శ్రీమద్రామాయణం - కిష్కింధా కాండము - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - KishkindhaKanda - Part 37)
శ్రీమద్రామాయణము
కిష్కింధా కాండము
ముప్పది ఏడవ సర్గ
లక్ష్మణుని మాటలు విని సుగ్రీవుని మనస్సు సంతుష్టి చెందింది. వెంటనే పక్కనే ఉన్న హనుమంతుని చూచి ఇలా అన్నాడు.“హనుమా! మహేంద్రపర్వతము మీద, వింధ్యపర్వతము మీద, కైలాస పర్వతము మీద, మందరపర్వతము మీద, నివసించు చున్న వానరము లందరినీ కిష్కింధలో సమావేశము కావాలని వర్తమానము పంపించు. అలాగే సముద్ర ప్రాంతములలో నివసించు వానరములను, పశ్చిమ దిక్కున ఉన్న ఆదిత్య పర్వతము మీద ఉన్న వానరములను, పద్మాచలము మీద ఉన్న వానరములను, అంజనా పర్వతము మీదున్న వానరములను, మేరు పర్వత శిఖరములలో ఉన్న వానరములను, ధూమగిరి మీద నివసించే వానరములను, మహారుణ పర్వతము మీద నివసించే వానరములను, ఇంకా ఇతర ప్రాంతము లలో భూమి మీద, కొండల మీద, పర్వత శిఖరముల మీద నివసించే సమస్త జాతుల వానములను కిష్కింధలో సమావేశము కావాలని సుగ్రీవాజ్ఞగా తెలియచెయ్యండి. ఇంతకు పూర్వము మనము పంపిన వానర ప్రముఖులను తొందరగా పనిపూర్తిచేసుకొని రమ్మని వర్తమానము పంపు. ఇదంతా పది రోజులలో జరగాలి. నా ఆజ్ఞను ధిక్కరించిన వారికి మరణ దండన విధింపబడుతుంది అని తెలియచెయ్యి. నా అధికార పరిధిలో ఉన్న సమస్త జాతుల వానరములు ఇక్కడకు రావాలి. నా ఆజ్ఞను అందరికీ తెలియ జేయుటకు వేగంగా ఎగురగలిగే వానరములను, అన్ని ప్రదేశములను క్షుణ్ణంగా తెలిసిన వానరములను నలుదిక్కులకు పంపు. ఇదంతా ఈరోజుజరగాలి." అని హనుమంతునికి ఆదేశాలు ఇచ్చాడు సుగ్రీవుడు.
సుగ్రీవుని ఆజ్ఞ ప్రకారము వానరములు నలుదిక్కులకు వెళ్లాయి. సముద్రప్రాంతములలోనూ, పర్వత శిఖరముల మీద, కొండ లోయలలోనూ, అడవులలోనూ, సరస్సుల వద్ద నివసించు సమస్త వానరములను రామ కార్యము నిమిత్తము కిష్కింధకు రావలసినదిగా సుగ్రీవుని ఆజ్ఞను తెలియజేసాయి. మృత్యువుతో సమానమైన సుగ్రీవుని ఆజ్ఞను అనుసరించి సమస్త వానరములు కిష్కింధకు ప్రయాణం కట్టాయి.
పర్వత ప్రాంతముల నుండి మూడు కోట్లవానరములు వచ్చాయి. బంగారు ఛాయగల పదికోట్లవానరములు వచ్చాయి. కైలాస శిఖరము నుండి వెయ్యి కోట్ల వానరములు వచ్చాయి.
హిమవత్పర్వతము మీది నుండి వెయ్యికోట్ల వానరములు వచ్చాయి. వింధ్య పర్వతము నుండి లెక్కలేనన్ని వానరములు వచ్చాయి. ఇంకా అరణ్యములనుండి, కొండ గుహల నుండి లెక్కలేనన్ని వానరములు వచ్చాయి.
హిమవత్పర్వతము మీద ఉన్న వానరములను పిలవడానికి వెళ్లిన వానరులు అక్కడ ఒక మహావృక్షమును చూచారు. పూర్వము ఆ ప్రదేశములో మహేశ్వరుని గురించి ఒక యజ్ఞము చేయబడింది. ఆ సమయంలో అక్కడ పడిన యజ్ఞశేషములనుండి ఉద్భవించిన ఆ మహా వృక్షములకు కాసిన మధురమైన ఫలములను వారు చూచారు. ఆ ఫలములను తిన్న వారికి ఒకమాసము వరకూ ఆకలి దప్పులు ఉండవు. అది తెలిసిన వానరులు, ఆ ఫలములను, పుష్పములను, ఆ చెట్టు వేళ్లను తీసుకొని వచ్చారు. ఆ మహిమ గల ఫలములను వారు సుగ్రీవునికి కానుకగా ఇచ్చారు.
వానరులందరికీ సుగ్రీవుని ఆదేశాన్ని అందించామని, వానరులందరూ వెంటనే వస్తున్నారనీ సుగ్రీవునికి తెలియజేసారు. ఆ మాటలు విన్న సుగ్రీవుడు ఎంతో సంతోషించాడు. వారు తెచ్చిన కానుకలు స్వీకరించాడు.
శ్రీమద్రామాయణము
కిష్కింధా కాండము ముప్పది ఏడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment