శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది రెండవ సర్గ (Ramayanam - Balakanda - Part 32)
శ్రీమద్రామాయణము
బాలకాండ
ముప్పది రెండవ సర్గ
" ఓ రామా! పూర్వము కుశుడు అనే మహా తపస్వి ఉండే వాడు. అతడు బ్రహ్మదేవుని కుమారుడు. అతడు సకల ధర్మములను తెలిసిన వాడు. మంచి వాడు. విదర్భ రాజకుమారి ఆయన భార్య.వారికి నలుగురు కుమారులు. వారిపేర్లు కుశాంబుడు. కుశనాభుడు. అధూర్తజసుడు. వసువు. వారందరూ తండ్రి వలె ధర్మాత్ములు. సుగుణవంతులు.
ఆయనకు రాజ్యపాలన చేయవలెనని కోరిక కలిగింది. అప్పుడు ఆ కుశుడు తన పుత్రులతో ఇలా అన్నాడు. " ఓ పుత్రులారా! మీరు ధర్మమును అనుసరించి రాజ్యపాలన చెయ్యండి." అని అన్నాడు.
తండ్రి మాటను అనుసరించి ఆ నలుగురూ జనపదములను నిర్మించారు.
- కుశాంబుని చేత నిర్మింప బడిన నగరము పేరు కౌశాంబి.
- కుశనాధుని చేత నిర్మింప బడిన నగరము పేరు మహోదయము.
- అధూర్త రజసుడు నిర్మించిన నగరము పేరు ధర్మారణ్యము.
- వసువు నిర్మించిన నగరము పేరు గిరివ్రజపురము.
కుశనాభుని భార్య ఘృతాచి. వారికి నూర్గురు కుమార్తెలు. ఆ కన్యలందరూ లోకోత్తర సౌందర్య వతులు. వారికి యుక్త వయసు వచ్చింది. ఒకరోజు ఆ కన్యలందరూ వన విహారము చేస్తున్నారు. అప్పుడు వాయుదేవుడు వారిని చూచి ఇలా అన్నాడు. “నేను వాయుదేవుడను. నేను మీ అందరనూ వివాహమాడదలిచాను. మీరు నన్ను వివాహం చేసుకుంటే మీకు దైవత్వము సిద్ధిస్తుంది. దానితో పాటు మీరు కలకాలము జీవిస్తారు. మీ మానవులకు యౌవనము కొద్ది కాలమే ఉంటుంది. కాని మా దేవతలు నిత్య యౌవనులుగా ఉంటారు. కాబట్టి నన్ను పెళ్లి చేసుకోండి." అని అన్నాడు వాయుదేవుడు.
ఆ మాటలను పరిహాసంగా తీసుకున్నారు ఆ కన్యలు. ఓ వాయుదేవా! నీవు సకల జీవరాసులలో సంచరిస్తుంటావు. అందరికీ ప్రాణ దాతవు. నీ శక్తి మాకు తెలుసు. కాని నీవు ఇలా మాట్లాడటం బాగాలేదు. మేము కుశనాభుని కుమార్తెలము. మాకు నిన్ను శపించే శక్తి కలదు కాని మా తపశ్శక్తిని మేము వృధా చేయము. ఎందుకంటే మేము స్వతంత్రు లము కాము. మా తండ్రి మాటను జవదాటము. మేమే కాదు ఈ లోకంలో ఏ కన్యకూడా తల్లి తండ్రుల మాటను జవదాటే దుస్థితి కలుగకుండు గాక! మాకు మా తండ్రి ప్రభువు. దైవము. మా తండ్రి మమ్ములను ఎవరికి ఇచ్చి వివాహము చేస్తాడో వారినో మేము వివాహము చేసుకుంటాము." అని చెప్పారు ఆ కన్యలు.
వారి మాటలకు వాయుదేవునకు కోపం వచ్చింది. వెంటనే వాయుదేవుడు తన మహిమ చేత వారి శరీరములు అన్నీ బలము లేకుండా చేసాడు. ఏ మాత్రం బలము లేని ఆ కన్యలు ఎలాగోలాగ అంత:పురము చేరుకున్నారు. కిందపడిపోయారు. బాధతో కన్నీరు కారుస్తున్నారు. వారి తండ్రి అయిన కుశనాభుడు కుమార్తె ల దుస్థితి చూచాడు. వారితో ఇలా అన్నాడు. " ఓ పుత్రికలారా! ఏమిజరిగింది? మీకు ఈ దుస్థితి ఎలా దాపురించింది. దీనికి కారణం ఎవరు." అని అడిగాడు.
ఇది వాల్మీకి విరచిత
రామాయణ మహాకావ్యములో
బాలకాండలో ముప్పది రెండవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ంతత్సత్ ఓంతత్సత్.
Comments
Post a Comment