శ్రీమద్రామాయణం - బాలకాండ - నలభై ఐదవ సర్గ (Ramayanam - Balakanda - Part 45)

శ్రీమద్రామాయణము

బాలకాండ

నలభై ఐదవ సర్గ

విశ్వామిత్రుడు చెప్పిన గంగావతరణము కథను ఆశ్చర్యముతో విన్నారు రామ లక్ష్మణులు. ఆ రాత్రి అంతా గంగావతరణము కథనే మననం చేసుకుంటూ నిద్రపోయారు. మరునాడు పొద్దుటే లేచారు. సంధ్యావందనాది కార్యములు పూర్తి చేసుకున్నారు. ఇద్దరూ విశ్వామిత్రుని వద్దకు వచ్చారు. విశ్వామిత్రునికి నమస్కరించి ఆయన పక్కన నిలబడ్డారు. అప్పుడు రాముడు విశ్వామిత్రునితో ఇలా అన్నాడు.

"ఓ మహర్షీ! మీరు చెప్పిన గంగావతరణము కథ మాకు ఎంతో సంతోషమును ఆశ్చర్యమును కలిగించింది. గడిచిన రాత్రి అంతా నేను లక్ష్మణుడు ఆ కథనే మననం చేసుకున్నాము. మనము ఇప్పుడు ఆ పవిత్ర గంగానదిని దాటాలి కదా. అందుకు తగిన ఏర్పాట్లు ఈ ఆశ్రమములో ఉన్న మునికుమారులు చేసారు." అని వినయంగా చెప్పాడు రాముడు.

తరువాత విశ్వామిత్రుడు, రామలక్ష్మణులు, వారితో వచ్చిన మునులు అందర గంగానదిని దాటారు. విశాల నగరము చేరుకున్నారు.

ఆ విశాల నగరము చూచి రాముడు విశ్వామిత్రునితో ఇలా అన్నాడు. “ ఓ మహర్షీ! ఈ నగరమును ఎవరు పరిపాలిస్తున్నారు? వారు ఏ రాజవంశమునకు చెందిన వారు? వారి చరిత్ర ఏమిటి?
మాకు వివరించండి." అని అడిగాడు.

అప్పుడు విశ్వామిత్రుడు రామ లక్ష్మణులకు మునులకు విశాల నగర వృత్తాంతమును చెప్పడం మొదలు పెట్టాడు.

"ఓ రామా! ఇప్పుడు నీకు ఈ ప్రదేశములో ఏమి జరిగిందో సవిస్తరంగా చెబుతాను విను. కృతయుగములో దితి పుత్రులు, అదితి పుత్రులు ఉండేవారు. వారు మహా బలవంతులు. పరాక్రమ వంతులు. ధార్మికులు కూడా. వారందరికీ ఒక కోరిక కలిగింది. తమకు రోగములు, ముసలి తనము, మరణము, లేకుండా ఉండాలని కోరుకున్నారు. దానికి తగిన ఉపాయము గురించి ఆలోచింప సాగారు.

వారికి ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. క్షీర సాగరమును మధించి అమృతమును పొందాలని అనుకున్నారు. దితి పుత్రులు, అదితి పుత్రులు క్షీరసాగరమును మధించాలని నిశ్చయించుకున్నారు. మంథర పర్వతమును పెకలించి తెచ్చి క్షీరసాగరం లో పడవేసారు. వాసుకిని తాడుగా ఆ పర్వతమునకుచుట్టారు. మంథర పర్వతము కవ్వముగా, వాసుకి తాడుగా క్షీరసాగరమును చిలకసాగారు.

ఒక వెయ్యి సంవత్సరములు గడిచాయి. వాసుకి తన తలల నుండి విషాన్ని కక్కడం మొదలెట్టాడు. ఆ విషంలో నుండి హాలా హలము పుట్టింది. ఆ హాలా హలము జగత్తును అంతటినీ దహించసాగింది. దేవతలందరూ ఆ హాలా హలము నుండి లోకాలను రక్షించమని మహేశ్వరుడిని ప్రార్ధించారు.

ఇంతలో విష్ణు మూర్తి కూడా అక్కడకు వచ్చాడు. మహావిష్ణువు చిరునవ్వు నవ్వుతూ మహేశ్వరునితో ఇలా అన్నాడు. “ఓ మహా దేవా! నీవు అందరి కన్నా పెద్ద వాడివి. దేవాసురులు క్షీరసాగరం మధిస్తుంటే ముందు హాలా హలము పుట్టింది. అందరి కన్నా పెద్ద వాడివి నువ్వు కాబట్టి, ముందు పుట్టిన హాలా హాలమును గ్రహించుటకు నీవే సమర్థుడివి. కాబట్టి పెద్దవాడిగా ఆ హాలా హలమును తీసుకో." అని అన్నాడు.

