శ్రీమద్రామాయణం - బాలకాండ - నలభై రెండవ సర్గ (Ramayanam - Balakanda - Part 42)

శ్రీమద్రామాయణము

బాలకాండ

నలభై రెండవ సర్గ

సగర చక్రవర్తి మరణించిన తరువాత ఆయన మనుమడు అంశు మంతుడు చక్రవర్తి అయ్యాడు. అంశు మంతుని కుమారుడు దిలీపుడు. అంశు మంతుడు దిలీపునకు రాజ్యము కట్టబెట్టి తాను తపస్సు చేసుకోడానికి అరణ్యములకు వెళ్లాడు.

దిలీపుడు తన పితామహులకు స్వర్గ లోక ప్రాప్తి కలిగించుటకు ఆకాశ గంగను భూమి మీదికి ఎలా తీసుకురావాలా అని ఆలోచిస్తున్నాడు. కాని తగిన ఉపాయము దొరకలేదు. ఆ మనోవ్యధతోనే దిలీపుడు మరణించాడు.

ఆ దిలీపుని కుమారుడు భగీరథుడు. భగీరథునికి పుత్ర సంతానము లేదు. భగీరథునికి సంతానము కావలెనని తీవ్రమైన కోరిక కలిగింది. దానికి తోడు తన ప్రపితామహులకు స్వర్గలోక ప్రాప్తి కలిగించుట. ఈ రెండు కోరికలతో భగీరథుడు బ్రహ్మదేవుని గూర్చి తపస్సు చేసాడు. భగీరథుని తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షం అయ్యాడు.

" ఓ భగీరథా! నీ తపస్సుకు మెచ్చాను. నీకు ఏం వరం కావాలో కోరుకో" అని అడిగాడు బ్రహ్మ.

“దేవా! నాకు పుత్ర సంతానము ప్రసాదించండి. తరువాత ఆకాశ గంగను భూమీ మీదకు పంపండి. ఆ ఆకాశ గంగతో నా ప్రపితా మహులకు జలతరణము వదులుతాను." అని కోరుకున్నాడు.

“ ఓ భగీరథా! నీకు సంతాన ప్రాప్తి కలుగుతుంది. కాని ఆకాశ గంగను భూమి మీదికి తేవడం అత్యతం కష్టమైన పని. కాని నీవు కోరావు కాబట్టి ఆ వరం కూడా ప్రసాదిస్తున్నాను. గంగాదేవి హిమవంతుని పెద్దకుమార్తె. హిమవంతుని రెండవ కుమార్తె ఉమను సదాశివుడు వివాహమాడాడు. ఆకాశము నుండి భూమి మీదికి దూకే గంగానదిని భరించే శక్తి ఆ మహేశ్వరునికి తప్ప వేరే ఎవరికీ లేదు.

ఎందుకంటే ఆకాశము నుండి భూమి మీదికి దిగే గంగాప్రవాహాన్ని భరించే శక్తి భూమికి లేదు. మధ్యలో మహేశ్వరుడు ఆ గంగను భరించాలి. కాబట్టి నీవు మహేశ్వరుని ప్రార్థించి గంగాదేవిని వహించమని కోరాలి." అని అన్నాడు బ్రహ్మదేవుడు.

బ్రహ్మదేవుడు ఈ విషయం గంగాదేవితో కూడా చెప్పాడు. ఆమె అనుమతి కూడా తీసుకున్నాడు. తరువాత బ్రహ్మదేవుడు తన లోకమునకు వెళ్లిపోయాడు.

ఇది వాల్మీకి విరచిత
రామాయణ మహాకావ్యములో
బాలకాండలో నలభై రెండవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ంతత్సత్ ఓంతత్సత్.

Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)