శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పయ్యవ సర్గ (Ramayanam - Balakanda - Part 30)

శ్రీమద్రామాయణము

బాలకాండ

ముప్పయ్యవ సర్గ

మరునాడు రామ లక్ష్మణులు విశ్వామిత్రునితో ఇలాఅన్నారు. “ఓ మహర్షీ! మీ యాగము భగ్నము చేయుటకు రాక్షసులు ఎప్పుడు వస్తారు. మేము ఎప్పుడు వారిని ఎదుర్కొనవలెను. ఎందుకంటే రాక్షసులు వచ్చిన తక్షణం మేము వారిని ఎదుర్కోవాలి కదా!" అని అడిగారు.

ఆసమయములో విశ్వామిత్రుడు మౌనముద్రలో ఉన్నాడు. అందుకని ఆయన పక్కనే ఉన్న ఋషులు రామలక్ష్మణులతో ఇలా అన్నారు. “మహర్షుల వారు మౌనదీక్షలో ఉన్నారు. నేటి నుండి ఆరు రాతులు మీరు యాగమును రక్షించవలెను." అని పలికారు. వారి ఆజ్ఞను శిరసావహించారు రామలక్ష్మణులు. నిరంతరమూ ధనస్సును చేత బూని రామ లక్ష్మణులు ఆరు పగళ్లు ఆరు రాత్రులు యాగమును రక్షించారు. వారు విశ్వామిత్రుని పక్కను ఉండి ఆయనకు ఎలాంటి ఆపదా రాకుండా రక్షించారు.

ఆరవ దినము గడుచు చున్నది. రాముడు లక్ష్మణుని చూచి "లక్ష్మణా! ఇది ఆరవ రోజు. చాలా అపమత్తంగా ఉండు. రాక్షసులు ఏ క్షణమునైనా దాడి చేయవచ్చు." అని లక్ష్మణుని హెచ్చరించాడు.

ఋషులు యజ్ఞము చేస్తున్నారు. అగ్నిహోత్రము మండుచున్నది. ఒక్కసారిగా అగ్నిహోత్రము లోనుండి మంటలు భగ్గున పైకి లేచాయి. ఏదో జరగబోతోంది అని అనుకున్నాడు రాముడు.
ఇంతలో ఆకాశము నుండి ఒక భయంకరమైన శబ్దము వినిపించింది. మారీచుడు, సుబాహుడు అనే రాక్షసులు మేఘముల రూపములో ఆకాశము అంతా కమ్ముకున్నారు. ఆ రాక్షసులు ఆకాశము నుండి రక్తమును వర్షము వలె కురిపించారు. రక్తము పడిన హెూమ గుండము లో నుండి అగ్ని జ్వాలలు పైకి ఎగిసాయి.

ఇదంతా చూచిన రాముడు లక్ష్మణునితో ఇలా అన్నాడు. "లక్ష్మణా! రాక్షసులు ఆకాశము నుండి రక్త వర్షము కురిపించు చున్నారు. నేను నా బాణములతో ఆ మేఘరూపములో ఉన్న రాక్షసులను తరిమి వేస్తాను.” అని అన్నాడు.

రాముడు కోపంతో మానవాస్త్రమును ఆ రాక్షసుల మీద ప్రయోగించాడు. రాముడు ప్రయోగించిన మానవాస్త్రము మారీచుని వక్షస్థలము మీద సూటిగా తగిలింది. ఆ అస్త్రము దెబ్బకు మారీచుడు నూరు యోజనముల దూరములో ఉన్న సముద్రములో పోయి పడ్డాడు.

అప్పుడు రాముడు లక్ష్మణుని చూచి ఇలాఅన్నాడు. “లక్ష్మణా! నేను సంధించిన మానవాస్త్రము ఎవరినీ చంపదు. కేవలము మూర్ఛపోయేట్టు చేస్తుంది. ఆ రాక్షసుడు కూడా అచేతనుడై సముద్రములో పడ్డాడు. కాని ఈ రాక్షసులను క్షమించరాదు. వీరి పాణములు తీయడమే సరిఅయిన మార్గము" అని అన్నాడు.

వెంటనే రాముడు ఆగ్నేయాస్త్రమును సుబాహుని మీద సంధించాడు. ఆ అస్త్రము తగిలి సుబాహుడు నేలకూలాడు. వెంటనే గిలా గిలా కొట్టుకొని మరణించాడు. రాముడు మిగిలిన రాక్షసులను వాయవ్యాస్త్రము ప్రయోగించి నాశనం చేసాడు.

ఆ ప్రకారంగా రాముడు విశ్వామిత్రుని యజ్ఞమునకు భంగము కలిగించు రాక్షసుల నందరినీ తన దివ్యాస్త్రములతో సమూలంగా చంపాడు. యజ్ఞము నిర్విఘ్నముగా పూర్తి అయింది. విశ్వామిత్రుడు దీక్ష నుండి లేచాడు. రామ లక్ష్మణులను చూచాడు. ఎంతోసంతోషంతో ఇలా అన్నాడు.

“రామా! నేను సంకల్పించిన యాగము నిర్విఘ్నముగా పూర్తి అయింది. నీవు నీ తండ్రి ఆజ్ఞప్రకారము యాగమును రక్షించావు. ఈ సిద్ధాశ్రమముపేరు సార్థకం చేసావు." అని అన్నాడు.

ఇది వాల్మీకి విరచిత
రామాయణ మహాకావ్యములో
బాలకాండలో ముప్పయ్యవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ంతత్సత్ ఓంతత్సత్.

Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)