శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై తొమ్మిదవ సర్గ (Ramayanam - Balakanda - Part 29)
శ్రీమద్రామాయణము
బాలకాండ
ఇరవై తొమ్మిదవ సర్గ
రాముడు ఆ వనమును గురించి ప్రశ్నించగా, విశ్వామిత్రుడు ఇలా బదులు చెప్పాడు. " ఓ రామా! ఈ ప్రదేశములోనే శ్రీ మహా విష్ణువు వంద యుగముల పాటు తపస్సు చేసాడు. వామనావతారమునకు ముందు శ్రీ మహా విష్ణువు ఇక్కడనే నివసించేవాడు. కశ్యపుడు ఇక్కడ తపస్సు చేసి సిద్ధి పొందినందువలన, దీనిని సిద్ధాశ్రమము అని అంటారు. శ్రీ మహా విష్ణువు ఇక్కడ తపస్సు చేస్తూ ఉన్న కాలంలో బలి చక్రవర్తి దేవత లందరినీ జయించి ముల్లోకములనూ పరిపాలిస్తున్నాడు. ఆ బలి చక్రవర్తి ఒక సారి యాగము చేస్తున్నాడు. ఆ సమయంలో దేవతలందరూ ఇక్కడ తపస్సు చేస్తున్న విష్ణు మూర్తి దగ్గరకు వచ్చి ఇలా అన్నారు.ఓ విష్ణూ! బలి చక్రవర్తి యజ్ఞము చేస్తున్నాడు. అది పూర్తి అయే లోపలనే మన కార్యము పూర్తి కావాలి. ఈ యాగ సమయములో బలి చక్రవర్తి ఎవరు ఏది అడిగితే దానిని కాదు లేదు అనకుండా ఇస్తున్నాడు. ఓ దేవా! నీవు దేవతల మేలు కోరి, వామనుడిగా బలి చక్రవర్తి యొద్దకు పోయి, మాకు మేలు చేయుము. " అని ప్రార్థించారు.
అదే సమయంలో కశ్యపుడు తన భార్యా సమేతంగా వేయి సంవత్సరములు విష్ణువును గూర్చి తపస్సు చేసాడు. తరువాత విష్ణువును ఇలా ప్రార్థిస్తున్నాడు. " ఓ పురుషోత్తమా! నీవు తపోమయు డవు. తపోరాశివి. తపోమూర్తివి. తపమే నీ రూపము. అట్టి నిన్ను నా తపో మహిమ వలన చూడగలుగుతున్నాను. నీకు ఆది, అంతము లేదు. నీవు సర్వాంతర్యామివి. నిన్ను శరణు వేడుచున్నాను. ” అని ప్రార్థించాడు.
అప్పుడు విష్ణువు కశ్యపునకు ప్రత్యక్షమయ్యాడు. ఏమి వరం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు కశ్యపుడు ఇలా అడిగాడు. “భగవాన్! నీవు నాకు అదితికి పుత్రుడుగా జన్మించు దేవేంద్రునికి తమ్ముడుగా జన్మించు. దేవతలకు మేలు కలిగించు. నా ఇన్ని సంవత్సరములు తపస్సు ఫలిస్తుంది. నీ అనుగ్రహంతో ఈ ప్రదేశము సిద్ధాశ్రమము అని ప్రసిద్ధి చెందుతుంది. హే భగవాన్! నాకు పుత్రుడుగా జన్మించి నన్ను కృతార్ధుడిని చెయ్యి" అని ప్రార్థించాడు కశ్యపుడు.
కశ్యపుడు కోరుకున్నట్టు విష్ణు మూర్తి, కశ్యపునకు అదితికి వామనుడిగా జన్మించాడు. వెంటనే బలిచక్రవర్తి వద్దకు వెళ్లాడు. తనకు మూడు అడుగుల స్థలము కావాలి అని అడిగాడు. బలి చక్రవర్తి వెంటనే వామనుడు అడిగిన మూడు అడుగుల స్థలమును ఇస్తూ నీటిని ధారపోసాడు.
వామనుడు బలి చక్రవర్తి నుండి మూడు అడుగుల స్థలమును గ్రహించాడు. వెంటనే త్రివిక్రముడిగా పెరిగాడు. ముల్లోకములను ఆక్రమించాడు. బలి చక్రవర్తిని ఓడించాడు. స్వర్గాధిపత్యమును మరలా మహేంద్రునికి అప్పగించాడు. దాంతోముల్లోకములు మరలా మహేంద్రుని అధీనంలోకి వచ్చాయి. వామనుడి మీద ఉన్న భక్తి చేత నేను కూడా ఇదే ఆశ్రమములో నివసిస్తున్నాను. ఇక్కడనే నేను యజ్ఞము చేస్తున్నాను. రాక్షసులు ఇక్కడకు వచ్చి నా యజ్ఞమును పాడు చేస్తున్నారు. నీవు వారిని ఇక్కడే సంహరించాలి.
రామా! ఇప్పుడు మనము సిద్ధాశ్రమములో ప్రవేశిస్తున్నాము. రామా! ఈ ఆశ్రమములో నీవు స్వేచ్ఛగా ఉండవచ్చు. " అని అన్నాడు విశ్వామిత్రుడు. రామ లక్ష్మణులు విశ్వామిత్రుని ఆశ్రమములో ప్రవేశించారు. విశ్వామిత్రుడు రావడం చూచి ఆ ఆశ్రమములో ఉన్న మునులందరూ వచ్చి విశ్వామిత్రుని, రామలక్ష్మణులను సాదరంగా లోపలకు తీసుకొని వెళ్లారు. వారిని పూజంచారు. అతిథి సత్కారములు చేసారు. రామ లక్ష్మణులు కొంచెం సేపు విశ్రాంతి తీసుకున్నారు.
తరువాత వారు విశ్వామితుని చూచి ఇలా అన్నారు. “ఓ విశ్వామిత్ర మహర్షీ! తమకుశుభం కలుగుతుంది. తమరు ఈ రోజునుండే యాగము ప్రారంభించండి. మేము యాగ రక్షణ చేస్తాము.” అని అన్నారు.
ఆ మాటలు విన్న విశ్రామిత్రుడు ఎంతో సంతోషించాడు. యాగ దీక్షను స్వీకరించాడు. రామ లక్ష్మణులు ఆ రాత్రి అంతా జాగరూకతతో ఉన్నారు. మరునాడు ఉదయమే లేచి కాలకృత్యములు తీర్చుకొని పాత:కాల సంధ్యావందనము ఆచరించి, విశ్వామిత్రుని వద్దకు వచ్చి ఆయనకు నమస్కరించి, ఆయనతో ఇలా అన్నారు.
వాల్మీకి విరచిత
రామాయణ మహాకావ్యములో
బాలకాండలో ఇరవై తొమ్మిదవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ంతత్సత్ ఓంతత్సత్.
Comments
Post a Comment