శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై నాల్గవ సర్గ (Ramayanam - Balakanda - Part 24)

శ్రీమద్రామాయణము

బాలకాండ

ఇరవై నాల్గవ సర్గ

మరునాడు ఉదయమే రామ లక్ష్మణులు, విశ్వామిత్రుడు ప్రాత: కాలము లో చేయవలసిన సంధ్యావందనాది కార్యక్రములు ముగించుకొని ప్రయాణము సాగించారు. గంగానదీ తీరమునకు వచ్చారు.

అక్కడ ఉన్న మునులు విశ్వామిత్రుడు, రామలక్ష్మణులు నదిని దాటడానికి ఒక నావను తీసుకొని వచ్చారు. విశ్వామితుడు, రామలక్ష్మణులు ఆ నావను ఎక్కి గంగా నదిని దాటుతుండగా నది మధ్యలో నీరు బ్రద్దలగుతున్నట్టు పెద్దగా శబ్దం వచ్చింది. “మహర్షీ! ఆ శబ్దము ఏమిటి?" అని రామ లక్ష్మణులు విశ్వామిత్రుని అడిగారు. దాని గురించి విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు.

' ఓ రామా! పూర్వము బ్రహ్మ దేవుడు తన సంకల్ప మాత్రం చేత హిమాచలము మీద ఒక సరస్సును నిర్మించాడు. దానికి మానస సరోవరము అని పేరు. ఆ సరస్సులో నుండి ఒక నది పుట్టింది. దాని పేరు సరయూ నది. ఆ సరయూ నది అయోధ్య మీదుగా ప్రవహిస్తూ ఉన్నది. ఆ సరయూ నది మానస సరోవరమునుండి పుట్టుటచే పవిత్రమైనది. ఆ సరయూ నది ఈ ప్రదేశములో గంగానదిలో కలియుచున్నది. ఆ రెండు నదుల సంగమము వలననే ఈ ధ్వని పుట్టింది." అని చెప్పాడు విశ్వామిత్రుడు.

రామ లక్ష్మణులు ఆ నదులకు భక్తితో నమస్కరించారు. తరువాత వారు గంగానది ఆవల ఒడ్డుకు చేరుకున్నారు. త్వర త్వరగా ప్రయాణము చేస్తున్నారు. మార్గ మధ్యంలో వారికి ఒక మానవ సంచారము లేని నిర్జనమైన అడవి కనపడింది. ఆ అడవి చాలా భయంకరంగా లోపలకు పోవడానికి వీలులేకుండా ఉంది. ఆ అడవిలో అనేక క్రూర జంతువులు సంచరిస్తున్నట్టు వాటి అరుపులు వినిపిస్తున్నాయి. ఆ వనము గురించి చెప్పమని రామలక్ష్మణులు అడిగారు. అప్పుడు విశ్వామిత్రుడు ఇలా చెప్పసాగాడు.

“ ఓ రామలక్ష్మణులారా! పూర్వము ఈ ప్రదేశములో రెండు రాజ్యములు ఉండేవి. ఇంద్రుడు వృత్రాసురుని సంహరించాడు. దాని వలన ఇంద్రునికి బ్రహ్మ హత్యా పాతకము చుట్టుకుంది. ఆ పాతకము వలన ఇంద్రునికి ఆకలి వేయసాగింది. అప్పుడు దేవతలు, ఋషులు దేవేంద్రునికి మంత్రించిన నీటితో స్నానం చేయించారు. దేవేంద్రుడు తనకు అంటుకున్న ఆకలిని, బ్రహ్మ హత్య వలన కలిగిన మయలను ఈ ప్రదేశంలో వదిలిపెట్టాడు. అప్పుడు ఇంద్రుడు శుచి అయినాడు.

ఇంద్రుడు ఈ రెండు దేశములు మలదము కరూశము అనే పేర్లతో పిలువ బడుతాయి అని వరం ఇచ్చాడు. అప్పటి నుండి ఈ రెండు దేశములు ధనధాన్యములతో కళ కళ లాడుతున్నాయి.
కొంత కాలము తర్వాత ఒక యక్షిణి ఇక్కడకు వచ్చింది. ఆ యక్షిణి మహా బలశాలి. ఆ యక్షిణి సుందు అనే రాక్షసుని భార్య.. ఆమె కుమారుడే మారీచుడు అనే రాక్షసుడు. ఆ మారీచుడు గొప్ప బలవంతుడు. మాయావి. ఎల్లప్పుడూ ప్రజలను బాధిస్తూ ఉండేవాడు.

తాటక అనే రాక్షసి ఈ రెండు దేశములను నాశనం చేసింది. ఇలా అరణ్యములుగా మార్చింది. ఆ అరణ్యములలో తన నివాసము ఏర్పరచు కున్నది. అందుకే దీనిని తాటక వనము అని అంటారు. ఈ అరణ్యము లోనికి ఎవరూ పోవడానికి సాహసించరు. ఇప్పుడు నువ్వు ఆ తాటక అనే రాక్షసిని సంహరించాలి. అది ఈ రెండు రాజ్యములను సర్వ నాశనము చేసింది. దానిని చంపితే గానీ ఇక్కడి మానవులు సుఖంగా జీవించలేరు.” అని విశ్వామిత్రుడు రాముడితో ఆ తాటక వృ త్తాంతము వివరంగా చెప్పాడు.

ఇది వాల్మీకి విరచిత
రామాయణ మహాకావ్యములో
బాలకాండలో ఇరవై నాల్గవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓంతత్సత్ ఓంతత్సత్.

Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)