తరువాత మహావిష్ణువు అక్కడి నుండి వెళ్లిపోయాడు. మహా శివుడు హాలా హలమును అమృతము మాదిరి తాగాడు. తరువాత శివుడు కూడా వెళ్లిపోయాడు. మరలా దేవతలు అసురులు క్షీరసాగరమును మధించసాగారు.

ఇంతలో మరొక ఉత్పాతము జరిగింది. కింద ఆధారము ఏమీ లేక పోవడంతో, మంధర పర్వతము క్షీరసాగరం అడుక్కు పోసాగింది. అప్పుడు మరలా దేవతలు, అసురులు విష్ణుమూర్తిని ప్రార్థించారు.

"ఓ మహాబాహోూ! సర్వ భూతములకు నీవే దిక్కు. మా మొర ఆలకించి ఈ మంధర పర్వతమును పైకెత్తు. మాకు సాయం చెయ్యి" అని ప్రార్థించారు.

దేవతల మొరను విన్న విష్ణువు తాను కూర్మ రూపం (తాబేలురూపం) ధరించి ఆ మంధర పర్వతము కింద చేరాడు. మంథర పర్వతము కుంగి పోకుండా ఎత్తి పట్టుకున్నాడు. తరువాత దేవ దానవులు మరలా క్షీరసాగరమును మథించసాగారు.

మరలా వేయి సంవత్సరములు గడిచిపోయాయి. అప్పుడు ధన్వంతరి, అప్సరసలు క్షీరసాగరంలో నుండి పుట్టారు. “ఓ రామా! నీళ్లను మధించగా వచ్చిన రసము నుండి పుట్టిన వారు కాబట్టి వారికి అప్సరసలు అనే పేరు వచ్చింది. ఆ అప్సరసలు అరవైకోట్ల మంది పుట్టారు. ఆ అప్సరసలను వివాహం చేసుకోడానికి దేవదానవులలో ఎవరూ ముందుకు రాలేదు. అందుకని వారు ఎవరికీ చెందని సాధారణ స్త్రీలుగా ఉండిపోయారు.

తరువాత వరుణుని కుమార్తె వారుణి (మద్యమునకు అధిదేవత) తనను ఎవరు పరిగ్రహిస్తారా అని అనుకుంటూ బయటకు వచ్చింది. ఆ వారుణిని దితి పుత్రులు స్వీకరించలేదు. అదితి పుత్రులు స్వీకరించారు. ఆ కారణం చేత అనగా వారుణిని (సురను) స్వీకరించకపోవడం చేత దితి పుత్రులు అసురులు అయ్యారు. సురను స్వీకరించడం చేత అదితి పుత్రులు (దేవతలు) సురులు అయ్యారు.
మరలా క్షీర సాగర మథనం జరిగింది. క్షీర సాగరం లోనుండి ఉచ్చైశ్రవము అనే గుర్రము, కౌస్తుభము అనే మణి, దాని తరువాత అమృతము పుట్టాయి.

ఆ అమృతము కోసరము దేవతలు అసురులు యుద్ధము చేసుకున్నారు. అసురులు నాశనం అయ్యారు. ఆ యుద్ధములో అసురులు, దైత్యులు ఒక పక్షం చేరారు. అదితి పుత్రులైన దేవతలు ఒక పక్షం చేరారు. ఆ యుద్ధంలో అందరూ నాశనం అయ్యారు.

తరువాత శ్రీ మహావిష్ణువు మోహినీ రూపంలో అమృతమును హరించుకు పోయాడు. దానితో దానవులకు కోపం వచ్చింది. దానవులు, దైత్యులు అందరూ విష్ణువు తో యుద్ధానికి దిగారు. శ్రీ మహావిష్ణువు వారి నందరినీ సంహరించాడు. దేవతలకు అధిపతి దేవేంద్రుడు. దేవదానవ యుద్ధంలో అసురులను అందరినీ చంపి, దేవేంద్రుడు ముల్లోకములకు అధిపతి అయ్యాడు.

ఇది వాల్మీకి విరచిత
రామాయణ మహాకావ్యములో
బాలకాండలో నలభై ఐదవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ంతత్సత్ ఓంతత్సత్.

Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)