శ్రీమద్రామాయణం - కిష్కింధా కాండము - ముప్పది ఎనిమిదవ సర్గ (Ramayanam - KishkindhaKanda - Part 38)
శ్రీమద్రామాయణము
కిష్కింధా కాండము
ముప్పది ఎనిమిదవ సర్గ
హిమాచలము నుండి వానరులు తెచ్చిన కానుకలు తీసుకొని వారిని పంపివేసాడు సుగ్రీవుడు. సుగ్రీవుడు చేస్తున్న ప్రయత్నములను చూచి లక్ష్మణుడు తృప్తి చెందాడు.“ఓ సుగ్రీవా! ఇంక మనము రాముని వద్దకు పోవుదము. రాముడు మన రాక కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు." అని అన్నాడు.
“అవశ్యము లక్ష్మణా! అలాగే వెళ్లెదము." అని అన్నాడు సుగ్రీవుడు.
తారను మిగిలిన స్త్రీలను లోపలకు పంపివేసాడు. తన అనుచరులకు పల్లకినీ తీసుకు రమ్మని ఆదేశించాడు. వెంటనే వానరులు అందమైన పల్లకిని తీసుకొని వచ్చారు. ఆ పల్లకిలో సుగ్రీవుడు, లక్ష్మణుడు ఎక్కారు. వంది మాగధులు స్తుతిస్తూ ఉండగా, అనుచరులు తెల్లని ఛత్రము పట్టి, వింజామరలు వీచుచుండగా, లక్ష్మణుడు, సుగ్రీవుడు కలిసి పల్లకిలో ఎక్కి రాముని వద్దకు వెళ్లారు. సుగ్రీవుడు పల్లకి దిగి, రాముని ఎదురుగా రెండు చేతులు కట్టుకొని నిలబడ్డాడు. సుగ్రీవుని వెంట వచ్చిన వానర వీరులు కూడా అదేమాదిరి చేతులు కట్టుకొని వినయంగా నిలబడ్డారు. వారిని అందరినీ రాముడు మిత్రభావంతో చూచాడు.
సుగ్రీవుడు రాముని పాదాల మీద పడి నమస్కరించాడు. రాముడు సుగ్రీవుని బుజాలు పట్టుకొని లేవ నెత్తాడు. ప్రేమతోనూ గౌరవంతోనూ కౌగలించుకున్నాడు. సుగ్రీవుని తన పక్కనే కూర్చోపెట్టుకున్నాడు రాముడు. రాముడు సుగ్రీవునితో ఇలా అన్నాడు.
"మిత్రమా! సుగ్రీవా! ధర్మమును, అర్ధమును, కామమును ఆయా కాలములందు అనుభవించు వాడు రాజు అనిపించుకుంటాడు. అటువంటి రాజు నిరంతరము జాగరూకతతో ఉంటాడు. కాని
ధర్మమును, అర్ధమును విడిచి కేవలము కామాసక్తుడైన వాడు మాత్రము, ఆపదలు వచ్చినపుడు మాత్రమే మేలుకుంటాడు. తన తప్పును తెలుసుకుంటాడు. శత్రువులను ఓడిస్తూ, మిత్రులను ఆదరించే వాడు ఉత్తముడైన రాజు. కాబట్టి ఓ మిత్రమా! మన ఒప్పందము ప్రకారము మనము సీతను వెదకడానికి ప్రయత్నాలు మొదలెట్టాలి. నీ మంత్రులతో ఆలోచించి తగు నిర్ణయం తీసుకో!" అని సుగ్రీవునికి తన తప్పు తెలిసేటట్టు సున్నితంగా మాట్లాడాడు రాముడు.
ధర్మమును, అర్ధమును విడిచి కేవలము కామాసక్తుడైన వాడు మాత్రము, ఆపదలు వచ్చినపుడు మాత్రమే మేలుకుంటాడు. తన తప్పును తెలుసుకుంటాడు. శత్రువులను ఓడిస్తూ, మిత్రులను ఆదరించే వాడు ఉత్తముడైన రాజు. కాబట్టి ఓ మిత్రమా! మన ఒప్పందము ప్రకారము మనము సీతను వెదకడానికి ప్రయత్నాలు మొదలెట్టాలి. నీ మంత్రులతో ఆలోచించి తగు నిర్ణయం తీసుకో!" అని సుగ్రీవునికి తన తప్పు తెలిసేటట్టు సున్నితంగా మాట్లాడాడు రాముడు.
రాముని మాటలలో ఉన్న అంతరార్ధమును గ్రహించిన సుగ్రీవుడు రామునితో ఇలా అన్నాడు.
"ఓ రామా! నేను నీ వలన మహెూపకారము పొందాను. నేను పోగొట్టుకున్న రాజ్యమును, ఐశ్వర్యమును, నా భార్యను నీ అనుగ్రహము వలన పొందగలిగాను. మీరు చేసిన ఉపకారమునకు నేను ప్రత్యుపకారము చేయనిచో, నేను ధర్మము తప్పిన వాడిని అవుతాను.
నేను నా ప్రయత్నాలు శరదృతువురాగానే మొదలెట్టాను. వివిధ ప్రాంతముల నుండి వానరసేనలను కిష్కింధకు చేరుకోవాలని ఆదేశాలు ఇచ్చాను. లెక్కకు మించిన వానరములు కిష్కింధకు చేరుకుంటున్నాయి. ఇంకా చాలా మంది వానర వీరులు తమ తమ సైన్యములతో మార్గమధ్యములో ఉన్నారు.
ఓ రామా! శతములు, శతసహస్రములు (లక్షలు), కోట్లు, ఆయుతములు, శంకువు, అర్భుదములు, శతాధిక అర్బుదములు సంఖ్యలో రకరకాల వానరజాతులు కిష్కింధకు చేరుకుంటున్నారు. వీరందరూ నీ అధీనములో ఉంటారు. వీరంతా రావణుని రాజ్యము మీదికి దండెత్తి, రావణుని సంహరించి, సీతను తీసుకురాగలరు.” అని క్లుప్తంగా వినయంగా చెప్పాడు సుగ్రీవుడు.
సుగ్రీవుని మాటలకు రాముడు ఎంతో సంతోషించాడు.
శ్రీమద్రామాయణము
కిష్కింధా కాండము ముప్పది ఎనిమిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment