శ్రీమద్రామాయణం - బాలకాండ - పదహారవ సర్గ (Ramayanam - Balakanda - Part 16)

శ్రీమద్రామాయణము

బాలకాండ

పదహారవ సర్గ

విష్ణు మూర్తి దేవతల ప్రార్థనలను శ్రద్ధతో ఆలకించాడు. అన్ని విషయములు తెలిసి కూడా ఏమీ తెలియని వాని వలె వారితో ఇలా అన్నాడు.

"ఓ దేవతలారా! నేను మనుష్యునిగా అవతారము ఎత్తుతాను. కాని లోక కంటకుడైన రావణుని ఎలా సంహరించాలి. దానికి ఉ పాయము ఏమి?" అని అడిగాడు. దానికి దేవతలు ఇలా అన్నారు.

"ఓ మహావిష్ణూ! నీవు మనుష్య శరీరమును ధరించి, రావణుని యుద్ధము చేసి సంహరించు. అసలు జరిగిన విషయం ఏమిటంటే........ రావణాసురుడు చాలాకాలము బ్రహ్మదేవుని గూర్చి తపస్సు చేసాడు. రావణుని తపస్సుకు మెచ్చి బ్రహ్మగారు ఆయనకు వరాలు ఇచ్చారు. 'మనుషులతో తప్ప అతనికి వేరే వారిచేత మరణభయము లేకుండు గాక!' అని వరం ప్రసాదించాడు. 

మానవులు బలహీనులని, వారంటే రావణునికి చులకన. అందుకని అటువంటి వరము కోరాడు. ఆ వరగర్వంతో రావణుడు ముల్లోకములోని దేవతలను, మునులను, మానవులను బాధించసాగాడు. కేవలము మనుష్యులు తప్ప అతనిని వేరే ఎవరూ చంపలేరు. మామూలు మనుష్యులకు రావణుని ముందు నిలబడే ధైర్యము లేదు. కాబట్టి తమరు మానవునిగా అవతరించి రావణుని సంహరించాలి." అని వివరంగా చెప్పారు దేవతలు. 

దశరథునికి కుమారులుగా పుట్టడానికి నిశ్చయించుకొని, విష్ణుమూర్తి అంతర్థానము అయ్యాడు.
అయోధ్యలో దశరధుడు పుత్రులకొరకు యాగము చేస్తున్నాడు. ఆ హెూమ గుండము నుండి తేజోవంతుడైన, మహావీరుడు, మహాబలుడు, నల్లని ఎర్రని వస్త్రములను ధరించిన వాడు, రక్త వర్ణముకల ముఖము కలవాడు, దుందుభి వంటి కంఠధ్వని కలవాడు, సింహము వంటి కేశములు కలవాడు, శుభలక్షణములు కలవాడు, దివ్యమైన ఆభరణములు ధరించిన వాడు, పర్వతశిఖరము మాదిరి ధృఢమైన వాడు, పెద్దపులి వంటి పరాక్రమము కలవాడు, సూర్యుని వంటి తేజస్సుకలవాడు, భగభగమండే అగ్ని శిఖల మాదిరి వెలుగు చున్నవాడు, చేతిలో ఒక బంగారు కలశముతో, దానిమీద ఒక వెండి మూతతో, ఆ బంగారు పాత్ర నిండా పాయసముతో, ఒక భూతా కారము ఆవిర్భవించింది. ఆ భూతమును చూచి దశరధుడు చేతులు జోడించి నమస్కరించాడు.

ఓమహానుభావా! తమరు ఎవరు? తమరికి నేను ఏమి సేవచేయగలను." అని ప్రార్థించాడు.

ఆ భూతము దశరధుని చూచి ఇలా పలికింది. “ఓ దశరధమహారాజా! నన్ను ప్రజాపతి పంపాడు. ఈ పాయస పాత్రను మీకు ఇమ్మన్నాడు. ఇది దేవతలచేత తయారుచేయబడిన పాయసము. ఈ పాయసము సంతానమును, ఆయుష్షును, ఆరోగ్యమును, సంపదలను ప్రసాదిస్తుంది. నీవు పుత్రులను కోరి యాగము చేస్తున్నావు. ఈ పాయస పాత్రను నీ భార్యలకు ఇమ్ము. నీకు పుత్ర సంతానము కలుగుతుంది." అని పలికి ఆ దివ్యమైన పాయస పాతను దశరధుడికి ఇచ్చాడు.

దశరధుడు భక్తి శ్రద్ధలతో ఆ పాయస పాత్రను అందుకున్నాడు. తరువాత ఆ భూతమునకు ప్రదక్షిణ పూర్వకముగా నమస్కరించాడు. తరువాత ఆ భూతము అంతర్ధానము అయింది.
దశరధుడు సంతోషముతో ఆ పాయస పాత్రను తీసుకొని అంత:పురములో ప్రవేశించాడు. ఆ పాయసములో సగ భాగము కౌసల్యకు ఇచ్చాడు. మిగిలిన పాయసములో సగభాగం(అనగా నాల్గవ భాగము) సుమిత్రకు ఇచ్చాడు. మిగిలిన పాయసంలో సగం(అనగా ఎనిమిదవ భాగము) కైకకు ఇచ్చాడు. మిగిలిన పాయసం(అనగా మిగిలిపోయిన ఎనిమిదవ భాగము) ఏంచెయ్యాలా అని ఆలోచించి, దానిని మరలా సుమిత్రకు ఇచ్చాడు.

ఈ ప్రకారంగా ప్రజాపతి ప్రసాదించిన పాయసమును దశరథుడు తన ముగ్గురు భార్యలకు పంచి ఇచ్చాడు. కాని దశరధుని భార్యలు తమకు పాయస పంపకంలో హెచ్చుతగ్గులు వచ్చినందుకు ఏ మాత్రం చింతింపక, పాయసము దొరికి తమకు పుత్రసంతానము కలగడమే మహాభాగ్యం అనుకొని సంతోషించారు.

కాల క్రమేణా కౌసల్య, సుమిత్ర, కైకేయిలు గర్భవతులయ్యారు. ఆ వార్త విని దశరధుడు పరమానంద భరితుడయ్యాడు.

ఇది వాల్మీకి విరచిత
రామాయణ మహాకావ్యములో
బాలకాండలో పదహారవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓంతత్సత్ ఓంతత్సత్.

Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)