శ్రీమద్రామాయణం - కిష్కింధా కాండము - నలుబది నాల్గవ సర్గ (Ramayanam - KishkindhaKanda - Part 44)

శ్రీమద్రామాయణము

కిష్కింధా కాండము

నలుబది నాలుగవ సర్గ

సుగ్రీవుడు వానర ప్రముఖులను నలుదిక్కులకు సీతను వెదకడానికి పంపడాన్ని నిశితంగా చూస్తున్నాడు రాముడు. ఇంతలో దక్షిణ దిక్కుగా వెళ్లడానికి నియమించిన వానర ప్రముఖులలో ఒకడుగా ఉన్న హనుమంతుని పిలిచి సుగ్రీవుడు ఇలా అన్నాడు.

"ఓ హనుమా! నీవు బాగా ఎగురగలవు. భూమి మీద గానీ, ఆకాశంలో గానీ, నీ మార్గానికి అడ్డు లేదు. పైగా నీకు దేవ, గంధర్వ, నాగ, నరలోకముల గురించి బాగుగా తెలియును. నీవు గమన వేగంలో నీ తండ్రి వాయుదేవునితో సమానుడవు. ఆ లోకంలో ఉన్న ప్రాణులలో నీతో సమానమైన ప్రాణి లేదు. కాబట్టి సీతను అన్వేషించడంలో ఏది మంచి మార్గమో నీవే ఆలోచించు. ఎందుకంటే,
వానరులలో కల్లా బాగుగా ఆలోచించగల సమర్థుడివి నీవే! నీకు అమితమైన దేహబలము, బుద్ధి బలము, దేశకాలములను బట్టి ప్రవర్తించు తెలివితేటలు నీకు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి ఈ కార్యము నిర్వహించుటకు నీవే సమర్థుడివి." అని అన్నాడు సుగ్రీవుడు.

సుగ్రీవుని మాటలు విని రామునికి కూడా హనుమంతుని మీద గొప్ప నమ్మకం కలిగింది. పైగా హనుమంతుడు దక్షిణ దిక్కుగా పోతున్నాడు. రావణుడు కూడా సీతను దక్షిణ దిక్కుగా తీసుకువెళ్లాడు అని జటాయువు వలన తెలిసింది. కాబట్టి హనుమంతుడే సీతను కనుగొనే అవకాశం మెండుగా ఉంది. పైగా సుగ్రీవుడు కూడా ప్రత్యేకించి హనుమంతుని మీదనే ఎక్కువ విశ్వాసము ఉంచాడు. పైగా హనుమంతుడు కార్యదీక్ష కలవాడు అని తెలుస్తూ ఉంది.

ఇదివరకు హనుమంతుడు సాధించిన కార్యములను బట్టి, రాజైన సుగ్రీవుడు హనుమంతుని మీద ఉంచిన నమ్మకమును బట్టి, కష్టకాలములో కూడా సుగ్రీవుని విడిచిపెట్టని హనుమంతుని ధర్మనిరతిని బట్టి హనుమంతుడు ఈ కార్యమును సాధించగలడని నమ్మకము కుదిరింది రామునికి. హనుమంతుని వలన తనకార్యము సాధింపబడుతుంది అని నిశ్చయించుకున్నాడు రాముడు.

తనవేలికి ఉన్న ఉంగరము తీసాడు. దాని మీద రాముని పేరు చెక్కబడి ఉంది. "ఓ హనుమంతుడా! నీవు సీతను చూచినపుడు నీవు మాయా రూపములో ఉన్న రాక్షసుడివి అని సీత భయపడే అవకాశము ఉంది. అందుకని, నా పేరు చెక్కబడిన ఈ ఉంగరము నీ
దగ్గర ఉంచుకో. నీవు నా వద్దనుండి వచ్చావని సీతకు నమ్మకం కలిగించడం కోసరం ఈ ఉంగరము సీతకు చూపించు. ఆమె నిన్ను నమ్ముతుంది. 

ఓ వానరవీరా! నీ ఉత్సాహము, నీ పరాక్రమము, బలము, సుగ్రీవుడు నీ గురించి చెప్పిన మాటలు విన్న తరువాత ఈ కార్యము నీ వలననే సాధ్యమవుతుంది అని నాకు నమ్మకం కలిగింది. అందుకని ఈ ఉంగరము నీకు ఇస్తున్నాను.” అని తన పేరు ముద్రించిన ఉంగరమును హనుమంతునికి ఇచ్చాడు రాముడు.

హనుమంతుడు ఆ ఉంగరమును భక్తితో స్వీకరించాడు. రామునికి పాదాభివందనము చేసాడు. ఆ ఉంగరమును భద్రంగా దాచుకున్నాడు. తరువాత వానర సైన్యముతో అంగదుని పర్యవేక్షణలో వానర సైన్యము దక్షిణ దిక్కుగా ప్రయాణం అయింది. 

“ఓ సింహబలుడవైన వాయు పుత్రా! నేను నీ బలముపై ఆధారపడి ఉన్నాను. నీ పరాక్రమంతో సీత జాడ తెలుసుకో!" అని రాముడు మనసులోనే అనుకున్నాడు.

శ్రీమద్రామాయణము
కిష్కింధా కాండము నలుబది నాల్గవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్



Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)