శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఒకటవ సర్గ (Ramayanam - Balakanda - Part 21)
శ్రీమద్రామాయణము
బాలకాండ
ఇరవై ఒకటవ సర్గ
ఎప్పుడైతే దశరథుడు రాముని యాగ సంరక్షణార్ధము విశ్వామిత్రుని వెంట పంపను అని అన్నాడో, విశ్వామిత్రుడు ఆగ్రహోదగ్రుడు అయ్యాడు. ఆయన కోపం తారస్థాయి కి చేరుకుంది, “దశరథా! ఇక్ష్వాకుల వంశములో జన్మించిన నీవు ఆడిన మాట తప్పావు. ఇది రఘు వంశము వారికి ఉచితము కాదు. ఆడిన మాటను తప్పడం నీకు ఉచితము అని తోస్తే నేను వచ్చిన దారినే వెళ్లిపోతాను. ఇచ్చిన మాటను తప్పిన నీవు నీ భార్యాబిడ్డలతో సుఖంగాఉండు.” అనిఅన్నాడు విశ్వామిత్రుడు కోపంగా.విశ్వామిత్రునికి కోపం వచ్చింది అని తెలుసుకున్నాడు పురోహితుడు, కులగురువు వసిష్ఠుడు. వెంటనే లేచాడు. దశరథుని వద్దకు వచ్చి ఇలా అన్నాడు, "ఓ దశరథ మహారాజా! నీవు ఇక్ష్వాకు వంశంలో పుట్టావు. ధర్మ సంస్థాపనకు కంకణము కట్టుకున్నావు. మంచి ధైర్యవంతుడివి. అటువంటి నీవు ఈ మాదిరి పుత్ర వ్యామోహంతో ధర్మము తప్పి ఆడిన మాట తప్పడం తగునా! నీవు నీ ధర్మమును ఆచరించి అధర్మమును విడిచిపెట్టు. ఆడిన మాట తప్పడం అంటే నీవు ఇప్పటి దాకా సంపాదించుకున్న పుణ్యమును నశింపచేసుకోవడమే. కాబట్టి నీవు ఇచ్చిన మాట ప్రకారము రాముని విశ్వామిత్రుని వెంట పంపు.
ఓ దశరథ మహారాజా! నా మాట విను. విశ్వామిత్రుడు వెంట ఉంటే నీ రామునికి వచ్చిన భయం ఏమీ లేదు. ఎందుకంటే విశ్వామిత్రునికి తెలియని అస్త్ర శస్త్రములు ఏమీ లేవు. ఆయనకు తెలిసిన అస్త్ర శస్త్రములు దేవతలకు, రాక్షసులకు, గంధర్వులకు ఎవరికీ తెలియవు. పూర్వము భృశాశ్వసుడు తనకు తెలిసిన అస్త్ర శస్త్రములు అన్నీ విశ్వామిత్రునికి ఇచ్చాడు. ఆ అస్త్రములు సామాన్యమైనవి కావు. అవి భృశాశ్వసునకు దక్షప్రజాపతి కుమార్తెలకు జన్మించిన అస్త్రములు. అవి గొప్ప పరాక్రమము, శక్తి కలవి.
పూర్వము దక్షప్రజాపతి కుమార్తె జయ అను ఆమె రాక్షసులను సంహరించుటకు యాభై మంది పుత్రులను కన్నది. వారు కామ రూపులు, మహాబలురు. పరాక్రమవంతులు. వారే ఇప్పుడు అస్త్ర రూపములలో విశ్వామిత్రుని వద్ద ఉన్నారు. అవే కాదు ఈ విశ్వామిత్రుడు కొత్త కొత్త అస్త్రములను సృష్టించుటలో కూడా సమర్ధుడు. అటువంటి మహాపురుషుని వెంట రాముని పంపుటకు ఎందుకు సందేహిస్తావు?
నీకు ఇంకో విషయం తెలుసా! ఆ రాక్షసులను చంపడానికి విశ్వామిత్రునకు ఒక క్షణం కూడా పట్టదు. కాని నీకు నీ కుమారులకు పేరు ప్రతిష్ఠలు తీసుకు రావడానికే నీ దగ్గరకు వచ్చి నీ కుమారుడు నీ రాముని పంపమని అర్థిస్తున్నాడు. ఈ విషయం నీవు అర్థం చేసుకొని రాముని విశ్వామిత్రుని వెంట పంపు." అని పలికాడు.
కులగురువు వసిష్టుని మాటలకు ప్రసన్నుడయ్యాడు దశరథుడు. రాముని విశ్వామితుని వెంట పంపుటకు అంగీకరించాడు.
ఇది వాల్మీకి విరచిత
రామాయణ మహాకావ్యములో
బాలకాండలో ఇరవై ఒకటవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓంతత్సత్ ఓంతత్సత్.
Comments
Post a Comment