శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై మూడవ సర్గ (Ramayanam - Balakanda - Part 23)
శ్రీమద్రామాయణము
బాలకాండ
ఇరవై మూడవ సర్గ
మరునాడు సూర్యోదయం కాబోతున్నది. సూర్యోదయానికి ముందు విశ్వామిత్రుడు రామ లక్ష్మణులను తన మృదుమధురమైన మాటలతో నిద్రలేపాడు.కౌసల్యా సుప్రజా రామ పూర్వా సన్ధ్య ప్రవర్తతే।
ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్||
విశ్వామిత్రుని మాటలు విన్న రామ లక్ష్మణులు వెంటనే నిద్ర లేచారు. కాలకృత్యములు తీర్చుకొన్నారు. స్నానము, సంధ్యావందనము ఆచరించారు. సూర్యునికి అర్ఘ్యము ఇచ్చారు. గాయత్రీ మంత్రము పఠించారు. తరువాత ముగ్గురూ తమ ప్రయాణము కొనసాగించారు.
వారు సరయూనదీ గంగానదిలో కలిసే సంగమస్థానము చేరుకున్నారు. ఆ ప్రదేశంలో ఉన్న పురాతనమైన ముని ఆశ్రమములను చూచారు. ఆ ఆశ్రమములను చూచిన రామలక్ష్మణులు “ఓ మహర్షీ! ఈ ఆశ్రమములు ఎవరివి?' ఈ ఆశ్రమములలో ఎవరుఉంటారు?" అని అడిగారు.
దానికి విశ్వామిత్రుడు ఇలా సమాధానము చెప్పాడు. “ఓ రామా! ప్రస్తుతము మన్మధుడు దేహము లేకుండా అనంగుడిగా ఉన్నాడు కానీ, పూర్వము మన్మధుడు దేహము కలవాడు. మన్మధునికి కాముడు అని పేరు. పూర్వము శివుడు ఈ ప్రదేశములో తపస్సు చేసుకునేవాడు. తరువాత శివుడు వివాహం చేసుకొని వెళ్లిపోయాడు. . అటువంటి శివుని మన్మథుడు ఎదిరించాడు. అప్పుడు శివుడు హంకరించి, మన్మధుని వంక కోపంగా చూచాడు. శివుని కోపాగ్నికి మన్మధుడు భస్మము అయిపోయాడు. మన్మధుని శరీర అవయవములు అన్ని చోట్లా చెల్లాచెదరుగా పడిపోయాయి. అప్పుడు మన్మధుడు శరీరం లేనివాడు అయ్యాడు.
పూర్వము పరమశివుడు తపస్సు చేసిన ఆశ్రమము ఇదే. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఋషులు అందరూ పూర్వము పరమశివునికి శిష్యులుగాఉండేవారు. వారే ఇప్పటికీ తపస్సు చేసుకుంటూ
ఉన్నారు. వీరు ధర్మపరులు. వీరికి పాపం అటే ఏమిటో తెలియదు. మనము ఈ రాత్రికి ఇక్కడే ఉండి రేపుఉదయము మన ప్రయాణము కొనసాగిద్దాము. మనము ఇప్పుడు స్నానము, సంధ్య ఆచరించి, శుచులై ఈ ఆశ్రమములలోని ప్రవేశిద్దాము" అని అన్నాడు విశ్వామిత్రుడు.
వీరు ఈ ప్రకారము మాట్లాడుకుంటూ ఉండగా, ఆ ఆశ్రమములలో ఉన్న ఋషులు వీరి రాకను చూచి ఎంతో ఆనందించారు. రామలక్ష్మణులను విశ్వామిత్రుని సాదరంగా ఆహ్వానిచి సత్కరించారు. తరువాత ఆ ఋషులు సాయంసంధ్యాసమయంలో చేయ వలసిన సంధ్యావందనము, గాయత్రీ జపము కార్యములు ఏకాగ్రచిత్తంతో చేసారు.
ఆ రాత్రికి విశ్వామిత్రుడు, రామలక్ష్మణులు ఆ ఆశ్రమములో నిద్రించారు. విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు మార్గాయాసము తెలియకుండా అనేక పుణ్య కథలను చెప్పి ఆనందింపచేస్తూ ఉన్నాడు.
ఇది వాల్మీకి విరచిత
రామాయణ మహాకావ్యములో
బాలకాండలో ఇరవై మూడవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓంతత్సత్ ఓంతత్సత్.
Comments
Post a Comment