శ్రీమద్రామాయణం - కిష్కింధా కాండము - నలుబది ఒకటవ సర్గ (Ramayanam - KishkindhaKanda - Part 41)

శ్రీమద్రామాయణము

కిష్కింధా కాండము

నలుబది ఒకటవ సర్గ

ఆ ప్రకారము సుగ్రీవుడు వానరులను తూర్పుదిక్కు కుపంపిన తరువాత, మరి కొంత మంది వానరులను దక్షిణదిక్కుగా పంపాడు. దక్షిణ దిక్కుకు పంపబడిన వానరులలో ప్రముఖులైన అగ్నికుమారుడు నీలుడు, వాయుపుత్రుడు హనుమంతుడు, బ్రహ్మదేవుని కుమారుడైన జాంబవంతుడు, సుహోతుడు, శరారి, శరగుల్ముడు, గజుడు, గవాక్షుడు, సుషేణుడు, వృషభుడు, మైందుడు, ద్వివిదుడు, విజయుడు, గంధమాధనుడు, అగ్నిపుత్రులైన ఉల్కాముఖుడు, అనంగుడు, వాలి కుమారుడు అంగదుడు వెళ్లారు. ఆ వానర వీరులందరికీ వాలి కుమారుడు అంగదుని నాయకుడుగా చేసాడు సుగ్రీవుడు. అంగదుని నాయకత్వంలో వానరవీరులు దక్షిణ దిక్కుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు. దక్షిణ దిక్కున ఉన్న ప్రదేశముల గురించి సుగ్రీవుడు ఈ విధంగా చెప్పసాగాడు.

“ఓ వానవీరులారా! దక్షిణ దిక్కున వింధ్యపర్వతము, నర్మదానది, గోదావరీ నది, కృష్ణవేణి అనేమహానది, వరదానది, మేఖల దేశము, ఉత్కలదేశము, దశార్ణదేశము, ఆబ్రవంతి, అవంతి
నగరములు ఉన్నాయి అక్కడ అంతా వెదకండి. ఇంకా విదర్భ, ఋష్టిక, మత్స్య, కళింగ, కౌశిక, ఆంధ్ర, పుండ్ర, చోళ, పాండ్య, కేరళ దేశములలో వెదకండి. ఇంకా దట్టమైన దండకారణ్యము, గోదావరీ తీరము పూర్తిగా వెదకండి. దానికి దక్షిణముగ ఉన్న మలయపర్వతము మీద కూడా
వెదకండి.

తరువాత మీకు కావేరీ నది కనపడుతుంది. అక్కడే అగస్త్యమహాముని ఆశ్రమము ఉంది. ఆ మహామునిని దర్శించి, ఆయన ఆశీర్వాదము తీసుకొని, తామ్రపర్ణి నదిని దాటండి. తరువాత పాండ్యదేశము చేరుకోండి. అక్కడి నుండి సముద్ర తీరము చేరుకోండి. ఆ సముద్రమధ్యలో అగస్త్యుడు నిలిపిన మహేంద్రపర్వతము ఉంది. ఆ పర్వతము సముద్రములోనికి చొచ్చుకొని ఉన్నది. మహేంద్రుడు పర్వదినములలో ఆ పర్వతము వద్దకు వస్తుంటాడు.

సముద్రము ఆవలి ఒడ్డున నూరు యోజనముల వైశాల్యము గల ఒక ద్వీపము ఉంది. ఆ ద్వీపమునకు మానవులు వెళ్లలేరు. మీరు ఆ ద్వీపమునకు పోయి వెదకండి. రావణుడు ఆ ద్వీపములోనే ఉంటాడు. అందుకని అక్కడ సీతను ఉంచే అవకాశము ఉంది. దక్షిణ సముద్ర మధ్యలో ఒక స్త్రీ ఉంది. ఆమె పేరు అంగారక. ఆమె ప్రాణులయొక్క నీడను బట్టి ఆ ప్రాణులను తన వద్దకు లాగి తింటూ ఉంటుంది. దక్షిణ దిక్కున ఉన్న నేను చెప్పిన ప్రదేశములలో
సీతను వెదకండి.

ఈ ద్వీపమును దాటిన తరువాత సముద్రము నూరు యోజనములు విస్తరించి ఉంది. సముద్రమధ్యలో పుష్పితకము అనే పర్వతము ఉంది. ఆ పర్వతము ఆకాశము అంత ఎత్తులో ఉంది. ఆ పర్వతము మీత చంద్రుడు నివాసము ఉంటాడు. దుర్మార్గులు, నాస్తికులు, ఆపర్వతమును చూడలేరు. మీరు ఆ పర్వతమునకు నమస్కరించండి. తరువాత ఆపర్వతము మీద కూడా వెదకండి.

ఆ పర్వతమునకు పదునాలుగు యోజనముల దూరంలో సూర్యవంతము అనే పర్వతము ఉంది. ఆ పర్వతము దాటిన తరువాత మీకు వైద్యుతము అనే పర్వతము ఉంది. ఆ పర్వతమును దాటి ముందుకు వెళ్లండి. తరువాత మీకు కుంజరము అనే పర్వతము కనిపిస్తుంది. ఆ పర్వతము మీద అగస్త్యుని గృహము ఉంది. ఆ గృహమును విశ్వకర్మ బంగారంతో నిర్మించాడు.

తరువాత మీకు భోగవతీ నగరము కనిపిస్తుంది. ఆ నగరము సర్పములకు నివాసము. ఆ నగరంలో వాసుకి నివసిస్తూ ఉంటాడు. మీరు ఆ భోగవతీనగరంలో కూడా వెదకండి. భోగవతీ నగరమును దాటిన తరువాత మీకు ఋషభ అనే పర్వతము కనిపిస్తుంది. ఆ పర్వతము ఋషభాకారంలో ఉంటుంది కాబట్టి ఆ పేరు వచ్చింది. ఆ పర్వతము మీద ఉన్న అరణ్యములలో రకరకాలైన చందనపు చెట్లు ఉన్నాయి. ఆ వనమును గంధర్వులు రక్షిస్తుంటారు. ఆ పర్వతము మీద శైలూషుడు, గ్రామణి, శిక్షుడు, శుకుడు, బభ్రువు అనే ఐదుగురు గంధర్వులు నివసిస్తూ ఉంటారు.ఆ పర్వతము తరువాత మీకు పితృలోకములు కనిపిస్తాయి. మీరు అక్కడకు వెళ్ళవద్దు. అది యమలోకం. అంత చీకటిగా ఉంటుంది. శరీరంతో ప్రాణులు అక్కడకు వెళ్ళలేరు. కాబట్టి మీరూ అక్కడకు వెళ్ళవద్దు. 

నేను చెప్పిన ప్రదేశములన్నింటినీ సీత కోసం వెదకండి. ఆమె జాడ తెలుసుకోండి. మీరు ఈ పనిని నెలరోజులలో పూర్తిచేయాలి. ఈ పని మీరు చేస్తే మీకు నాతో సమానమైన గౌరవము లభిస్తుంది. మీరు ఎన్ని అపరాధములు చేసినా క్షమిస్తాను. కాబట్టి మీరందరూ వెంటనే సీతను వెదకడం కోసరం బయలుదేరండి." అని అన్నాడు సుగ్రీవుడు. 

శ్రీమద్రామాయణము 
కిష్కిందా కాండము నలుబది ఒకటవ సర్గ సంపూర్ణము. 
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్ 



Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)