శ్రీమద్రామాయణం - బాలకాండ - నలభై మూడవ సర్గ (Ramayanam - Balakanda - Part 43)
శ్రీమద్రామాయణము
బాలకాండ
నలభై మూడవ సర్గ
బ్రహ్మదేవుడు వెళ్లిపోయిన తరువాత భగీరథుడు ఒంటికాలి మీద నిలబడి ఒక సంవత్సరము పాటు మహాశివుని గూర్చి తపస్సు చేసాడు. భగీరథుని తపస్సుకు మెచ్చి మహాశివుడు ప్రత్యక్షం అయ్యాడు.“ఓ భగీరథా! నీ తపస్సుకు మెచ్చాను. నీవు కోరినట్టు హిమవంతుని కుమార్తె అయిన గంగను నా శిరస్సున ధరిస్తాను."అని అన్నాడు.
అప్పుడు దేవలోకములో ప్రవహించు గంగానది మహా వేగంతో భూమి మీదికి దూకింది. ఆ ప్రవాహాన్ని శివుడు తన శిరస్సును అడ్డుపెట్టి ఆపాడు. గంగకు కోపం వచ్చింది.
''ఏమీ ! నా ప్రవాహ వేగాన్ని శివుడు ఆపగలడా! నేను ఆ మహాశివునితో సహా పాతాళము ప్రవేశిస్తాను.” అని మనసులో అనుకొంది గంగ.
గంగ ఆలోచనను గ్రహించాడు శివుడు. మహాశివుడు తన శిరస్సుమీద పడ్డ గంగను తన శిరస్సుమీద ఉన్న జటాజూటములలో బంధించాడు. గంగా దేవి ఎంత ప్రయత్నించిననూ ఆ జటాజూటములలో నుండి బయటకు రాలేకపోయింది.
ఆకాశము నుండి బయలు దేరిన గంగ భూమి మీదికి దిగి రాలేదు. కారణం తెలియక భగీరథుడు వ్యాకుల పడ్డాడు. మరలా ఈశ్వరుని గూర్చి తపస్సు చేసాడు. భగీరథుని తపస్సుకు సంతోషించిన మహాశివుడు గంగను బిందు సరోవర ప్రాంతంలో భూమి మీదికి విడిచి పెట్టాడు.
శివుని జటాజూటములలో నుండి విడివడిన గంగ తీవ్రమైన వేగంతో భూమి మీదికి ఏడు ప్రవాహములుగా ప్రవహించింది. ఆ ఆ ఏడు ప్రవాహములలో హ్లాదినీ, పావనీ, నళినీ అనే మూడు నదులు తూర్పుదిక్కుగా ప్రవహించాయి. సుచక్షువు, సీత, సింధు అనే మూడు నదులు పడమర దిక్కుగా ప్రవహించాయి. ఏడవది ఆఖరుది అయిన ప్రవాహము భగీరథుని అనుసరించింది.
భగీరథుడు తన రథము మీద ముందు వెళుతుంటే ఆ రథము వెంట గంగ ప్రవహించింది. గంగానది ఆకాశము నుండి భూమి మీదక ప్రవహిస్తుంటే దేవతలు, గంధర్వులు ఆశ్చర్యంగా చూస్తున్నారు.
గంగావతరణమును కనులారా చూచుటకు దేవలోకములోని వారందరూ తమ తమ వాహనముల మీద ఆకాశములో నిలబడ్డారు. ఆ గంగానది నురగలు కక్కుకుంటూ భూమి మీదికి దూకుతూ ఉంది. భూమి మీదికి దిగిన గంగ కొన్ని చోట్ల మెల్లగానూ, మరి కొన్ని చోట్ల దూకుడుగాను, కొన్ని చోట్ల వంకర టింకర గానూ, కొండలను, కోనలను దాటుకుంటూ ప్రవహిస్తూ ఉంది.
ఆగంగానది మొదట ఆకాశమునుండి మహాశివుని శిరస్సు మీద పడి అక్కడి నుండి భూమి మీదికి తన నిర్మల జలాలను ప్రవహించింది. ఆ గంగలో స్నానము చేసిన వారి సమస్త పాపములు నశించి పోయాయి. గంగా స్నానము ఆచరించిన వారు స్వర్గలోక ప్రాప్తి పొందారు. గంగలో మునిగిన వారి శారీరక బాధలు అన్నీ మటుమాయం అయ్యాయి.
భగీరథుని వెంట గంగానది వెళుతుంటే గంగానది వెంట దేవతా గణములు అన్ని వెళుతున్నాయి. సర్వ పాపములను పోగొట్టే గంగానది భగీరథుడు ఎటు వెళితే అటువెళుతూ ఉంది.
మార్గ మధ్యంలో జహ్ను మహాముని ఆశ్రమం వచ్చిది. తన ఆశ్రమం వద్ద జహ్నుమహాఋషి యాగము చేస్తున్నాడు. గంగానది ఆ ఆశ్రమమును ముంచి వేసింది. అది చూచిన జహ్ను మహాఋషికి కోపం వచ్చింది. గంగానది గర్వము అణచుటకు ఉధృతంగా ప్రవహిస్తున్న గంగా జలమును అంతా త్రాగివేసాడు.
ఇది చూచి దేవతలు అందరూ ఆశ్చర్యపోయారు. భగీరథుడు, దేవతా గణములు అందరూ జహ్ను మహాఋషిని పూజించి గంగను విడువమని వేడుకున్నారు. వారి పూజలకు సంతసించిన జహ్నువు తన చెవులనుండి గంగా ప్రవాహమును విడిచిపెట్టాడు. అప్పటి నుండి గంగానదికీ జాహ్నవి, జహ్నుసుత అనే పేర్లు వచ్చాయి.
గంగానది మరలా భగీరథుని అనుసరించి ప్రవహించసాగింది. సగర పుత్రులకు మోక్షము కల్గించాడినికి భగీరథుడు గంగను పాతాళమునకు తీసుకొని వెళ్లాడు. గంగ సగరపుత్రుల భస్మరాసుల మీదుగా ప్రవహించింది. పవిత్రమైన గంగాజలములలో మునిగి సగర పుత్రులు అందరూ వారి వారి పాపములు నశించి, స్వర్గలోకము చేరుకున్నారు.
ఇది వాల్మీకి విరచిత
రామాయణ మహాకావ్యములో
బాలకాండలో నలభై మూడవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ంతత్సత్ ఓంతత్సత్.
Comments
Post a Comment