శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవయ్యవ సర్గ (Ramayanam - Balakanda - Part 20)
శ్రీమద్రామాయణము
బాలకాండ
ఇరవయ్యవ సర్గ
దశరథుడు విశ్వామితునితో దు:ఖముతో కూడిన గద్గద స్వరంతో ఇలా అన్నాడు, “ఓ మునీశ్వరా! నా రాముడు పదహారు సంవత్సరములు కూడా నిండని బాలుడు. రామునికి రాక్షసులతో యుద్ధము చేయగల శక్తి పరాక్రమములు ఉన్నవి అని నేను అనుకోడం లేదు. నా వద్ద ఒక అక్షౌహిణి సైన్యము ఉంది. నేను దానికి అధిపతిని. నేను నా సైన్యముతో వెళ్లి ఆ రాక్షసులను హతమారుస్తాను. నాకు అనుజ్ఞ ఇవ్వండి. నేను ధనుర్ధారినై నా శరీరంలో ప్రాణములు ఉన్నంత వరకూ యాగ సంరక్షణ చేస్తాను.ఈ పనికి రాముడు అనవసరం కదా మునీంద్రా! ఎందుకంటే రాముడు వయసులో చిన్నవాడు. యుద్ధ తంత్రములు తెలియని వాడు. ఇంకా యుద్ధ విద్యలు పూర్తి గానేర్వని వాడు. అందులోనూ మాయావులైన రాక్షసులతో యుద్ధం చేయడం రామునికి చేత కాదు.
ఓ మునీంద్రా! రాముడు నాకు ప్రాణంతో సమానం. రాముడు లేనిది నేను జీవించలేను. రాముని నా నుండి వేరు చేయకండి. కావాలంటే నన్ను నా సైన్యమును తీసుకొని వెళ్లండి. రాముడు నా పెద్దకుమారుడు. చాలాకాలం తరువాత కలిగిన పుత్ర సంతానము. రాముని నేను పంపలేను.
ఇంతకూ మునీంద్రా! ఆ రాక్షసులు ఎవరు? ఎక్కడి వారు? ఎవరి కుమారులు? వారి పరాక్రమమేమి? వారికి అండగా ఎవరు ఉన్నారు? వారిని ఎలా ఎదుర్కోవాలి?" అని వినయంగా అడిగాడు దశరథుడు.
ఇంతకూ మునీంద్రా! ఆ రాక్షసులు ఎవరు? ఎక్కడి వారు? ఎవరి కుమారులు? వారి పరాక్రమమేమి? వారికి అండగా ఎవరు ఉన్నారు? వారిని ఎలా ఎదుర్కోవాలి?" అని వినయంగా అడిగాడు దశరథుడు.
దానికి విశ్వామిత్రుడు ఇలా అన్నాడు, "ఓ దశరథమహారాజా! పౌలస్త్య వంశంలో పుట్టిన వాడు, విశ్రవసుని కుమారుడు, కుబేరుని సోదరుడు అయిన రావణుడు అనే రాక్షస అంశ కలవాడు ఉన్నాడు. వాడు మహా బలవంతుడు. వీర్య వంతుడు. బ్రహ్మ చేత వరములు పొందిన వాడు. లెక్కలేనన్ని రాక్షస సైన్యము కలవాడు. బ్రహ్మ ఇచ్చిన వరములతో గర్వించి ముల్లోకముల లోని వారిని బాధిస్తున్నాడు. మారీచుడు, సుబాహుడు అనే వారు రావణుని సహచరులు. వారే ఇప్పుడు నేను చేయు యాగమునకు విఘ్నము కలుగ చేస్తున్నారు." అని చెప్పాడు విశ్వామిత్రుడు.
ఆ మాటలు విన్న దశరథుడు విశ్వామిత్రునితో ఇలా అన్నాడు, “ఓ మహర్షీ! మీరు చెప్పినదానిని బట్టి చూస్తుంటే నేను ఆ రాక్షసుల ముందు నిలువ లేను అని అనుకుంటున్నాను. అటువంటప్పుడు నా చిన్ని రాముడు వారిని ఎదిరించగలడా! తమరు చెప్పినట్టు దేవ, దానవ, గంధర్వులే రావణునికి ఎదురు నిలువ లేనపుడు మానవులము మేమెంత! కాబట్టి నేను గానీ నా కుమారులు గానీ ఆ రాక్షసులతో యుద్ధ చేయలేము. నా కుమారుడు రాముడు నన్ను పున్నామ నరకమునుండి రక్షించే వాడు. అతనిని తమరి వెంట రాక్షసులతో యుద్ధమునకు పంపలేను. సాక్షాత్తు యమునితో సమానమైన ఆ మారీచ సుబాహులను రాముడు ఎదుర్కొనలేడు. నేను వచ్చినా వారిలో ఒకరితో మాత్రమే యుద్ధము చేయగలను. ఈ సారికి మమ్ములను మన్నించి వదిలివేయండి." అని ప్రార్థించాడు దశరథుడు.
ఇది వాల్మీకి విరచిత
రామాయణ మహాకావ్యములో
బాలకాండలో ఇరవయ్యవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓంతత్సత్ ఓంతత్సత్.
Comments
Post a Comment