శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఒకటవ సర్గ (Ramayanam - Balakanda - Part 31)
శ్రీమద్రామాయణము
బాలకాండ
ముప్పది ఒకటవ సర్గ
యాగమును సంరక్షించాము అన్న ఆనందంతో రామలక్ష్మణులు ఆ రాత్రి సుఖంగా నిద్రించారు.మరునాడు ప్రాతః కాలమునే లేచి సంధ్యావందనాది కార్యములు పూర్తి చేసుకొని రామలక్ష్మణులు విశ్వామిత్రుడు, తదితర ఋషుల వద్దకు వెళ్లారు. వారు విశ్వామిత్రునికి భక్తితో నమస్కరించి ఇలా అన్నారు.
“ ఓ మహర్షీ! మేము నీ భటుల మాదిరి వచ్చినిలిచి ఉన్నాము. ఏమి చేయవలెనో ఆజ్ఞాపించండి." అని చేతులుకట్టుకొని వినయంగా నిలబడ్డారు. వారిని చూచిన మహర్షులు విశ్వామిత్రుని అనుమతితో ఇలా అన్నారు.
“ ఓ రామా! మిథిలాధిపతి అయిన జనక మహారాజు ఒక యజ్ఞము చేయుచున్నాడు. మేము అందరమూ ఆ యజ్ఞమునకు పోవుచున్నాము. మీరు కూడా మా వెంట మిథిలకు వచ్చినచో అక్కడ ఉన్న ఒక మహాధనుస్సును చూడవచ్చును. ఆ ధనుస్సు సామాన్యమైనది కాదు. చాలా బలము కలది. భయంకరమైనది. ఆ ధనుస్సును పూర్వము యజ్ఞములో దేవతలు జనకునికి ఇచ్చారు. దానిని దేవతలు, గంధర్వులు, అసురులు,రాక్షసులు ఎవరు కూడా ఎత్తలేరు. ఎక్కుపెట్టలేరు. ఇంక మానవుల సంగతి చెప్ప పనిలేదు కదా! అంతటి బలమైనది ఆ ధనుస్సు. ఎందుకంటే ఎంతో మంది రాజులు ఆ ధనుస్సును ఎత్తబోయి విఫలమయ్యారు. ఎవరూ ఆ ధనుస్సును ఎక్కుపెట్టలేకపోయారు. ప్రస్తుతము ఆ మహత్తర ధనుస్సు జనక మహారాజు పూజా మందిరములో పూజింపబడుతూ ఉంది." అని పలికారు.
తరువాత విశ్వామిత్రుడు రామ లక్ష్మణులతో, తదితర ఋషులతో కూడా కలిసి మిథిలకు ప్రయాణము అయ్యాడు. అందరూ ఉత్తర దిక్కుగా వెళుతున్నారు. దాదాపు నూరు బండ్లలో అందరూ వెళు తున్నారు. చాలా దూరము ప్రయాణము చేసి అందరూ శోణ నదీ తీరము చేరుకున్నారు. ఆ రాత్రికి అక్కడే గడపాలను కున్నారు. సాయంకాలము చేయవలసిన సంధ్యావందనము, అగ్ని కార్యములను పూర్తి చేసుకొని అందరూ విశ్వామిత్రుని ముందు కూర్చున్నారు. ఆ సమయంలో రాముడు విశ్వామిత్రుని ఇలా అడిగాడు.
“ఓ మహర్షీ! ప్రస్తుతము మనకు ఉన్న వనము ఫలములతోనూ పుష్పములతోనూ శోభిల్లుచున్నది. ఈ వనము పేరు ఏమి? దీని గురించి నాకు తెలియజేయండి." అని అడిగాడు.
దానికి విశ్వామితుడు ఇలా ఇలా చెప్పసాగాడు.
ఇది వాల్మీకి విరచిత
రామాయణ మహాకావ్యములో
బాలకాండలో ముప్పది ఒకటవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ంతత్సత్ ఓంతత్సత్.
Comments
Post a Comment