శ్రీమద్రామాయణం - కిష్కింధా కాండము - నలుబది మూడవ సర్గ (Ramayanam - KishkindhaKanda - Part 43)
శ్రీమద్రామాయణము
కిష్కింధా కాండము
నలుబది మూడవ సర్గ
పడమట దిక్కుకు సుషేణుని పంపిన తరువాత, శరబలుడు అనే వానర శ్రేష్ఠుని చూచి సుగ్రీవుడు ఇలా అన్నాడు.“శరబలా! నీ మంత్రులతోనూ, ఒక లక్షమంది వానరులతోనూ మీరు ఉత్తర దిక్కుగా బయలుదేరండి. ఉత్తర దిక్కు పూర్తిగా సీత కోసం వెతకండి. మహాత్ముడైన రాముడు నాకు ఎంతో ఉపకారము చేసాడు. మనము సీతను వెతికి ఆయన వద్దకు చేరిస్తే మనము కూడా రామునికి ప్రత్యుపకారము చేసి ఋణము తీర్చుకున్నవారము అవుతాడు. రామ కార్యము నిర్వర్తించినందుకు మన జన్మలు కూడా సఫలమవుతాయి.
మీరు అడవులలో, పర్వతములమీద, కొండ గుహలలోనూ వెతకండి. ఉత్తర దిక్కుగా ఉన్న మ్లేచ్ఛ, పుళింద, శూరసేన, ప్రస్థల, భరత, కురు, మద్రక, కాంభోజ, యవన, శక, బాహ్లిక, ఋషిక, పౌరవ, టంకణ,(టిబెట్ కావచ్చు) చీన, పరమచీన,(నేటి చైనా కావచ్చు) నీహార, వరద మొదలగు దేశములలో వెదకండి.
తరువాత మీరు సోమాశమమునకు, కాల పర్వతమునకు వెళ్లండి. ఆ పర్వతము అణువు అణువునా సీత కోసం వెదకండి. కాల పర్వతమును దాటి సుదర్శన పర్వతమునకు వెళ్లండి. దాని తరువాత దేవసఖ అనే పేరుగల పర్వతము ఉంది. ఆ పర్వతము మీద ఉన్న అరణ్యలలో సీతకొరకు వెదకండి.
దేవసఖ పర్వతమునకు నూరు యోజనముల దూరంలో శూన్యప్రదేశము కనిపిస్తుంది. అక్కడ పర్వతములు గానీ, అడవులు గానీ, సరోవరములు గానీ లేవు. ఆ శూన్యప్రదేశమును దాటితే మీరు కైలాస పర్వతమును చేరగలరు. అక్కడ కుబేరుని భవనము ఉంది. అక్కడే పద్మ సరస్సు ఉంది. ఆ సరస్సులో అందమైన హంసలు, పద్మములు, కలువలు కనువిందుగా కనిపిస్తాయి. ఆభవనములో ముల్లోకములలో పూజింపబడేవాడు, యక్షులకు రాజు, ధనముల కలవాడు అయిన వైశ్రవణుడు అనే రాజు నివసిస్తుంటాడు. అక్కడకూడా మీరు రావణుని గురించి, సీతను గురించి వెదకండి. దాని తరువాత మీరు క్రౌంచపర్వతము వద్దకు వెళ్లండి. అది ఎవరికినీ ప్రవేశించడానికి శక్యము కాదు. మహాత్ములు అయిన ఋషులు కైలాసపర్వతముమీద తపస్సు చేసుకుంటూ ఉంటారు. మీరు కైలాస పర్వతమును, క్రౌంచపర్వతమును పూర్తిగా వెతకండి.
క్రౌంచపర్వతము పక్కన మానసపర్వతము ఉంది. అక్కడ ఏ రకమైన వృక్షములు ఉండవు కానీ పక్షులు ఎగురుతూ ఉంటాయి. మానవులు, దేవతలు, రాక్షసులు అక్కడకు వెళ్లలేరు. క్రౌంచ పర్వతము దాటిన తరువాత మీరు మైనాక పర్వతమును చేరుకుంటారు.
