శ్రీమద్రామాయణం - కిష్కింధా కాండము - ముప్పది ఐదవ సర్గ (Ramayanam - KishkindhaKanda - Part 35)

శ్రీమద్రామాయణము

కిష్కింధా కాండము

ముప్పది ఐదవ సర్గ

లక్ష్మణుడు చెప్పిన మాటలు విని సుగ్రీవుడికి నోట మాట రాలేదు. కాని చతురంగా మాట్లాడటంలో నేర్పరి అయిన తార లక్ష్మణునితో ఇలా అంది. “ఓ లక్ష్మణ కుమారా! నీ నోటి నుండి ఇటువంటి పరుష వాక్యములు రాకూడదు. అటువంటి మాటలు సుగ్రీవుడు వినకూడదు. నీవు అనుకుంటున్నట్టు ఈ సుగ్రీవుడు కృతజ్ఞత లేనివాడు కానీ, శఠుడు కానీ, దారుణమైన పనులు చేయువాడుకానీ, అసత్యములు ఆడువాడు కానీ, కుటిలమైన బుద్ధి కలవాడు కానీ కాడు.

సుగ్రీవునికి రాముడు మహోపకారముచేసాడు. అది నిజము. రాముడు చేసిన ఉపకారమును సుగ్రీవుడు మరచిపోలేదు. ఇదీ నిజమే. రాముని అనుగ్రహము వలననే సుగ్రీవుడు ఈ రాజ్యమును, తన భార్య రుమను, నన్ను పొందగలిగాడు. కొన్ని సంవత్సరముల పాటు వాలి చేతిలో బాధలు పడి నిద్ర, ఆహారము లేకపోవడం వలన, ఒక్కసారి సుఖములు వచ్చి మీద పడేటప్పటికి, సుగ్రీవునికి కాలము తెలియలేదు. ఇదీ నిజమే.

పూర్వము విశ్వామిత్రుని వంటి మహాఋషి మేనక మోహంలో పడి సంవత్సరములు రోజులుగా గడిపాడు. మహాత్ముడైన విశ్వామిత్రుడే కాలమును గుర్తించలేనపుడు, వానరుడు అయిన ఈ సుగ్రీవుడు ఎంత? దొరక్క దొరక్క దొరికిన దేహసుఖములను, కామసుఖములను అనుభవించడంలో అలసిపోయి శరత్కాలము వచ్చినది అను మాట మరిచిన ఈ వానర రాజును రాముడు క్షమించాలి. కాబట్టి లక్ష్మణకుమారా! నీవు నిజానిజములు తెలుసుకొని తరువాత నిందించు. అంతే కానీ, తాత్కాలిక కోపమునకు వశము కావద్దు. 

ఓ లక్ష్మణా! సుగ్రీవుని బదులుగా నేను నిన్ను వేడుకుంటున్నాను. నీ కోపమును విడిచి పెట్టు. శాంతము వహించు. సుగ్రీవుడు పట్టిన పట్టు వదిలి పెట్టడు. రామ కార్యము నిర్వహించడంలో సుగ్రీవుడు ఈ రాజ్యమును, సమస్త సంపదలను, అంగదుని, తన భార్య రుమను, నన్ను కూడా విడిచిపెట్టడానికి వెనుకాడడు అని నా నమ్మకము. సుగ్రీవుడు, ఆ రావణుడు సీతను ఎక్కడ దాచాడో వెదికి ఆ పట్టి, రావణుని హతమార్చి, సీతను రాముని దగ్గరకు చేర్చగలడు.
రావణుని నివాసమైన ఆ లంకలో శతకోటి సహస్ర రాక్షసులు ఉన్నారట. (అంటే నూరుకోట్లవేల రాక్షసులు-- -1,000,000,000,000 ఇదీ సంఖ్య), ముప్పది ఆరు ఆయుతముల రాక్షసులు ఉన్నారని ప్రతీతి. (ఆయుతము అంటే పదివేలు). ముందు వీరిని చంపకుండా రావణుని జయించడం, సీతను తీసుకు రావడం సాధ్యము కాదు. నీవు, రాముడు, ఎవరి సాయమూ లేకుండా రాక్షస సేనలను నిర్మూలించడం సాధ్యం కాదు. సుగ్రీవుడు కూడా ఒంటరిగా ఆ రాక్షసులను చంపలేడు. కాబట్టి మీకు సుగ్రీవుని సాయము తో పాటు కోట్ల కొద్దీ వానరులసాయము అత్యావశ్యకము.
రావణుని గురించి, రావణుని బలము గురించి నా భర్త వాలికి బాగా తెలుసు. ఆయనే నాకు పై విషయములు చెప్పాడు. నేను నా భర్త వాలి నుండి విన్న విషయములను నీకు చెప్పాను. కాబట్టి, మనకు కావలసిన వానర సైన్యములను సమకూర్చుటకు సుగ్రీవుడు వానర ప్రముఖులను నలుదిశలకు పంపాడు. వారు ఈరోజే ఇక్కడకు రావాలి. సుగ్రీవుడు ఇదవరకే చేసిన ఏర్పాటు ప్రకారము కోట్లకొలది వానరులు, భల్లూకములు కిష్కింధకు చేరుకుంటున్నారు. వారందరూ తమరి అధీనంలో ఉంటారు. కాబట్టి నీకోపాన్ని విడిచి పెట్టి శాంతము వహించు.

నేను, రుమ, అంతఃపుర స్త్రీలు అందరూ నీ కోపముతో నిండిన ముఖమును చూచి భయంతో వణికిపోతున్నాము. సుగ్రీవునికి కూడా వాలికి పట్టిన గతి పడుతుందని అల్లాడుతున్నాము. కాబట్టి నీ కోపం ఉపసంహరించుకో." అని వినయంగా ఉన్న విషయం చెప్పింది తార.

శ్రీమద్రామాయణము
కిష్కింధాకాండము ముప్పది ఐదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్



Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)