శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది తొమ్మిదవ సర్గ (Ramayanam - Balakanda - Part 39)
శ్రీమద్రామాయణము
బాలకాండ
ముప్పది తొమ్మిదవ సర్గ
శ్రీ రాముడు విశ్వామితుని చూచి ఇలా అన్నాడు. “ఓ మహర్షీ! సగరుడు తాను సంకల్పించిన యజ్ఞమును ఎలా నిర్వహించాడు. తెలియ జేయండి." అని అడిగాడు.విశ్వామిత్రుడు ఇలా చెప్పనారంభించాడు. " ఓ రామా! సగరుని యజ్ఞము హిమాచలము వింధ్యపర్వతము మధ్య జరిగింది. సగరుడు యజ్ఞాశ్వమును విడిచి పెట్టాడు. సగరుని మనుమడైన అంశు మంతుడు ఆ యజ్ఞాశ్వమునకు రక్షణగా వెంట బయలుదేరాడు. సగరుడు యజ్ఞము చేయడం ఇష్టం లేని ఇంద్రుడు రాక్షస రూపం ధరించి వచ్చి యజ్ఞాశ్వమును అపహరించాడు. అశ్వము కనపడలేదు. ఋత్తిక్కులందరూ సగరునితో ఇలా అన్నారు.
" ఓ సగర చక్రవర్తీ! యజ్ఞాశ్వమును ఎవరో అపహరించారు. యజ్ఞాశ్వము లేనిదే యజ్ఞము జరగదు. కాబట్టి యజ్ఞాశ్వమును తీసుకొని రావలెను." అని అన్నారు.
ఆ మాటలు విన్న సగరుడు తన 60,000 మంది కుమారులతో ఇలా అన్నాడు. " ఓ కుమారులారా! ఇది మంత్రములతో పవిత్రమైన స్థలము. ఇక్కడకు రాక్షసులు రాలేరు. ఇది రాక్షసుల పని కాదు. కాబట్టి మీరు భూమండలము అంతా వెదకండి. భూమి ఉపరి తలము మీద దొరకకపోతే మీ రందరూ ఒక్కొకరు ఒక్కొక్క యోజనము చొప్పున భూమిని తవ్వండి. అశ్వము దొరికే వరకు తవ్వండి. యజ్ఞాశ్వమును తీసుకొని రండి. మీరు అశ్వమును తీసుకొని వచ్చే వరకూ నేను, ఋత్విక్కులు, నా మనుమడు ఇక్కడనే మీ కోసము నిరీక్షిస్తూ ఉంటాము." అని పలికాడు సగరుడు.
తండ్రి ఆజ్ఞ ప్రకారము సగర పుత్రులు యజ్ఞాశ్వమును వెదుకుతూ వెళ్లారు. వారికి ఎక్కడా అశ్వము కనపడలేదు. వారు భూమిని తవ్వ నారంభించారు. వారు అలా భూమిని తవ్వుతూ ఉండగా ఎన్నో సర్పములు, అసురులు బయటకు వచ్చారు. 60,000 మంది సగర పుత్రులు ఒక్కొక్కరు ఒక్కొక్క యోజనము వంతున అరవై వేల యోజనములు తవ్వారు. భూమి అంతా పాతాళంగా మారి పోయింది. పెద్ద గొయ్యిగా తయారయింది. సగర పుత్రులు జంబూ ద్వీపము అంతా తవ్వేశారు.
ఇది చూచి దేవతలరు, గంధర్వులు, నాగులు అందరూ బ్రహ్మ దేవుని వద్దకు వెళ్లారు. “ఓ బ్రహ్మ దేవా! యజ్ఞాశ్వము కొరకు సగర పుత్రులు భూమి నంతా తవ్వుతున్నారు. పాతాళంలో తపస్సు చేసుకుంటున్న ఋషులను చంపుతున్నారు. దొరికన వాడిని దొరికనట్టు చంపుతున్నారు. ఎన్నో జీవజాలములు నశించి పోతున్నాయి. నీ సృష్టి అంతా సర్వ నాశనము అయి పోతోంది. మీరే
కాపాడాలి." అని బ్రహ్మదేవునితో మొరపెట్టుకున్నారు.
ఇది వాల్మీకి విరచిత
రామాయణ మహాకావ్యములో
బాలకాండలో ముప్పది తొమ్మిదవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ంతత్సత్ ఓంతత్సత్.
Comments
Post a Comment