శ్రీమద్రామాయణం - బాలకాండ - పదునెనిమిదవ సర్గ (Ramayanam - Balakanda - Part 18)

శ్రీమద్రామాయణము

బాలకాండ

పదునెనిమిదవ సర్గ

దశరథుడు తలపెట్టిన అశ్వమేధ యాగము, పుత్రుల కొరకు చేసిన యాగము పూర్తి అయ్యాయి. తమ తమ హవిర్భాగములను తీసుకొని దేవతలు తమ తమ స్థానములకు వెళ్లిపోయారు. పత్నీ సమేతంగా అయోధ్యా నగరంలో ప్రవేశించాడు. తరువాత ఋష్య శృంగుడు తన భార్య శాంతతోనూ, రోమపాదుని తోనూ అంగదేశము నకు వెళ్లిపోయాడు. అందరూ తమ తమ స్థానములకు వెళ్లిపోయిన తరువాత దశరథుడు పుత్రోదయం కొరకు ఎదురు చూస్తున్నాడు.

యజ్ఞము పూర్తి అయి ఒక సంవత్సరము గడిచింది. మరలా చైత్రమాసము వచ్చింది. వసంత ఋతువులో, చైత్రమాసములో, పునర్వసు నక్షత్రము నాడు, నవమి తిథి యందు, ఐదు గ్రహములు ఉచ్ఛ స్థానములో ఉండగా, కర్కాటక లగ్నమందు, కౌసల్యాదేవి గర్భవాసమున, సర్వలక్షణ సమన్వితుడు, సకల లోకములచే పూజింప తగినవాడు, విష్ణువు యొక్క ప్రథమ అంశ ఐన వాడు, మహాభాగుడు, ఇక్ష్వాకు వంశ వర్ధనుడు అయిన రాముడు జన్మించాడు.

విష్ణువులో నాల్గవభాగము అయిన వాడు, సత్యవంతుడు, పరాక్రమ వంతుడు, సకల సద్గుణ సంపన్నుడు అగు భరతుడు పుష్యమీ నక్షత్రంలో మీన లగ్నంలో కైకేయీ గర్భ వాసమున జన్మించాడు.

సర్వ అస్త్ర కుశలురు, వీరులు, విష్ణువులో నాలుగవ వంతు అంశ కలవారు అయిన లక్ష్మణ శతుఘ్నులు ఆశ్లేషా నక్షత్రంలో, కర్కాటక లగ్నంలో సుమిత్రా గర్భ వాసాన జన్మించారు.

ఆ ప్రకారంగా దశరథునకు ముగ్గురు భార్యల యందు నలుగురు కుమారులు జన్మించారు. ఆ సమయంలో గంధర్వులు గానం చేసారు. దేవ దుందుభులు మోగాయి. అయోధ్యలో సంబరాలు మిన్నుముట్టాయి. 

దశరథుడు ఎన్నో దాన ధర్మాలు చేసాడు. పారితోషికాలు ఇచ్చాడు. పదకొండవ రోజున నామకరణ మహోత్సవము జరిగింది. జ్యేష్ట పుత్రునకు రాముడు అనీ, తరువాత పుట్టిన కైకేయి సుతునకు భరతుడు అనీ, తరువాత పుట్టిన సుమిత్రా నందనులకు లక్ష్మణుడు, శత్రుఘ్నుడు అనీ కుల గురువు, పురోహితుడు అయిన వసిష్టుడు నామకరణం చేసాడు. ఆ నామకరణ సందర్భంలో దశరథుడు బాహ్మణులకు, అయోధ్యా పౌరులకు, జానపదులకు, సంతర్పణలు చేసాడు. వారికి ఎన్నో కానుకలు, దక్షిణలు ఇచ్చాడు.

తరువాత దశరథుడు తన కుమారులకు నామకరణము తరువాత జరిగే అన్ని సంస్కారములు యధావిధిగా అత్యంత వైభవంగా జరిపించాడు.

