శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 36)

శ్రీమద్రామాయణము

బాలకాండ

ముప్పది ఆరవ సర్గ

అంత వరకువిన్న రాముడు విశ్వామిత్రునితో ఇలా అన్నాడు. " ఓ మహర్షీ! హిమవంతుని పెద్ద కుమార్తె గంగ ఎందుకని మూడు మార్గములలో ప్రవహిస్తూ ఉంది. ఎందుకని గంగానదీ ముల్లోకములలో పవిత్రమైన నదిగా ప్రసిద్ధి చెందింది. వివరించండి.” అని అడిగాడు. విశ్వామిత్రుడు ఇలా చెప్పసాగాడు.

'మహాశివుడు తన భార్య ఉమాదేవితో సురత సౌఖ్యాలు అనుభవిస్తున్నాడు. కానీ ఉమా దేవికి మహాశివునికి ఎంత కాలానికి పుత్ర సంతానము కలగ లేదు. దేవతలందరికీ ఒక అనుమానం కలిగింది. మహాశివునికి, ఉమాదేవికి పుట్టబోయే పుత్రుని భరించే శక్తి ఈ లోకాలకు ఉందా అని. దేవతలందరు బ్రహ్మదేవుని తీసుకొని మహా శివుని వద్దకు వెళ్లారు.

బ్రహ్మ దేవుడు మహాశివునితో ఇలా అన్నాడు. “ ఓ మహాదేవా! మీకు ఉమాదేవికి పుట్టబోయే తేజోవంతుడయిన పుత్రుని ముల్లోకములు భరించలేవు. కాబట్టి మీరు ఉమాదేవి తపస్సు చేయండి. మీ తేజస్సును మీ యందే నిక్షిప్తం చేసుకోండి." అని ప్రార్థించారు.

వారి ప్రార్థనను మన్నించాడు మహాదేవుడు. “దేవతలారా! మీరు చెప్పినట్టే చేసెదను. కాని నా వీర్యమును ఎవరు ధరిస్తారో తెలియజేయండి." అని అన్నాడు. దేవతలందరూ ముక్త కంఠంతో "మీ వీర్యమును భూదేవి ధరిస్తుంది” అని పలికారు. ఆ ప్రకారమే మహాశివుడు తన వీర్యమును భూదేవి యందు నిక్షిప్తం చేసాడు. ఆ వీర్యము భూమి అంతా వ్యాపించింది.

అప్పుడు దేవతలు అగ్ని దేవుని చూచి " ఓ అగ్నిదేవా! నీవు వాయు దేవుని సాయంతో మహాదేవుని వీర్యమును నీలో నిక్షిప్తము చేసుకో" అని ప్రార్థించారు. అప్పుడు అగ్నిదేవుడు మహాశివుని వీర్యమును తనలో ధరింపజేసుకొన్నాడు.

మహాదేవుని వీర్యము ప్రభావము వలన అగ్ని దేవుని లో నుండి మహా వీరుడు కుమారస్వామి జన్మించాడు. అప్పుడు దేవతలు అందరూ మహా శివుని ఉమాదేవిని భక్తితో పూజించారు. ఇదంతా చూచి ఉ మాదేవికి పట్టరాని కోపం వచ్చింది. 

" ఓ దేవతలారా! నేను నా భర్తయందు పుత్రుని కనవలెనని కోరికతో ఉన్నాను. దానికి మీరు అడ్డు తగిలారు. నా భర్త వీర్యమును భూమిలో అగ్నిలో నిక్షిప్తం చేసారు. కాబట్టి మీరందరికీ మీ భార్యలవలన సంతానము కలుగకుండు గాక!" అని తీవ్రంగా శపించింది.

తన భర్త వీర్యమును ధరించిన భూదేవిని కూడా ఉమాదేవి శపించింది. “ఓ భూదేవీ! నీవు అనేక రూపములతో అనేక మంది భర్తలకు భార్యగా ప్రవర్తించు. నావలెనే నీకు కూడా పుత్రుల వలన ఆనందము కలుగ కుండు గాక!" అని శపించింది.

తరువాత మహా శివుడు ఉమా దేవితో సహా పశ్చిమదిక్కుగా పోయి హిమవత్పర్వతము మీద ఉత్తర దిక్కుగా ఉన్న కైలాస గిరి మీద తపస్సు చేసాడు.

ఓరామా! ఇప్పుడు నీకు గంగాదేవి కథ చెబుతాను విను.” విశ్వామిత్రుడు గంగాదేవి యొక్క కధ చెప్పసాగాడు.

ఇది వాల్మీకి విరచిత
రామాయణ మహాకావ్యములో
బాలకాండలో ముప్పది ఆరవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ంతత్సత్ ఓంతత్సత్.

Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)