శ్రీమద్రామాయణం - కిష్కింధా కాండము - నలుబది రెండవ సర్గ (Ramayanam - KishkindhaKanda - Part 42)

శ్రీమద్రామాయణము

కిష్కింధా కాండము

నలుబది రెండవ సర్గ

కొంతమంది వానరప్రముఖులను దక్షిణ దిక్కుకు పంపిన తరువాత తార తండ్రి, తనకు మామగారు అయిన సుషేణుని నాయకత్వములో కొంతమంది వానరులను పశ్చిమదిక్కుగా పంపాడు. తన కన్నా పెద్ద వాడు తనకు మామగారు అయిన సుషేణునికి నమస్కరించి సుగ్రీవుడు ఇలా అన్నాడు.

“మీ నాయకత్వంలో రెండులక్షల వానరములను తీసుకొని మీరు పశ్చిమ దిక్కుగా వెళ్లండి. మీకు సాయంగా అర్చిష్మంతుడు, అర్చి, మాల్యుడు ఉంటారు. మీరు సౌరాష్ట్ర, బాహ్లిక, చంద్రచిత్ర దేశములలో సీతకోసం వెదకండి. అక్కడి నుండి పశ్చిమ సముద్రము వైపుగా వెళ్లండి. పశ్చిమ సముద్ర తీరంలో ఉండే పర్వతములను గుహలను, అరణ్యములను సీత కోసరం, రావణుని కోసరం వెదకండి. సముద్రతీర పట్టణములైన మురచీ, జటాపురము, అవంతీనగరము, అంగలేపాపురము, మొదలగు నగరములను వెదకండి.

అక్కడినుండి పడమరగా వెళ్లండి. అక్కడ సింధునది సముద్రంలో కలిసేచోట ఒక పెద్ద పర్వతము ఉంది. దాని పేరు సోమగిరి. దానిమీద సింహములు, ఏనుగులు నివసిస్తూ ఉంటాయి. మీరు ఆ పర్వతశిఖరమును ఆమూలాగం వెదకండి. తరువాత మీరు పశ్చిమ సముద్రములో ఉన్న పారియాత్ర పర్వతమునకు వెళ్లండి. ఆ పర్వతశిఖరము మీద ఇరువది నాలుగుకోట్లమంది గంధర్వులు నివసిస్తూ ఉంటారు. వారి వద్దకు మాత్రం వెళ్లకండి. ఆ పర్వతము మీద ఉన్న వృక్షములకు కాసిన ఫలములు తినకండి. గంధర్వులు ఆ చెట్లను రక్షిస్తూ ఉంటారు. మీరు సాధారణ వానరులుగా పోయి సీత కోసం వెదకండి. ఆ గంధర్వులు మిమ్ములను ఏమీ చేయరు.
అక్కడకు దగ్గరలో నూరుయోజనముల ఎత్తుగల ఒక మహాపర్వతము ఉంది. ఆ పర్వతము మీద గుహలలో మీరు వెదకండి. సముద్రమును నాలుగవ వంతు ఆక్రమించే చక్రవంతము అనే పర్వతము ఉంది. ఆ పర్వతము మీద విశ్వకర్మ వేయి అంచులు కల చక్రమును ఒక దానిని నిర్మించాడు. ఆచక్రాన్ని హయగ్రీవుడు అనే దానవుడు రక్షిస్తూ ఉండేవాడు. శ్రీమహావిష్ణువు ఆ దానవుని సంహరించి ఆ చక్రమును, పంచజనుడు అనే వానిని చంపి పాంచజన్యమును అనే శంఖమును స్వీకరించాడు. ఆ పర్వతము మీద ఉన్న గుహలయందు, అడవులయందు సీత కోసం వెదకండి.

తరువాత సముద్ర గర్భంలో వరాహము అనే పర్వతము ఉంది. అక్కడే ప్రాగ్జ్యోతిష పురము అనే పట్టణము ఉంది. ఆ పట్టణాన్ని నరకుడు అనే దానవుడు పరిపాలిస్తున్నాడు. వరాహ పురమును దాటిన తరువాత మీకు సర్వసౌవర్ణము అనే పర్వతము కనిపిస్తుంది. ఆ పర్వతము మీద రకరకాల క్రూరమృగములు సంచరిస్తూ ఉంటాయి. దాని తరువాత మేఘము అనే పర్వతము ఉంది. దాని మీదనే దేవతలు మహేంద్రునికి పట్టాభిషేకము నిర్వహించారు.

ఆ మేఘ పర్వతము తరువాత మీకు అరవై వేల బంగారు పర్వతములు కనిపిస్తాయి. ఆ పర్వతముల మధ్య మేరు పర్వతము ఉంది. ఆ పర్వతము మీద ఉన్న ప్రతి వస్తువు మీద, దేవ, గంధర్వ, దానవుల మీదా తన కిరణములు పడి, బంగారు రంగులో ప్రకాశిస్తూ ఉంటాయి అని మేరు పర్వతమునకు సూర్యుడు ఒక వరము ప్రసాదించాడు. ఆ పర్వతము మీద విశ్వే దేవతలు, అష్టవసువులు, సప్తమరుత్తులు, ఇతర దేవతలు కలిసి సూర్యుని సేవిస్తూఉంటారు. ఆ మేరు పర్వతము మీద విశ్వకర్మ వరుణుని కొరకు ఒక దివ్యమైన భవనమును నిర్మించాడు. ఆ భవనంలో వరుణుడు నివాసము ఉంటాడు.

మేరు పర్వతమునకు పదివేలయోజనముల దూరంలో అస్తాద్రి అనే పర్వతము ఉంది. అక్కడే సూర్యుడు అస్తమిస్తాడు. మేరు పర్వతము అస్తాద్రి మధ్యలో పదితలలు కలిగిన పెద్ద బంగారు తాటిచెట్టు ఉంది. మీరు ఆయా ప్రదేశములలో సీత కోసరం వెదకండి.

ఆ ప్రాంతములోనే ధర్మాత్ముడు అయిన మేరుసావర్ణ అనే ఋషి తపస్సుచేసుకుంటున్నాడు. మీరు ఆఋషికి నమస్కరించి సీత గురించి ఆయనను అడగండి.

మీరు నేను చెప్పిన విధంగా అస్తాద్రి వరకూ ప్రయాణించి సీత కోసం వెదకండి. మరలా ఒక నెలలోపు తిరిగిరండి. మాసము దాటిన వారికి మరణదండన తప్పదు. మీ అందరికీ మా మామగారు సుషేణుడు నాయకత్వము వహిస్తాడు. మీరు ఆయన మాటను నా మాటగా శిరసావహించండి. మీరు సీత జాడ తెలుసుకుంటే. నాకు మహోపకారము చేసిన వారు అవుతారు. నేను కూడా రాముని
ఋణం తీర్చుకున్నవాడిని అవుతాను." అని సుగ్రీవుడు సుషేణునితోనూ, వానర సేనానాయకులతోనూ అన్నాడు. సుషేణుడు వానరవీరులతో కలిసి సీతను వెదుకుతూ పశ్చిమదిక్కుకు వెళ్లడానికి సమాయత్తము అయ్యాడు.

శ్రీమద్రామాయణము
కిష్కింధా కాండము నలుబది రెండవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్



Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)