శ్రీమద్రామాయణం - కిష్కింధా కాండము - ఏబది రెండవ సర్గ (Ramayanam - KishkindhaKanda - Part 52)
శ్రీమద్రామాయణము కిష్కింధా కాండము ఏబది రెండవ సర్గ ఆ తాపసి అనుమతి పొందిన ఆ వానరులు అక్కడ ఉన్న మధురమైన ఫలములను, తినుబండారములను తృప్తిగా తిని, మధురమైన పానీయములను సేవించి భుక్తాయాసంతో పడుకున్నారు. తాపసి తమను అడిగిన విషయం మర్చిపోయారు. అది చూచి ఆ తాససి స్వయంప్రభ వారి దగ్గరకు వచ్చి “మీ ఆకలి తీరినదా! విశ్రాంతి తీసుకున్నారా! ఇప్పుడైనా మీ గురించి నాకు చెబుతారా!" అని అడిగింది. అప్పుడు హనుమంతుడు స్వయంప్రభతో తమ గురించి చెప్పసాగాడు. “ఓ మాతా! నా పేరు హనుమంతుడు. మాది కిష్కింధ. వీరంతా నా సహచరులు. మేము వానరులము. అయోధ్యను పరిపాలించు మహారాజు దశరథుని కుమారుడు రాముడు. ఆయన తన భార్య సీతతో వనవాసము చేస్తున్నాడు. దండకారణ్యములో, జనస్థానములో, రామలక్ష్మణులు ఆశ్రమములో లేని సమయమున, రావణుడు అనే రాక్షసుడు ఒంటరిగా ఉన్న సీతను అపహరించాడు. రాముడు మా వానర రాజు సుగ్రీవునితో మైత్రి చేసుకున్నాడు. సీతను వెతికిపెట్టమని సుగ్రీవుని అడిగాడు. ఆ సుగ్రీవుని ఆజ్ఞమేరకు, వాలి కుమారుడు అంగదుని నాయకత్వంలో, అగస్త్యుడు సంచరించిన ఈ దక్షిణ దిక్కున మేము సీతకోసరం, రావణుని కోసరం వెదుకు తున్నాము. అలా వెదుకుతుంటే మాకు ఆకలి దప్పిక వేసాయి. ఈ గుహల...