శ్రీమద్రామాయణం - బాలకాండ - పందొమ్మిదవ సర్గ (Ramayanam - Balakanda - Part 19)
శ్రీమద్రామాయణము
బాలకాండ
పందొమ్మిదవ సర్గ
దశరథుని చూచి విశ్వామితుడు ఇలా అన్నాడు, “ ఓ దశరథ మహారాజా! ఇక్ష్వాకు వంశంలో పుట్టి, వసిష్ఠుని పురోహితుని గా గల నీవు ఇంతటి వినయ విధేయతలతో మాట్లాడటం సమంజసముగా ఉంది. నేను ఏమి కోరినా నెరవేరుస్తాను అన్నావు. నేను వచ్చిన కార్యము చెబుతాను. జాగ్రత్తగా విను. విన్న తరువాత నీ మాట నిలబెట్టుకో.నేను ఒక సిద్ధికొరకు ప్రయత్నిస్తున్నాను. దానికి కొన్ని నియమాలు అవలంబిస్తున్నాను. కాని ఆ నియమాలకు మారీచుడు, సుబాహుడు అనే ఇద్దరు రాక్షసులు అవరోధము కలిగిస్తున్నారు. నేను పూనిన వ్రతము సమాప్తి అయ్యే కాలములో ఆ రాక్షసులు యజ్ఞవేదిక మీద రక్తమును మాంసమును పడవేసి అపవిత్రము చేస్తున్నారు. ఆ ప్రకారంగా ఆ వ్రతము చెడిపోయింది. అందువల్ల నిరాశతో నీ వద్దకు వచ్చాను.
నేను ఆ రాక్షసులను కట్టడి చేయగలను. కానీ వ్రత సమయములో కోపము తెచ్చుకోకూడదు. శపించకూడదు. ఆ కారణం చేత నాకు ఒక వీరుడి అవసరం వచ్చింది. నీ కుమారుడు,
మహావీరుడు అయిన రాముని నాకు ఇమ్ము. రాముడు ఆ రాక్షసులను సంహరించడానికి సమర్థుడు. రాముడు ఆ రాక్షసులను సంహరించి ముల్లోకములలో కీర్తివంతుడౌతాడు. ఆ మారీచ సుబాహులను రాముడు తప్ప వేరెవ్వరూ చంపలేరు. నీవు పుత్ర వ్యామోహముతో వెనకాడకుము. నీ రాముని కి ఏం అపకారము కలగకుండా నీకు అప్పచెబుతాను.
ఓ దశరథ మహారాజా! రాముని గురించి నీకన్నా నాకు వసిష్ఠునకు మాత్రమే ఎక్కువగా తెలుసు. నీకు, నీ కుమారుడు రాముడు సామాన్యుడు గా కనపడుతున్నాడు. కాని రాముని అసలు స్వరూపము మా వంటి తపశ్శాలులకు మాత్రమే తెలుసు. ఓ రాజా! నీవు ధర్మాత్ముడవైతే, నీ రాముని కీర్తి ముల్లోకములకు తెలియవలెనంటే రాముని నా వెంట పంపు. నీ పురోహితుడు వసిష్ఠుని, మంత్రులను సంప్రదించి రాముని నా వెంట పంపు. కాని తొందరగా పంపు.
ఎందుకంటే నా యాగము పదిదినములు జరుగుతుంది. ఆ పది దినములు రాముడు నా వెంట ఉండాలి. కాబట్టి సమయము మించి పోకుండా ఒక నిర్ణయము తీసుకో. నీకు క్షేమం కలుగుతుంది.” అని పలికాడు విశ్వామిత్రుడు.
విశ్వామిత్రుడు రాక్షసులను చంపడానికి రాముని పంపు అన్న మాట విన్నప్పటి నుండి దశరథుడు శోకంతో కుమిలిపోతున్నాడు. విశ్వామిత్రుని మాటలు దశరథునికి పిడుగుపాటు లాగా తగిలాయి. సింహాసనము మీద కూర్చోలేకపోయాడు దశరథుడు.
ఇది వాల్మీకి విరచిత
రామాయణ మహాకావ్యములో
బాలకాండలో పందొమ్మిదవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓంతత్సత్ ఓంతత్సత్.
Comments
Post a Comment