శ్రీమద్రామాయణం - కిష్కింధా కాండము - ముప్పది ఆరవ సర్గ (Ramayanam - KishkindhaKanda - Part 36)

శ్రీమద్రామాయణము

కిష్కింధా కాండము

ముప్పది ఆరవ సర్గ

ఎంతో సున్నితంగా, ధర్మబద్ధంగా యుక్తియుక్తంగా పరిస్థితులను వివరించిన తార మాటలను లక్ష్మణుడు అంగీకరించాడు. లక్ష్మణుడు శాంత పడ్డాడు అని ధృవపరచుకున్న సుగ్రీవుడు తన భయాన్ని విడిచిపెట్టాడు. లక్ష్మణుని చూచి ఇలా అన్నాడు.

"ఓ లక్ష్మణ కుమారా! నేను రాముని దయచేత ఈ కిష్కింధా రాజ్యాన్ని, నా ఐశ్వర్యాన్ని, నా కీర్తిని, నా భార్యను తిరిగి పొందాను. దానిని నేను ఎన్నటికీ మరచిపోలేను. నాకు ఇంత మహోపకారము చేసిన రామునికి నేను ఎంత ప్రత్యుపకారము చేసినా తక్కువే అవుతుంది. రామునికి కేవలము నేను సహాయకుడుగానే ఉంటాను. రాముడే రావణుని చంపి, సీతను పొందగలడు. ఒకే బాణము చేత ఏడు సాల వృక్షములనుకూల్చిన రామునికి నా సాయం ఎందుకు. రావణ సంహారము కొరకు ముందు రాముడు నడుస్తుంటే నేను ఆయన వెనక వెళతాను. ఈ లోకంలో తెలిసో తెలియకో అపరాధము చేయని వాడు ఎవడూ ఉండడు కదా! రాముని పట్ల నేను తెలిసో తెలియకో ఏదైనా అపరాధము చేస్తే నన్ను క్షమించు." అని రెండు చేతులూ జోడించి ప్రార్థించాడు సుగ్రీవుడు.

సుగ్రీవుని మాటలకు లక్ష్మణుడు ఎంతో సంతోషించాడు. సుగ్రీవునితో ఇలా అన్నాడు. “ఓ వానర రాజా! నీ వినయమునకు విధేయతకు చాలా సంతోషించాను. నీవలన రామకార్యము నెరవేరుతుంది అన్న నమ్మకము నాకు ఉంది. నీవు ఇంతటి ధర్మాత్ముడవు, వినయ వంతుడవు అవడం వలననే ఈ కిష్కింధా రాజ్యమునకు రాజువు కాగలిగావు. నీసాయముతో రాముడు రాక్షసులతో యుద్ధము చేసి వారిని చంపగలడు. ఇందులో ఎలాంటి సందేహము లేదు.

నీవు ధర్మముననుసరించి పలికిన మాటలు నాకు ఎంతో సంతోషాన్ని కలుగచేసాయి. ఎందుకంటే నీ తప్పును నీవు తెలుసుకొని యుక్తియుక్తంగా మాట్లాడటం నీకే చెల్లింది. దేవతలే నిన్ను రామునికి సహాయకుడిగా పంపారని అనుకుంటున్నాను. ఓ సుగ్రీవా! నీవు నా వెంట వచ్చి రామునికి జరిగినది అంతా చెప్పి, సీతా వియోగముతో బాధపడుతున్న రాముని ఓదార్చు. రాముని బాధ చూడలేక, జరిగింది తెలుసుకోకుండా, తొందరపడి నీతో పరుషంగా మాట్లాడాను. నన్ను క్షమించు." అని అన్నాడు లక్ష్మణుడు.

శ్రీమద్రామాయణము
కిష్కింధా కాండము ముప్పది ఆరవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్



Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)