శ్రీమద్రామాయణం - కిష్కింధా కాండము - ముప్పది తొమ్మిదవ సర్గ (Ramayanam - KishkindhaKanda - Part 39)
శ్రీమద్రామాయణము
కిష్కింధా కాండము
ముప్పది తొమ్మిదవ సర్గ
రెండు చేతులూ జోడించి తనముందు నిలబడి పైవిధంగా పలికిన సుగ్రీవుని చూచి రాముడు సంతోషంతో అతనిని కౌగలించుకున్నాడు.“చంద్రుడు వెన్నెల కురిపించినట్టు నీ వంటి మిత్రుడు తన చర్యలతో నాకు ఆనందము కల్గిస్తున్నాడు అనడంలో ఆశ్చర్యం ఏముంటుంది? నీ గురించి నాకు బాగా తెలుసు. ఏదన్నా ఒక కార్యము తలపెడితే, దానిని నిర్విఘ్నముగా నెరవేరుస్తావు. నీ సాయం ఉంటే నేను యుద్ధములో శత్రువులను అందరినీ జయిస్తాను. ఆ రావణుడు తనకు వినాశ కాలము దాపురించి నా సీతను అపహరించాడు." అని అన్నాడు రాముడు.
ఇంతలో భూమ్యాకాశాలు దద్దరిల్లేటట్టు పెద్ద పెద్ద శబ్దములు వినిపించాయి. లక్షల కోట్ల సంఖ్యలో వానరములు అక్కడకు వస్తున్నాయి. ముందు వానర సేనానాయకులు నడుస్తూ ఉంటే వారి వెనక వానరాలు వస్తున్నాయి. లక్షకోట్లు వానరములతో వచ్చిన శతబలి అనే వానర వీరుడినిచూచాడు సుగ్రీవుడు. తరువాత వేల కోట్ల వానరములతో తార తండ్రి సుషేణుడు వచ్చాడు. రుమ తండ్రి కూడా వేయి కోట్ల వానరములతో వచ్చాడు. హనుమంతుని తండ్రి కేసరి వేల కోట్ల వానరములతో వచ్చాడు. గవాక్షుడు అనే వానర రాజు వేయి కోట్ల వానరములతో వచ్చాడు.
ధూమ్రుడు అనే భల్లూక రాజు రెండు వేల కోట్ల భల్లూకములతో(ఎలుగు బంట్లు) వచ్చాడు. పనసుడు అనే వానర సేనా నాయకుడు మూడుకోట్ల వానరములతో వచ్చాడు. నీలుడు అనే వానర వీరుడు పదికోట్ల వానరములతో వచ్చాడు. గవయుడు అనే వానర సేనాధి పతి ఐదుకోట్ల మంది వానరములతో వచ్చాడు. దరీముఖుడు అనే వానర సేనాని వెయ్యికోట్ల వానరములతో వచ్చాడు.
అశ్వినీ దేవతల కుమారులు అయిన మైందుడు, ద్వివిదుడు అనే వానర శ్రేష్ఠులు ఒక్కొక్కరు వేయి కోట్ల వానరులతో వచ్చారు. గజుడు అనే వానర వీరుడు మూడుకోట్ల వానరులతో వచ్చాడు. జాంబవంతుడు అనే భల్లూకరాజు పదికోట్ల భల్లూకములతో వచ్చాడు. రుమణుడు అనే వానర వీరుడు వందకోట్ల మంది వానరవీరులతో వచ్చాడు. గంధమాధనుడు అనే వానర వీరుడు పదివేల కోట్ల వానరులతో వచ్చాడు.
వాలికుమారుడు అంగదుడు వేయి పద్మములు, నూరు శంకువుల సంఖ్య వానరములతో సహా వచ్చాడు. తారుడు అనే వానర వీరుడు ఐదుకోట్ల వానరములతో వచ్చాడు. ఇంద్రజానువు అనే వానరసేనాని పదకొండుకోట్ల వానరములతో వచ్చాడు. రంభుడు అనే వానర వీరుడు శత,సహస్ర, ఆయుతముల వానరములతో వచ్చాడు. దుర్ముఖుడు అనే వానర సేనాని రెండు కోట్ల వానరములతో వచ్చాడు.
హనుమంతుడు తన అధీనములో ఉన్న వెయ్యికోట్ల వానరములతో వచ్చాడు. నలుడు అనే వానర వీరుడు వందకోట్ల, ఒకవెయ్యి, ఒక వంద వానరములతో వచ్చాడు. వీరే కాకుండా శరభుడు, కుముదుడు, వహ్ని, రంభుడు అనే వానర వీరులు అసంఖ్యాకములైన వానర సేనలతో వచ్చారు.
ఆ వానర సేనకు నాయకులు అందరూ వచ్చి సుగ్రీవునికి తాము వచ్చినట్టు విన్నవించుకున్నారు. ఆ వానర సేనానాయకులను సుగ్రీవుడు రామునికి పేరుపేరునా పరిచయం చేసాడు. తరువాత సుగ్రీవుడు ఆ వానరసేనానాయకులతో ఇలా అన్నాడు.
“ఓ వానర సేనానాయకులారా! మీరందరూ మీ మీ సేనలతో ఈ పర్వతముల మీద అనుకూల మైన ప్రదేశములతో విడిది చేయండి. అప్పుడు రాముడు మన బలగముల గురించి తెలుసు కోడానికి
వీలవుతుంది."అని అన్నాడు.
వీలవుతుంది."అని అన్నాడు.
శ్రీమద్రామాయణము
కిష్కింధా కాండము ముప్పది తొమ్మిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment