శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఐదవ సర్గ (Ramayanam - Balakanda - Part 25)

శ్రీమద్రామాయణము

బాలకాండ

ఇరవై ఐదవ సర్గ

విశ్వామిత్రుని మాటలు శ్రద్ధగా విన్న రాముడు విశ్వామిత్రునితో ఇలా అన్నాడు, " ఓ మునిపుంగవా! సాధారణంగా యక్షులు తక్కువ బలం కలవారు అంటారు కదా. యక్షిణి అయిన తాటకకు అంత బలం, వీరత్వము ఎలా వచ్చింది.” అని అడిగాడు.

దానికి విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు. “ఓ రామా! పూర్వము సుకేతుడు అనే బలవంతుడు అయిన యక్షుడు ఉండేవాడు. అతనికి సంతానము లేదు. సంతానము కొరకు అతడు బహ్మదేవుని గురించి ఘోరమైన తపస్సు చేసాడు. సుకేతుడికి బ్రహ్మదేవుడు ప్రత్యక్షం అయ్యాడు. ఏమి వరము కావాలో కోరుకో అని అడిగాడు. ఆ యక్షుడు సంతానము కావాలి అని అడిగాడు. బ్రహ్మదేవుడు వేయి ఏనుగుల బలవంతురాలైన కుమార్తెను ప్రసాదించాడు కాని పుత్ర సంతానము మాత్రము ఇవ్వలేదు. ఆమె పేరు తాటక.

తాటక పెరిగి పెద్దది అయింది. సుకేతుడు తన కుమార్తె తాటకను సుందుడు అనే వాడికి ఇచ్చి వివాహం చేసాడు. సుందుడికి, తాటకకు మహా బలవంతుడు అయిన మారీచుడు అనే కుమారుడు జన్మించాడు. అగస్త్యుని శాపము వలన సుందుడు మరణించాడు. అప్పుడు తాటక, మారీచుడు ఇద్దరూ కలిసి అగస్త్యుని చంపి తినడానికి అతని మీదికి వెళ్లారు.అప్పుడు అగస్త్యుడు మారీచుని “నీవు రాక్షసుడివి కా!” అని శపించాడు. 

తాటకను “నీవు వికృత రూపంతో, భయంకరంగా మనుష్యులను చంపి తింటూ, జీవించు" అని శపించాడు. అప్పటి నుండి తాటక అగస్యుడు సంచరించిన ఈ వనమును నాశనం చేయసాగింది.
ఓ రామా! తాటక స్త్రీ అని సంకోచించ వద్దు. ఆమె దుర్మార్గురాలు. లోకకంటకు రాలు. మునులను, బ్రాహ్మణులను రక్షించుటకు ఆమె సంహరించు. ఈమెకు ఉన్న వరములు, శాపములు వలన ఈమెను నీవు తప్ప వేరెవ్వరూ సంహరించలేరు.

లోకము యొక్క హితము కోరి రాజు స్త్రీ, పురుష బేధము లేకుండా ఎవరినైనా సంహరించవచ్చును. రాజు ప్రజలను రక్షించడానికి చేసే పని పాపము అయినా సరే రాజుకు ఆపాపము అంటదు. ఇది రాజ్యపాలనలో ముఖ్యసూత్రము. ధర్మానికి విరుద్ధంగా, ప్రజలకు కంటకంగా పరిణమించిన తాటకను సంహరించడం పాపము కాదు.

పూర్వము విరోచనుని కుమార్తె, భూదేవిని చంపబోయింది. అప్పుడు దేవేంద్రుడు ఆమెను చంపాడు. పూర్వము శుక్రాచార్యుని తల్లి, లోకములో ఇంద్రుడు ఉండకూడదు, అనే కోరికతో తీవ్రంగా తపస్సుచేసింది. ధర్మ విరుద్ధమైన ఆమె తపస్సును భగ్నం చేసి ఆమెను చంపాడు విష్ణువు.

ఓ రామా! వీరే కాదు. ధర్మవిరుద్ధంగా ప్రవర్తించిన స్త్రీలను ఎందరినో చంపారు. కాబట్టి నీవు కూడా స్త్రీ అని సంకోచించక తాటకను సంహరించు." అని అన్నాడు విశ్వామిత్రుడు.

ఇది వాల్మీకి విరచిత
రామాయణ మహాకావ్యములో
బాలకాండలో ఇరవై ఐదవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓంతత్సత్ ఓంతత్సత్.

Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)