శ్రీమద్రామాయణం - బాలకాండ - నలభై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 46)

శ్రీమద్రామాయణము

బాలకాండ

నలభై ఆరవ సర్గ

“ఓ రామా! దేవాసుర యుద్ధంలో దితి కుమారులు అయిన దైత్యులు మరణించారు అని చెప్పాను కదా. తన కుమారులు మరణమునకు తల్లి దితి ఎంతో చింతించింది. తన భర్త అయిన కశ్యపుని వద్దకు పోయి ఇలా అడిగింది.

“నాధా! నీ కుమారులైన దేవతలు నా కుమారులైన దైత్యులను చంపివేసారు. ఆ దేవతలను చంపేవాడు నాకు పుత్రుడుగా కావాలి. దేవేంద్రుని చంపగల పరాక్రమ వంతుడిని నాకు పుత్రుడుగా ప్రసాదించు. నాకు కుమారుడు కావాలని నేను తపస్సు చేస్తాను. నాకు అనుమతి ఇవ్వండి." అని అడిగింది.

ఆ మాటలు విన్న కశ్యపుడు దితి తో ఇలా అన్నాడు. "ఓ దితీ! నీ కోరిక నెరవేరుతుంది. యుద్ధంలో ఇంద్రుని జయించ గల పుత్రుడు నీకు కలుగుతాడు." అని వరం ఇచ్చాడు. దితిని తన చేతితో ఒళ్లంతా తడిమాడు. దితిని ఆశీర్వదించి తపస్సుకు వెళ్లిపోయాడు కశ్యపుడు.

కశ్యపుని మాటలకు దితి చాలా ఆనందపడింది. తాను కూడా కుశప్లవనము అనే ప్రదేశములో తపస్సు చేసింది. ఆమె తపస్సు చేస్తున్న సమయంలో దేవేంద్రుడు స్వయంగా వచ్చి ఆమెకు పరిచర్యలు చేసాడు. అగ్ని కార్యము చేయుటకు సమిధలు, దర్భలు, నీళ్లు, పళ్లు అన్నీ సకాలములో సమకూర్చేవాడు. ఆమెకు శ్రమగా ఉంటే ఆమె కాళ్లు పట్టేవాడు. సకల ఉపచారములు చేసేవాడు. ఆ ప్రకారంగా 999 సంవత్సరములు ఆమె తపస్సు చేసింది. ఆమెకు దేవేంద్రుడు సేవలు చేస్తూనే ఉన్నాడు.

దేవేంద్రుడు చేసే సేవలకు చాలా ఆనందించింది దితి. “ఓ దేవేంద్రా! నేను పరాక్రమ వంతుడైన కుమారుని కొరకు నీ తండ్రి, నాభర్త అయిన కశ్యపుని వరం అడిగాను. వేయి సంవత్సరముల తరువాత నాకు కుమారుడు కలుగుతాడు అని నా భర్తనాకు వరం ప్రసాదించాడు. ఇంకొక పది సంవత్సరములలో నీకు మరొక సోదరుడు పుట్టబోతున్నాడు. నీవు, నా కుమారుడు కలిసి ఈ ముల్లోకములను పాలించండి." అని పలికింది.

తరువాత ఆమె నిద్రించడానికి లోపలకు వెళ్లింది. కాని తొందరగా నిద్ర పోవలెనని కోరికతో పొరపాటున ఆమె తల పెట్టుకొని నిద్రించ వలసిన వైపు కాళ్లు పెట్టుకొని నిద్రించింది. ఆమె ప్రమేయం లేకుండానే ఆమె తల వెంట్రుకలు ఆమె కాళ్లకు తగులుతున్నాయి. ఆ కారణం చేత ఆమె అపవిత్రము అయింది. ఆ ప్రకారంగా అపవిత్రమైన దితిని చూచి దేవేంద్రుడు సంతోషించాడు.

తరువాత ఇంద్రుడు ఆమె గర్భములోకి ప్రవేశించాడు. ఆమె గర్భములో పెరుగుతున్న పిండమును ఏడు ముక్కలుగా నరికాడు. ఆ ప్రకారంగా నరక బడ్డ ఆ పిండము గట్టిగా ఏడ్చింది. ఇంద్రుడు ఆ పిండమును చూచి " ఏడవ వద్దు ఏడవ వద్దు” అని అనునయిస్తూనే ఆ పిండమును ఖండిస్తున్నాడు.

ఆ ఏడుపు విని దితి మేలుకొంది. తన కడుపులోని పిండమును చంపవద్దని ఇంద్రుని వేడుకొంది. తన తల్లి అయిన దితి మాటను గౌరవించి ఇంద్రుడు ఆమె గర్భము లోనుండి బయటకు వచ్చాడు. దితిని చూచి ఇంద్రుడు ఇలా అన్నాడు.

"తల్లీ! నన్ను క్షమించు. నీవు తల వైపు కాళ్లు పెట్టుకొని, నీ తల వెంటుకలు నీ పాదములకు తగులునట్లు నిద్రించావు. అపచారము చేసావు. ఆ అపచారమును అవకాశముగా తీసుకొని నేను నీ గర్భములో ప్రవేశించాను. యుద్ధములో నన్ను చంపబోవు నీ కుమారుని గర్భములోనే ఏడు ముక్కలుగా ఖండించాను. నన్ను క్షమించు.” అని ప్రార్థించాడు.

ఇది వాల్మీకి విరచిత
రామాయణ మహాకావ్యములో
బాలకాండలో నలభై ఆరవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ంతత్సత్ ఓంతత్సత్.

Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)