శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది మూడవ సర్గ (Ramayanam - Balakanda - Part 33)

శ్రీమద్రామాయణము

బాలకాండ

ముప్పది మూడవ సర్గ

తండ్రి మాటలు విన్న కుమార్తెలు ఆయనకు నమస్కరించి ఇలా అన్నారు. “వాయుదేవుడు ధర్మము తప్పి మమ్ములను వివాహము చేసుకుంటాను అని అన్నాడు. మేము తిరస్కరించాము. మా తండ్రి గారు ఉన్నారు. మేము అస్వతంత్రులము. మా తండ్రి గారిని అడుగు.”అని అన్నాము. దానికి ఆయన కోపించి మమ్ములను దుర్బలులుగా చేసాడు. ఇదీ జరిగిన సంగతి." అని చెప్పారు.
వారి మాటలు విన్న కుశ నాభుడు వారితో ఇలా అన్నాడు.

"కుమార్తెలారా! మీరు మంచి పని చేసారు. మీ ఓర్పును మెచ్చుకుంటున్నాను. మీరు వాయుదేవుని క్షమించి విడిచి పెట్టారు. పురుషులకు, స్త్రీలకు ఓర్పు అలంకారము. ఓర్పు దానము, ఓర్పు యజ్ఞము, ఓర్పు సత్యము, ఓర్పు కీర్తి. ఓర్పు ధర్మము. ఓర్పు మీదనే ఈ ధరణి అంతా నిలిచి ఉంది. కాని దేవతలకు ఓర్పు ఉండదు. కాబట్టి మీ ఓర్పును ప్రశంసిస్తున్నాను." అని పలికాడు.

తరువాత కుశధ్వజుడు మంత్రులతో తన కుమార్తెల వివాహముల గురించి మంతనాలు సాగించాడు. ఆ సమయమున చూళి అనే మహర్షి తపస్సు చేస్తున్నాడు. ఆయనకు సోమద అనే గంధర్వ కాంత పరిచర్యలు చేస్తూ ఉంది. ఆ గంధర్వ కన్య పరిచర్యలకు చూళి చాలా సంతోషించాడు.

“ఓ కన్యా! నీకు ఏమి కావాలో కోరుకో!" అని అడిగాడు.

“ఓ మహర్షీ! నాకు పుత్ర సంతానము కావాలి. కాని నాకు భర్త లేడు. నేను ఎవరికీ భార్యను కాను. అందుకే మీకు సేవలు చేస్తున్నాను. తమ వలన నాకు బ్రహ్మ తేజస్సు కలిగిన పుత్రుడు కలిగే వరమును ప్రసాదించండి." అని అడిగింది.

చూళి ఆమె కోర్కెను మన్నించాడు. ఆమెకు తన తేజస్సుతో ఒక కుమారుడిని ప్రసాదించాడు. ఆయనే చూళి మానస పుత్రుడు. ఆయన పేరు బ్రహ్మదత్తుడు. సోమద కుమారుడైన బ్రహ్మదత్తుడు కాంపిల్య నగరంలో నివసిస్తున్నాడు.

ఇది ఇలా ఉండగా కుశనాభుడు తన నూర్గురు కుమార్తెలను బ్రహ్మదత్తునికి ఇచ్చి వివాహము చేయవలెనని నిశ్చయించుకున్నాడు. ఆ విషయం బ్రహ్మ దత్తునితో సంప్రదించాడు. ఈ వివాహానికి బ్రహ్మ దత్తుడు ఒప్పుకున్నాడు. కుశనాభుడు తన నూర్గురు కుమార్తెలను బ్రహ్మ దత్తునికి ఇచ్చి వివాహం జరిపించాడు.

బ్రహ్మ దత్తుని చేతి స్పర్శ తగలగానే వారికి వాయుదేవుని వలన కలిగిన దుర్బలత్వము తొలగిపోయింది. పరిపూర్ణ ఆరోగ్యంతో ప్రకాశించారు. బ్రహ్మ దత్తుడు తన నూర్గురు భార్యలతో కాంపిల్యల నగరం చేరుకున్నాడు. సోమద తన కోడళ్లను చూసి మురిసిపోయింది. వారి అందచందాలను చూసి ఎంతో సంతోషపడింది.

ఇది వాల్మీకి విరచిత
రామాయణ మహాకావ్యములో
బాలకాండలో ముప్పది మూడవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ంతత్సత్ ఓంతత్సత్.

Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)