దశరధుని కుమారులందరిలోకి రాముడు చుక్కల్లో చంద్రుని వలె దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నాడు. రాకుమారులందరూ అన్ని విద్యలు అవలీలగా నేర్చుకుంటున్నారు. రాముడు గజములు, అశ్వములు, రథముల మీద ఎక్కియుద్ధము చేయుటలో నేర్పు సంపాదించాడు. రాముడు ధనుర్వేదము నందు ఎక్కువ ఆసక్తి చూపించేవాడు.అలాగే తండ్రి ఎడల ఎనలేని భక్తి శ్రద్ధలు చూపేవాడు. తండ్రికి సేవ చెయ్యడంలో ఎంతో ఆసక్తి కనపరిచేవాడు రాముడు.
రాముడు ఇలా ఉంటే లక్ష్మణుడికి అన్న రాముడు అంటే ఎనలేని ప్రేమ. రాముని విడిచి పెట్టి క్షణం కూడా ఉండే వాడు కాదు. చూచేవాళ్లకు ఇద్దరి శరీరములు వేరు కానీ, ప్రాణము ఒకటే అన్నట్టు ఉండేవాళ్లు. అలాగే రాముడు కూడా లక్ష్మణుని చూడంది ఒక్క క్షణం కూడా ఉండలేడు. రాత్రిళ్లు కూడా లక్ష్మణుడు పక్కన లేనిది నిద్రపోయేవాడు కాదు. ఆహార, నిద్రా, విహారలలో రాముడు లక్ష్మణుని విడిచి ఉండేవాడు కాదు. రాముడు వేటకు వెళితే లక్ష్మణుడు ధనుస్సు చేత పట్టుకొని అన్న వెంట రక్షణగా వెళ్లేవాడు.

రామ లక్ష్మణులు ఇలా ఉంటే, భరత శత్రుఘ్నులు కూడా ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోయేవారు. ఒకరి మీద ఒకరు ప్రేమానురాగాలు కలిగిన నలుగురు కుమారులను చూచుకొని దశరథుడు పొంగిపోయేవాడు. నా కన్న అదృష్టవంతుడు ముల్లోకాలలో లేడని సంబరపడిపోయేవాడు దశరథుడు.

ఇంతలో రామలక్ష్మణభరతశత్రుఘ్నులకు వివాహ వయస్సు వచ్చింది. నలుగురికీ వివాహములు చేయవలెనని సంకల్పించాడు దశరథుడు. పురోహితులతోనూ, బంధుమిత్రులతోనూ ఆలోచిస్తున్నాడు.

ఇది ఇలా ఉండగా, ఒక రోజు విశ్వామిత్ర మహర్షి దశరథుని వద్దకు వచ్చాడు. విశ్వామిత్ర మహర్షి రాకను తెలుసుకొన్న దశరథుడు తన భార్యలతో సహా ఆయనకు ఎదురు వెళ్లి ఆయనను సాదరంగా ఆహ్వానించాడు. అర్ఘ్య పాద్యములు ఇచ్చి సత్కరించాడు. ఉచితాసనము మీద ఆసీనుని చేసాడు.

“ఓ దశరథ మహారాజా! నీ రాజ్యములో ప్రజలందరూ క్షేమమే కదా! నీ మిత్రులు బంధువులు క్షేమంగా ఉన్నారు కదా! నీ ధనాగారము సమృద్ధిగా ఉన్నదా! నీ సామంత రాజులు నీకు అణిగి మణిగి ఉన్నారు కదా! నీకు శత్రుభయము లేదు కదా! నీవు దేవతలకు ప్రీతిగా యజ్ఞ యాగములు చేయుచున్నావా! ” అని అడిగాడు. తరువాత దశరథుని ఆస్థానములో ఉన్న వసిష్టుని మిగిలిన ఋషులను కుశల ప్రశ్నలు వేసాడు. అందరి క్షేమ సమాచారములు తెలుసుకొన్నాడు విశ్వామిత్రుడు.

“ ఓ విశ్వామిత్ర మహర్షీ! నీరాకతో మా మందిరము పావనమైనది. తమరి దయ వలన అందరమూ క్షేమముగా ఉన్నాము. తమరు రాజర్షులు, బ్రహ్మర్షులు. మాకు అత్యంత పూజనీయులు. తమరి రాకకు కారణమేమి! సెలవివ్వండి! అది ఎంతటి క్లిష్టతరమైన కార్మము అయినను నెరవేరుస్తాను. ఎందుకంటే తమరు నాకు దైవ సమానులు." అని వినయంగా అడిగాడు దశరథుడు. దశరథుడు పలికిన మాటలు వినిన విశ్శామిత్రుడు ఎంతో సంతోషించాడు.

ఇది వాల్మీకి విరచిత
రామాయణ మహాకావ్యములో
బాలకాండలో పదునెనిమిదవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓంతత్సత్ ఓంతత్సత్.

Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)