శ్రీమద్రామాయణం - బాలకాండ - పదిహేడవ సర్గ (Ramayanam - Balakanda - Part 17)

శ్రీమద్రామాయణము

బాలకాండ

పదిహేడవ సర్గ

ఆ విధంగా విష్ణువు దశరథునికి పుత్రుడుగా జన్మించాలి అని నిర్ణయించుకొన్న తరువాత బ్రహ్మదేవుడు దేవతలందరినీ పిలిచి వారితో ఇలా అన్నాడు.

" శ్రీ మహావిష్ణువు రావణాసురుని సంహరించడానికి మానవ రూపంలో జన్మించబోతున్నాడు. మీరంతా ఆయనకు సాయంగా వెళ్లాలి. మీ మీ అంశలతో కామరూపులు, అత్యధిక బలవంతులు అయిన పుత్రులను సృష్టించండి. వారికి అన్ని మాయలు తెలిసి ఉండాలి. వారు శూరులు గానూ, వాయువేగముతో ప్రయాణించగలవారు గానూ అయి ఉండాలి. విష్ణువుతో సరి తూగ గల పరాక్రమ వంతులు అయి ఉండాలి. అదే కాకుండా నీతి మంతులు అయి ఉండాలి. వారు ఎవరి చేత గానీ, ఏ ఆయుధము చేత గానీ చంపబడకూడదు. సర్వ అస్త్ర సంపన్నులు అయి ఉండాలి. అటువంటి వారిని మీరందరూ అప్సరసల యందు, గంధర్వ స్త్రీలయందు సృష్టించండి. వారందరూ వానరులు అయి ఉండాలి. ఇంతకు ముందే జాంబవంతుడు అనే ఋక్ష శ్రేష్టుడు (ఎలుగుబంటి) నేను ఆవలించినపుడు నా ముఖము నుండి పుట్టాడు. వీరందరూ ఆ జాంబవంతునికి తోడుగా ఉంటారు." అని పలికాడు.

బ్రహ్మదేవుని ఆజ్ఞ ప్రకారము దేవతలు అందరూ తమ తమ అంశలతో వానరులను సృష్టించారు.
  • దేవేంద్రుని అంశతో వాలి జన్మించాడు.
  • సూర్యుని అంశతో సుగ్రీవుడు జన్మించాడు.
  • బ్రహస్పతి అంశతో తారుడు అనే వానరుడు జన్మించాడు.
  • కుబేరుని అంశతో గంధమాధనుడు అనే వానరుడు పుట్టాడు.
  • అగ్ని అంశతో నీలుడు అనే వానరుడు పుట్టాడు.
  • అశ్వినీ దేవతల అంశలతో మైందుడు, ద్వివిదుడు అనే వానరులు పుట్టారు. 
  • వరుణుని అంశతో సుషేణుడు అనే వానరుడు పుట్టాడు.
  • పర్జన్యుని అంశతో శరభుడు అనే వానరుడు పుట్టాడు.
  • వాయుదేవునికి హనుమంతుడు అనే వానరుడు పుట్టాడు.
  • ఇంకా అనేకానేక దేవతల అంశలతో లక్షల కొద్దీ వారనులు సృజింపబడ్డారు.
వారందరూ కాపరూపులు, బలశాలురు. ఆ వానరులు ఏ దేవతల అంశలతో జన్మించారో ఆ వానరులకు ఆయా దేవతల శక్తులు, బలపరాక్రమములు సంక్రమించాయి. ఆ వానరులందరూ యుద్ధ విద్యలో కౌశలము కలవారు. వారి ఆయుధములు శిలలు, వృక్షములు, వారి గోళ్లు, దంతములు. 

వారందరూ ఋక్షవత పర్వతము మీద నివసిస్తున్నారు. ఆ వానరులందరూ తమ తమ నాయకులుగా వాలి, సుగ్రీవుడు, నలుడు, నీలుడు, హనుమంతుడు మొదలగు వారిని సేవిస్తున్నారు.

అమిత బలశాలి అయిన వాలి తన బాహు బలముతో వానరులందరినీ రక్షిస్తున్నాడు. ఆ వానరులు ఈ భూమి అంతా ఆక్రమించి ఉన్నారు. ఆ వానరులందరూ శ్రీ రామునికి సహాయము చేయుటకు సృష్టింపబడ్డారు.

ఇది వాల్మీకి విరచిత
రామాయణ మహాకావ్యములో
బాలకాండలో పదిహేడవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓంతత్సత్ ఓంతత్సత్.

Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)