శ్రీమద్రామాయణం - బాలకాండ - నలభయ్యవ సర్గ (Ramayanam - Balakanda - Part 40)
శ్రీమద్రామాయణము
బాలకాండ
నలభయ్యవ సర్గ
భయంతో వణికి పోతున్న దేవతలతో బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు. "ఓ దేవతలారా! భయపడకండి. ఈ భూమి ఆ సర్వేశ్వరుడు విష్ణువుకు చెందినది. ఆయన కపిలావతారములో ఈ భూమిని రక్షిస్తున్నాడు. ఆ సగర కుమారులను ఆయనే శిక్షిస్తాడు. ఆ సగర కుమారుల చావు కపిలుని చేతిలో ఉంది." అని అన్నాడు.ఆ మాటలు విన్న దేవతలు తమ తమ స్థానములకు వెళ్లిపోయారు. సగర కుమారులు భూమిని తవ్వుతూనే ఉన్నారు. కాని వారికి యజ్ఞాశ్వము కనపడలేదు. కాని వారికి ఒక పెద్ద శబ్దము వినిపించింది. కాని వారు ఆ శబ్దమును లక్ష్యపెట్టలేదు. తమ తండ్రి సగరుని వద్దకు తిరిగి వచ్చారు.
“తండ్రీ! మీరు చెప్పినట్టు మేము భూమి అంతా తవ్వాము. యక్ష, గంధర్వ, నాగ జాతులను చంపాము. కాని మాకు యజ్ఞాశ్వము కనపడలేదు. ఇప్పుడు ఏం చెయ్యాలో చెప్పండి.” అని అడిగారు.
కుమారుల మాటలు విన్న సగరుడికి కోపం మిన్నుముట్టింది. “మీరు ఇంకా భూమిని తవ్వండి. అశ్వమును పట్టండి. అశ్వము లేకుండా తిరిగిరాకండి." అని ఆజ్ఞాపించాడు సగరుడు.
సగరకుమారులు మరలా భూమిని తవ్వడం మొదలెట్టారు. అందరూ పాతాళ లోకము చేరుకున్నారు.
వారికి భూమండలమును మోస్తున్న విరూపాక్షము అనే ఏనుగు కనపడింది. సగరకుమారులు దానికి నమస్కరించి మరలా తవ్వనారంభించారు. వారికి తూర్పుదిక్కుగా మరొక ఏనుగు కనిపించింది. దాని పేరు మహాపద్మము అనే దిగ్గజము. అది కూడా తన శిరస్సు మీద భూమండలమును మోస్తున్నది. ఆ ఏనుగును చూచి సగర కుమారులు ఆశ్చర్య పోయారు. సగరకుమారులు ఆ ఏనుగుకు కూడా ప్రదక్షిణము చేసి నమస్కారము చేసారు. ఆ సారి పశ్చిమ దిక్కుగా తవ్వసాగారు. పశ్చిమ దిక్కున కూడా వారికి భూమండలము తన శిరస్సున మోస్తున్న సౌమనసము అనే దిగ్గజము కనిపించింది. వారు ఆ దిగ్గజమునకు కూడా నమస్కరించి, ఉత్తర దిక్కుగా తవ్వనారం భించారు. ఉత్తరదిక్కున కూడా వారికి భూమండలము ను మోస్తున్న భద్ర అనే దిగ్గజము కనిపించింది. సగర కుమారులు ఆ దిగ్గజమునకు కూడా పూజాదికములు నిర్వహించి నమస్కరించారు.
తరువాత వారు ఈశాన్య దిక్కుగా తవ్వనారంభించారు. ఈశాన్య దిక్కుగా వారికి గడ్డిమేయుచున్న యజ్ఞాశ్వము కనిపించింది. ఆ అశ్వమునకు కొంత దూరంలో మహావిష్ణు అవతారమైన కపిల మహర్షి తపస్సు చేసుకుంటూ కనిపించాడు. అశ్వమును చూడగానే వారి శరీరాలు కోపంతో కంపించాయి. ఆ కపిలుడే తమ అశ్వమును దొంగిలించాడు అని అనుకొని తమ వద్దఉన్న ఆయుధములతో కపిలుని మీదికి దూకారు.
“ఓరీ! నీవేనా మా యజ్ఞాశ్వమును దొంగిలించినది. మేము ఎవరమో తెలియునా! మేము సగర చక్రవర్తి కుమారులము. మా యజ్ఞాశ్వమునే దొంగిలిస్తావా!" అంటూ కపిలుని చుట్టుముట్టారు.
కపిలుడు కళ్లు తెరిచాడు. వారిని చూచాడు. ఒక్కసారి కోపంతో హుంకరించాడు. ఆ కపిలుని హుంకారం లోనుండి పుట్టిన అగ్నిలో సగరుని కుమారులు 60,000 మంది భస్మం అయిపోయారు.
ఇది వాల్మీకి విరచిత
రామాయణ మహాకావ్యములో
బాలకాండలో నలభయ్యవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ంతత్సత్ ఓంతత్సత్.
Comments
Post a Comment