క్రౌంచపర్వతము పక్కన మానసపర్వతము ఉంది. అక్కడ ఏ రకమైన వృక్షములు ఉండవు కానీ పక్షులు ఎగురుతూ ఉంటాయి. మానవులు, దేవతలు, రాక్షసులు అక్కడకు వెళ్లలేరు. క్రౌంచ పర్వతము దాటిన తరువాత మీరు మైనాక పర్వతమును చేరుకుంటారు.
ఆ పర్వతముమీద మయుడు అనే దానవుడు ఒక భవనమును నిర్మించుకొని నివసిస్తూ ఉంటాడు. మీరు ఆ మైనాక పర్వతము మీద పూర్తిగా వెదకండి. మైనాక పర్వతమును దాటిన తరువాత మీకు సిద్ధులు నివసించే ఆశ్రమము కనిపిస్తుంది. అక్కడ సిద్ధులు, వైఖానసులు, వాలఖిల్యులు నివసిస్తూ ఉంటారు. మీరు వారికి సీత గురించి చెప్పి ఆమె జాడతెలుసుకోండి. అక్కడ వైఖానసులకు సంబంధించిన ఒక సరస్సు ఉంది. పద్మములతో నిండిన ఆ సరస్సులో హంసలు విహరిస్తూ ఉంటాయి.
ఆ సరస్సు దాటిన తరువాత కేవలము ఆకాశము మాత్రము ఉంటుంది. అక్కడ సూర్య చంద్రులు ప్రకాశించరు. అంతా శూన్యము. అక్కడ విశ్రాంతి తీసుకుంటున్న సిద్ధుల తపశ్శక్తి వలన ఆ ప్రదేశం అంతా కాంతిమంతమవుతుంది.
మీరు ఆ ప్రదేశమును దాటిన తరువాత మీరు శైలోద అనే నదిని చేరుకుంటారు. అక్కడే ఉత్తర కురుదేశము ఉంది. అక్కడ ఎన్నో నదులు ప్రవహిస్తూ ఉంటాయి. అక్కడ మణులు, రత్నములు, ముత్యములు దొరుకుతాయి. అక్కడ ఉన్న వృక్షములు అన్ని ఋతువుల లోనూ ఫలములతో పుష్పములతో నిండుగా ఉంటాయి. అక్కడ గంధర్వులు, సిద్ధులు, కిన్నరులు, నాగులు, విద్యాధరులు విహరిస్తూ ఉంటారు. అక్కడ ఎవరూ వాయించ కుండానే రకరకాలైన వాద్యముల ధ్వనులు వినబడుతూ ఉంటాయి. అక్కడ సంతోషమే కానీ దు:ఖమునకు తావు లేదు.
ఆ పర్వతమును దాటిన తరువాత ఉత్తర సముద్రము వస్తుంది. దాని మధ్యలో సోమగిరి అనే పర్వతముఉంది. ఆ పర్వతము నుండి కాంతి ప్రసరిస్తూ ఉంటుంది. అక్కడ ఏకాదశ రుద్ర స్వరూపుడు అయిన పరమశివుడు, బ్రహ్మ నివసిస్తూ ఉంటారు. మీరు కురుదేశమును దాటి ఆవలకు వెళ్లకండి. సోమగిరి మీదికి దేవతలు కూడా వెళ్లలేరు. మీరుకూడా సోమగిరిని చూచి తిరిగి రండి.
ఉత్తర దిక్కుగా ఉన్న నేను చెప్పిన ప్రదేశములలో సీతకోసం వెదకండి. మీరు సీత జాడ తెలుసుకుంటే మనము రామునికి ఎంతో ప్రియము చేసిన వాళ్లము అవుతాము. మీరంతా సీత జాడ తెలుసుకుంటారు అని ఆశిస్తున్నాను.” అని సుగ్రీవుడు వానర వీరులతో అన్నాడు.
శ్రీమద్రామాయణము
కిష్కింధా కాండము నలుబది మూడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment