శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై రెండవ సర్గ (Ramayanam - Balakanda - Part 22)
శ్రీమద్రామాయణము
బాలకాండ
ఇరవై రెండవ సర్గ
వసిష్ఠుని మాటలకు ఎంతో సంతోషించాడు దశరథుడు. వెంటనే స్వయంగా వెళ్లి రాముని, రాముని వెంట లక్ష్మణుని సభా భవనము నకు తీసుకొని వచ్చాడు. కౌసల్య, సుమిత్ర, దశరథుడు కలిసి రామునికి లక్ష్మణునికి మంగళాచరణము చేసారు. తమ పుత్రులను ప్రియమారా ముద్దులు పెట్టుకున్నారు. దశరథుడు రాముని, లక్ష్మణుని విశ్వామిత్రుని చేతిలో పెట్టాడు.రాముడు, లక్ష్మణుడు వెంట నడువగా, విశ్వామిత్రుడు సభాభవనము నుండి బయలుదేరాడు.
ముందు విశ్వామిత్రుడు నడుస్తున్నాడు, ఆయన వెనుక కోదండము చేతబూని కోదండ రాముడు, రాముని వెనుక ధనుర్ధారియైన లక్ష్మణుడు నడుస్తున్నారు. విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో సహా ఒకటిన్నర యోజనములు నడిచాడు. వారందరూ సరయూ నదికి దక్షిణ ప్రాంతమునకు చేరుకున్నారు.
ముందు విశ్వామిత్రుడు నడుస్తున్నాడు, ఆయన వెనుక కోదండము చేతబూని కోదండ రాముడు, రాముని వెనుక ధనుర్ధారియైన లక్ష్మణుడు నడుస్తున్నారు. విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో సహా ఒకటిన్నర యోజనములు నడిచాడు. వారందరూ సరయూ నదికి దక్షిణ ప్రాంతమునకు చేరుకున్నారు.
అప్పుడు విశ్వామిత్రుడు రాముని “రామా!” అంటూ ప్రేమగా పిలిచాడు.రాముడు విశ్వామిత్రుని దగ్గరగా వచ్చాడు. “రామా! నీవు ఆచమనము చేసి నా దగ్గరకు రా! నీకు బల, అతిబల అనే విద్యలను ఉపదేశిస్తాను. ఈ విద్యలను నీవు నేర్చుకుంటే నీకు ఆకలి, దప్పిక, శ్రమ, జ్వరము, ఉండవు,. నిన్ను ఎలాంటి రాక్షసులు కూడా ఏమీ చేయలేరు. రామా! నీవు ఈ విద్యలు నేర్చుకుంటే నీతో సమానమైన వీరుడు, పరాక్రమ వంతుడు ముల్లోకములలో ఉండడు.
రామా! సౌభాగ్యమునందు గానీ, సామర్ధ్యము నందు గానీ, జ్ఞానము నందు గానీ, బుద్ధి యందు గానీ, నీతో సమానమైన వాడు ముల్లోకములలో లేడు. దానికి తోడు నీవు ఈ బల, అతిబల అనే విద్యలు నేర్చుకుంటే, నీతో సమానమైన వాడు వర్తమానములో గానీ, భవిష్యత్తులో గాని ఉండడు, ఉండబోడు. ఈ విద్యలు బ్రహ్మదేవునిచే సృష్టింపబడినవి, వాటిని అభ్యసించుటకు నీవే తగినవాడవు." అని పలికాడు విశ్వామిత్రుడు.
ఆ మాటలను సావధానంగా విన్న రాముడు వెంటనే ఆచమనము చేసి విశ్వామిత్రుని ముందు కూర్చున్నాడు. నిశ్చలమైన మనస్సుతో రాముడు విశ్వామిత్రుని వద్దనుండి బల, అతిబల అనే విద్యలను స్వీకరించాడు. ఆ రోజు రాత్రి విశ్వామిత్రుడు, రామలక్ష్మణులతో కలిసి సరయూ తీరమున విశ్రమించాడు. అంతకు ముందు అలవాటు లేని దర్భ చాపలపై పడుకొనుటకు రామ లక్ష్మణులు కొంచెం ఇబ్బంది పడ్డారు. కాని విశ్వామిత్రుడు వారిని బుజ్జగించి పడుకోబెట్టాడు.
ఇది వాల్మీకి విరచిత
రామాయణ మహాకావ్యములో
బాలకాండలో ఇరవై రెండవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓంతత్సత్ ఓంతత్సత్.
Comments
Post a Comment