శ్రీమద్రామాయణం - కిష్కింధా కాండము - నలుబదవ సర్గ (Ramayanam - KishkindhaKanda - Part 40)
శ్రీమద్రామాయణము
కిష్కింధా కాండము
నలుబదవ సర్గ
వానర సేనానాయకులకు ఆ ప్రకారంగా ఆదేశాలు ఇచ్చాడు సుగ్రీవుడు. తరువాత రాముని చూచి ఇలా అన్నాడు."ఓ రామా! ఎంతో బలవంతులు, కామరూపులు, ఎక్కడికైనా క్షణంలో పోగలవారూ అయిన వానరులు కోట్ల సంఖ్యలో వచ్చి ఉన్నారు. వీరంతా దైత్యులను, దానవులను, రాక్షసులను సమర్ధవంతంగా ఎదిరించగల సామర్థ్యము కలవారు.
ఓ రామా! ఈ వానరులు నేల మీద, నీటి మీద, ఆకాశంలోనూ సంచరించగల సమర్ధులు. పైగా వీరికి అలసట అనేది లేదు. పూర్వము ఎన్నోయుద్ధములలో పాల్గొన్న అనుభవము కలవారు. వీరంతా ఇప్పుడు నీ ఆజ్ఞల కోసరము ఎదురుచూస్తున్నారు. నీవు ఏ పని చెబితే ఆ పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ఏమి చేయాలో చెప్పండి. మన సైనికులకు ఆజ్ఞలు ఇవ్వండి. ఏమి ఆజ్ఞలు ఇవ్వాలో నాకు తెలిసినా, అవి నీ నోటి నుండి వస్తే బాగుంటుంది.” అని అన్నాడు సుగ్రీవుడు.
అప్పుడు రాముడు సుగ్రీవునితో ఇలా అన్నాడు. “మిత్రమా! సుగ్రీవా! ప్రస్తుతము మనము సీత గురించి అన్వేషించాలి. ఆమె జీవించి ఉన్నదా లేక మరణించినదా! జీవించి ఉంటే ఎక్కడ ఉంది! ఆ రావణుడు సీతను ఎక్కడ దాచి ఉంచాడు? ఈ విషయములను మనము కనుక్కోవాలి. సీతను గురించి, రావణుని నివాసము గురించి, సీతను ఉంచిన ప్రదేశమును గురించి తెలిసిన తరువాత, తదుపరి కార్యక్రమమును ఆలోచిస్తాము. సీతను వెదికే కార్యక్రమములో నాకు గానీ, లక్ష్మణునికి గానీ ఎలాంటి అనుభవము సామర్థ్యము లేవు. అది నీవే నిర్వహించాలి. ఈ అన్వేషణా కార్యక్రమము నిర్వహించుటకు నీవే సమర్ధుడవు. ఎందుకంటే ఏయే ప్రదేశాలు ఎక్కడెక్కడ ఉన్నాయో నీకు బాగా తెలుసు. కాబట్టి నీవే వానరులకు తగు ఆదేశాలు ఇవ్వు." అని అన్నాడు.
అప్పుడు సుగ్రీవుడు వినతుడు అనే వానరసేనానిని పిలిచాడు. “ఓ వానరోత్తమా! నీవు నీ సైన్యముతో తూర్పు దిక్కుకు వెళ్లు. అక్కడ ఉన్న పర్వతములలోనూ గుహలలోనూ అడవులలోనూ నదుల తీరాలలోనూ, సమతల ప్రదేశాలలోనూ సీతను గురించి వెదుకు. గంగా, సరయూ, కాళిందీ, యమునా, కౌశికీ, సరస్వతీ మొదలగు నదీతీరాలలో వెదుకు. విదేహ, మాళవ,కాశీ, కోసల,పౌండ్ర, అంగ దేశములలో అన్ని పట్టణములను గ్రామములను, జనపదములను సీత కొరకు వెదకండి.
అంతే కాదు కొన్ని పర్వతములు సముద్రములో మునిగి ఉంటాయి. అక్కడకూడా వెతకండి. భూమి మీద ఉన్న పర్వత శిఖరము లను వెదకండి. అక్కడ మనుష్యులను చంపి తినే కిరాతులు ఉంటారు. అక్కడ కూడా వెదకండి. సముద్రమధ్యలో ఉన్న ద్వీపములను కూడా విడిచిపెట్టకుండా వెదకండి. కొంతమంది నీటి మధ్యలో ఉంటూ ఉంటారు. వారిని కూడా వదలకండి. యవద్వీపము ఉంది. అక్కడ ఏడురాజ్యాలు ఉన్నాయి. ఆ రాజ్యాలలో కూడా వెదకండి. తరువాత బంగారు గనులతో విరాజిల్లు సువర్ణ ద్వీపమును, రజితద్వీపమును, వెదకండి.
యవద్వీపము అవతల శిశిరము అనే పర్వతము ఉంది. ఆ పర్వత శిఖరము మీద దేవతలు దానవులు నివసిస్తూ ఉంటారు. ఆ పర్వతము మీద కూడా సీత కొరకు వెదకండి.
