శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది నాల్గవ సర్గ (Ramayanam - Balakanda - Part 34)
శ్రీమద్రామాయణము
బాలకాండ
ముప్పది నాల్గవ సర్గ
ఆ ప్రకారంగా కుమార్తెల వివాహము వైభవంగా జరిపించాడు కుశనాభుడు. కుమార్తెలు అత్తవారి ఇంటికి వెళ్లారు. అప్పుడు తనకు పుత్రసంతానము కావాలని అనుకున్నాడు కుశనాభుడు. పుత్రసంతానము కోసరము పుత్రకామేష్టి యాగము చేసాడు.ఆయాగము జరుగుతున్న సమయములో కుశుడు తన కుమారుడైన కుశనాభునితో ఇలా అన్నాడు. "కుమారా! నీకు సకల సద్గుణ సంపన్నుడు ధార్మికుడు అయిన కుమారుడు జన్మించగలడు." అనిపలికి తాను బ్రహ్మ లోకమునకు వెళ్లిపోయాడు.
కొంత కాలము జరిగింది. కుశనాభునకు గాధి అనే కుమారుడు జన్మించాడు. ఓ రామా! ఆ గాధి నా తండ్రి. శుకుని వంశమున పుట్టడం చేత నేను కౌశికుడు అనే పేరుతో కూడా పిలువబడు తున్నాను. నాకు ఒక జ్యేష్ట సోదరి (అక్కగారు) ఉండేది. ఆమెను నా తండ్రి గాధి ఋచకుడు అను వానికి ఇచ్చి వివాహము చేసాడు. ఆమె తన భర్తతో పాటు సశరీరంగా స్వర్గమునకు వెళ్లింది.
ఆమె ఈ భూమి మీద కౌశికి అనే పేరుతో ఒక మహానదిగా ప్రహిస్తూ ఉంది. దివ్యమైన పుణ్యోదకములతో కూడిన ఆ కౌశికీ నది సకల లోకములకు హితము కలిగించడం కోసరం హిమవత్పర్వతము మీద ప్రవహిస్తూ ఉంది. నేను నా సోదరి మీద ఉన్న ప్రేమతో మహానదీ తీరమున ఆశ్రమము నిర్మించుకొని తపస్సు చేసుకుంటున్నాను.
ఆమె ఈ భూమి మీద కౌశికి అనే పేరుతో ఒక మహానదిగా ప్రహిస్తూ ఉంది. దివ్యమైన పుణ్యోదకములతో కూడిన ఆ కౌశికీ నది సకల లోకములకు హితము కలిగించడం కోసరం హిమవత్పర్వతము మీద ప్రవహిస్తూ ఉంది. నేను నా సోదరి మీద ఉన్న ప్రేమతో మహానదీ తీరమున ఆశ్రమము నిర్మించుకొని తపస్సు చేసుకుంటున్నాను.
రామా! ఈ యాగము చేయుట కొరకు సిద్ధాశ్రమమునకు వచ్చాను. నీవలన యాగమును నిర్విఘ్నముగా పూర్తిచేయ గలిగాను. నా కార్యము సిద్ధించింది. ఓరామా! నీవు అడిగినట్టు నా గురించి, నా జన్మ గురించి నీకు చెప్పాను. రామా! ఇప్పటికే అర్ధ రాత్రి దాటినది. ఇంక మీరు నిద్రకు ఉపక్రమించండి. మరలా రేపు ఉదయమే మనము ప్రయాణము సాగించాలి కదా!" అని అన్నాడు విశ్వామిత్రుడు. విశ్వామితుని వృత్తాంతమును విన్న రామ లక్ష్మణులు, మహా మునులుఅందరూ ఆయనను అభినందించారు.
“ఓ విశ్వామిత్ర మహర్షీ! మీ వలనకుశ వంశము పూజ్యమైనది. మీరు బ్రహ్మ దేవునితో సమానమైన వారు. మీ అక్కగారు పేరుతో ప్రవహించు కౌశికీ నది మీ వంశమునకు కీర్తి తెచ్చింది." అని విశ్వామిత్రుని, కౌశికీ నదిని పొగిడారు. తరువాత అందరూ తమ తమ నివాసములలో నిద్రకు ఉపక్రమించారు.
ఇది వాల్మీకి విరచిత
రామాయణ మహాకావ్యములో
బాలకాండలో ముప్పది నాల్గవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ంతత్సత్ ఓంతత్సత్.
Comments
Post a Comment