శ్రీమద్రామాయణం - బాలకాండ - నలభై ఒకటవ సర్గ (Ramayanam - Balakanda - Part 41)
శ్రీమద్రామాయణము
బాలకాండ
నలభై ఒకటవ సర్గ
ఇక్కడ సగరుడు తన కుమారుల రాక కోసరం ఎదురు చూస్తున్నాడు. ఎన్నాళ్లకూ తన కుమారులు యజ్ఞాశ్వముతో తిరిగి రాలేదు. అందుకని సగరుడు తన మనుమడైన అంశుమంతుని పిలిచి అతనితో ఇలా అన్నాడు.“కుమారా! నీవు వీరుడవు. పరాక్రమవంతుడవు. నీ పినతండ్రులు యజ్ఞాశ్వము కొరకు వెళ్లి చాలా కాలం అయింది. వారు ఇంకా తిరిగి రాలేదు. నీవు పోయి వారి జాడ కనుక్కొని రా. యజ్ఞాశ్వముతో తిరిగి రా! జాగ్రత్త! నీవు మహాబలవంతులతో పోరాడవలసి ఉంటుంది. కాబట్టి కావలసిన అస్త్ర శస్త్ర ములను తీసుకొని వెళ్లు. నీకు నమస్కరించిన వారికి తిరిగి నమస్కరించు. నిన్ను ఎదిరించినవారిని నాశనం చెయ్యి. విజయుడవై తిరిగిరా!" అని పలికాడు.
సగరుడి మనుమడు అయిన అంశుమంతుడు తాతగారికి నమస్కరించి తన పినతండ్రులను వెతుకుతూ బయలుదేరాడు. అంశు మంతుడు తన పిన తండ్రులు తవ్విన మార్గమును వెతుకు కుంటూ వెళ్లాడు. దారిలో అంశుమంతుడు దిగ్గజములను చూచాడు. వారిని తన పినతండ్రుల జాడను గురించి అడిగాడు. ఆ దిగ్గజములు చూపిన మార్గములో వెళ్లి అంశుమంతుడు తన పినతండుల భస్మరాసుల వద్దకు వెళ్లాడు. తన పిన తండ్రులు అలా భస్మరాసులుగా మారడం చూచి ఎంతో బాధపడ్డాడు. పక్కనే పచ్చిమేయుచున్న యజ్ఞాశ్వమును చూచాడు.
ఇంక మిగిలింది తన పిన తండ్రులకు తర్పణములు విడవాలి. దానికి జలము కావాలి. చుట్టూ చూచాడు ఎక్కడా జలాశయము కనపడలేదు. అప్పుడు గరుడుడు అక్కడకు వచ్చాడు. గరుడుడు వరుసకు సగర పుత్రులకు మేనమామ అవుతాడు. గరుడుడు అంశు మంతుని చూచి ఇలా అన్నాడు.
"కుమారా! నీ పినతండ్రుల మరణమునకు చింతింపకుము. వారి మరణమునకు లోకములు అంతా హర్షిస్తున్నాయి. నీ పినతండ్రులు అటువంటి దుర్మార్గులు. నీ పిన తండ్రులు కపిల మహర్షి శాపముతో భస్మము అయ్యారు. వీరికి ఉదక తర్షణము ఇవ్వడం ఉచితము కాదు. నీవు గంగానదిలో వీరికి తర్పణములు విడువుము. ఆ గంగానదీమ తల్లి వీరి భస్మరాసులను తడిపినపుడు మాత్రమే వీరికి స్వర్గలోక ప్రాప్తి కలుగ గలదు. కాబట్టి నీవు వీరిని గురించి చింతింపక హయమును తీసుకొని పోయి నీ తాతగారి యజ్ఞమును నిర్వర్తింపుము." అని అన్నాడు.
గరుడుని మాట ప్రకారము అంశుమంతుడు యజ్ఞాశ్వమును తీసుకొని తన పురమును చేరుకున్నాడు. యజ్ఞ దీక్షలో ఉన్న సగర చక్రవర్తితో జరిగినది అంతా చెప్పాడు. గరుడుడు తనకు తెలిపిన విషయములు అన్నీ చెప్పాడు. యజ్ఞాశ్వమును ఆయనకు అప్పగించాడు.
సగరుడు తన కుమారుల మరణమునకు చింతించాడు. తరువాత తేరుకొని యధావిధిగా యజ్ఞమును పూర్తిచేసాడు. ఇప్పుడు గంగను తీసుకొని వచ్చి కుమారుల భస్మరాసులను తడపడం ఎలాగా అని ఆలోచిస్తున్నాడు సగరుడు. ఎందుకంటే పవిత్ర గంగాజలం వారి భస్మరాసుల మీద పారితే గానీవారికి స్వర్గలోకము సిద్ధించదు. గంగ దేవతల అధీనములో స్వర్గములో ప్రవహిస్తూ ఉంది. దానిని భూమి మీదకు తీసుకొని వచ్చు ఉపాయము దొరకలేదు సగరునకు.
సగరుడు 30,000 సంవత్సరములు రాజ్యపాలన చేసాడు కానీ గంగను మాత్రము భూమి మీదకు తీసుకొని రాలేకపోయాడు. కాలము తీరి సగరుడు స్వర్గస్థుడయ్యాడు.
ఇది వాల్మీకి విరచిత
రామాయణ మహాకావ్యములో
బాలకాండలో నలభై ఒకటవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ంతత్సత్ ఓంతత్సత్.
Comments
Post a Comment