శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఎనిమిదవ సర్గ (Ramayanam - Balakanda - Part 28)

శ్రీమద్రామాయణము

బాలకాండ

ఇరవై ఎనిమిదవ సర్గ

ఆ ప్రకారంగా విశ్వామిత్రుని వెంట నడుస్తున్న రాముడు మార్గ మధ్యంలో ఆయనను చూచి ఇలా అన్నాడు.

“ఓ మహర్షీ! తమరు నాకు ఎన్నో అస్త్రములను ఉపదేశించారు. ఇప్పుడు నేను దేవతలకు, రాక్షసులకు అజేయుడనయ్యాను. కాని వాటికి ఉపసంహారము కూడా తెలియజేస్తే బాగుంటుంది కదా!" అని అడిగాడు.

(అస్త్రములను ఉపసంహరించడం అంటే ఒక సారి వేసిన అస్త్రమును, టార్గెట్ ను ఢీకొట్టక ముందే వెనుకకు తీసుకోడం)

ఆ మాటలకు సంతోషించాడు విశ్వామిత్రుడు. రామునికి తాను ఉపదేశించిన అన్ని అస్త్రములకు ఉపసంహారము కూడా ఉపదేశించాడు. అంతే కాకుండా, పూర్వము భృశాశ్వుని చే సృష్టింపబడిన అస్త్రములు అన్నిటినీ రామునికి ఉపదేశించాడు. ఆ అస్త్రముల పేర్లు వాల్మీకి 7 శ్లోకములలో చెప్పాడు. ఆ అస్త్రముల పేర్లు ఏవంటే....
  • సత్యవంతము
  • సత్యకీర్తి
  • ధృష్టము
  • రభసము
  • ప్రతిహారతరము
  • పరాఙ్ముఖము
  • అవాఙ్ముఖము
  • లక్షాక్షము
  • విషమము
  • ధృఢనాభము
  • మహానాభము
  • దుందునాభము
  • సునాభము
  • జ్యోతిషము
  • కృశనము
  • నైరాశ్యము
  • విమలము
  • యోగంధరము
  • హరిద్రము
  • దైత్యము
  • ప్రశమనము
  • సార్చిర్మాలి
  • ధృతి
  • మాలి
  • వృత్తిమంతము
  • రుచిరము
  • పితృసౌమనసము
  • విధూతము
  • మకరము
  • కరవీరకరము
  • ధనము
  • ధాన్యము
  • కామరూపము
  • కామరుచి
  • మోహము
  • ఆవరణము
  • జృంభకము
  • సర్వనాభము
  • సంతానము
  • వరణము.
(వీటి పేర్లు చూస్తుంటే ఇవి మానవుల లక్షణములు, ఉదాహరణకు... మోహము, రుచిరము, విమలము; ఇంకా మానవులకు ఉన్న సంపదలు ఉదా: సంతానము, కొన్ని శాస్త్రములు ఉదా: జ్యోతిషము. ఇలాగా అస్త్రములు అంటే కేవలము ఆయుధములు అనే కాదు శాస్త్రములు, లక్షణములు వాటి ఆవశ్యకత అని అర్థం స్ఫురిస్తూ ఉంది.)

రాముడు ఆ అస్త్రములను సంతోషంతో తీసుకున్నాడు. ఆ అస్త్రదేవతలు అందరూ రాముని ముందు నిలిచి ఆయన ఆజ్ఞ కోసరం ఎదురు చూచారు. రాముడు వారిని మనసులో నిలుపుకొని తాను కోరినపుడు రమ్మని పంపివేసాడు. ఆ అస్త్రదేవతలు అందరూ రామునికి ప్రదక్షిణ పూర్వక నమస్వారము చేసి వెళ్లిపోయారు.

తరువాత రాముడు విశ్వామిత్రుని వెంట నడుస్తున్నాడు. వారికి ఒక ఆశ్రమము కనపడింది. ఆ ఆశ్రమము మంచి ఫలవృక్షములతోనూ, పూల తీగలతోనూ, అత్యంత మనోరంజకంగా ఉంది. విశ్వామితుని వెంట నడుచుచూ రాముడు ఇలా అన్నాడు.

“ఓ మహర్షీ! ఈ ప్రదేశము చాలా మనోహరముగా ఉంది. మనము ఆ రాక్షస ప్రాంతము వదిలి పెట్టినాము అనుకుంటాను. ఇంత మనోహరముగా ఉన్న ఈ ఆశ్రమము ఎవరిది? వివరించండి. ఇంతకూ తమరి ఆశ్రమము ఎక్కడ ఉంది. మీరు యజ్ఞము ఎక్కడ చేస్తున్నారు. రాక్షసులు మీ యాగమును ఎక్కడ పాడుచేస్తున్నారు. నేను తమరి యాగమును ఎక్కడ ఉండి రక్షించాలి. నేను ఆ రాక్షసులను ఎక్కడ ఉండి చంపాలి. వీటి గురించి నాకు వివరంగా చెప్పండి” అని
అడిగాడు రాముడు.

అప్పుడు విశ్వామితుడు రామునితో ఇలా చెప్పసాగాడు.

ఇది వాల్మీకి విరచిత
రామాయణ మహాకావ్యములో
బాలకాండలో ఇరవై ఎనిమిదవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ంతత్సత్ ఓంతత్సత్.

Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)