అక్కడ నుండి, ఎర్రని నీళ్లు గల శోణ నది దగ్గరకు వెళ్లండి. అక్కడ సముద్రమును దాటండి. సముద్రము ఆవల ఉన్న అరణ్యములను సీతకొరకు వెదకండి. సముద్రము మధ్య ఉన్న ద్వీపములలో కూడా వెదకండి. అక్కడ పెద్ద పెద్ద శరీరములతో ఉన్న అసురులు మనుష్యులను, జంతువులను, వాటి నీడను పట్టుకొని తమ వద్దకు లాగుకొని, ఆహారంగా తింటూ ఉంటారు.
దానిని దాటిన తరువాత ఎర్రని నీళ్లతో కూడిన లోహితము అనే సముద్రము కనిపిస్తుంది. అక్కడ ఒక పెద్ద కూటశాల్మలీ వృక్షము కనిపిస్తుంది. అక్కడే గరుత్మంతుడు నివాసము ఉంటాడు. ఆయన గృహమును విశ్వకర్మ నిర్మించాడు. అక్కడున్న పర్వతముల మీద మందేహులు అనే భయంకరమైన రాక్షస జాతి నివసిస్తూ ఉంటుంది. అక్కడకూడా వెదకండి. తరువాత పాలవంటి నీరు కల క్షీరసముద్రము వద్దకు వెళ్లండి. ఆ సముద్రము మధ్యలో ఋషభ అనే తెల్లని పర్వతము ఉంది. ఆ పర్వతము మీద సుదర్శనము అనే సరస్సు ఉంది. అక్కడకు దేవతలు, చారణులు, యక్షులు, కిన్నరులు, వానరులు క్రీడించడానికి వస్తుంటారు. ఆ పర్వతము మీద కూడా వెదకండి.
క్షీరసముద్రము దాటగానే మీకు జలసముద్రము కనిపిస్తుంది. అ సముద్రములో బడబాగ్ని ప్రజ్వరిల్లుతూ ఉంటుంది. ఆ సముద్రము ఉత్తర తీరంలో జాతరూపశిలము అనే పెద్ద పర్వతము ఉంది. ఆ పర్వతము మీద భూభారమును మోయుచున్న వేయి పడగల ఆదిశేషువు కనపడతాడు. ఆయనకు మూడు తలలు ఉన్న తాళవఋక్షము కేతనము (పతాకము).
దాని తరువాత మీకు ఉదయ పర్వతము కనపడుతుంది. దాని మీద సౌమనసము అనే శిఖరము ఉంది. అది బంగారు వర్ణంలో ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ శిఖరము యోజనము విస్తీర్ణము కలిగి ఉంది. పూర్వము త్రివిక్రమావతారంలో శ్రీమహావిష్ణువు ఒక పాదమును ఇక్కడ, మరొక పాదమును మేరు పర్వతము మీద మోపాడని అంటారు. సూర్యుని సంచారము ఇక్కడ నుండి మొదలవుతుంది. ఆ పర్వతము మీద వాలఖిల్యులు అనే మునులు తపస్సు చేసుకుంటూ ఉంటారు. అక్కడే సుదర్శన ద్వీపము ఉంది.
ఈ ఉదయ పర్వత శిఖరము ప్రాత:కాలసమయమున సూర్యుని తేజస్సుతో ప్రకాశిస్తూ ఉంటుంది. బ్రహ్మ ఈ పర్వతమును మొట్ట మొదటగా తూర్యు దిక్కున, ఈ భూమికి ద్వారముగానూ, సూర్యుడు ఉదయించడానికి స్థానముగానూ సృష్టించాడు. అందుకే సూర్యుడు ఉదయించు దిక్కును తూర్పు దిక్కు (పూర్వదిక్కు) అని పిలుస్తారు. మీరు వెళ్లి ఆ ఉదయ పర్వతముమీద పూర్తిగా వెదకండి. ఉదయ పర్వతము ఆవలకు ఎవరూ వెళ్లలేరు. అక్కడ సూర్యుడు లేనందు వలన అంధకారంగా ఉంటుంది. ఉదయ పర్వతము గుహలలోనూ శిఖరముల మీదా సీత కోసరం వెదకండి. మీరు ఉదయ పర్వతము వరకు మాత్రమే వెళ్లగలరు. ఉదయ పర్వతము ఆవల ఏముంటుందో నాకు కూడా తెలియదు. అందుకని మీరు ఉదయ పర్వతమువరకూ వెళ్లి, సీతను వెదకి, ఒక నెలలోపు తిరిగి రావాలి. నెలరోజులలోపు మీరు తిరిగా రాకపోతే మీకు మరణదండన విధింపబడుతుంది." అని సుగ్రీవుడు వానర యోధులను ఆదేశించాడు.
శ్రీమద్రామాయణము
కిష్కింధా కాండము నలుబదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment