉంది.
ఇది వాల్మీకి విరచిత
రామాయణ మహాకావ్యములో
బాలకాండలో ముప్పది ఐదవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ంతత్సత్ ఓంతత్సత్.
Comments
Post a Comment