శ్రీమద్రామాయణం - కిష్కింధా కాండము - ముప్పది మూడవ సర్గ (Ramayanam - KishkindhaKanda - Part 33)
శ్రీమద్రామాయణము
కిష్కింధా కాండము
ముప్పది మూడవ సర్గ
సుగ్రీవుని ఆదేశము మేరకు అంగదుడు మొదలగు వారు వెంటనే వెళ్లి లక్ష్మణుని వినయంగా లోపలకు ఆహ్వానించారు. లక్ష్మణుడు కిష్కింధా నగరంలోకి ప్రవేశించాడు. లక్ష్మణుని చూచి వానరులందరూ భక్తితో నమస్కరించారు. లక్షణుని మొహంలో కోపాన్ని చూచి వానరులు భయం భయంగా దూర దూరంగా నిలబడ్డారు.విశాలమైన రాజమార్గముల గుండా లక్ష్మణుడు వెళు తున్నాడు. లోపల ఉన్న పలు అంతస్థుల భవనములను చూచాడు లక్ష్మణుడు. రాజ మార్గములో పోతూ, అంగదుడు, మైందుడు, ద్వివిదుడు, గవయుడు, గవాక్షుడు, గజుడు, శరభుడు, విద్యున్మాలి, సంపాతి, సూర్యాక్షుడు, హనుమంతుడు, వీరబాహుడు, సుబాహుడు, నలుడు, కుముదుడు, సుషేణుడు, తారుడు, జాంబవంతుడు, దధివక్త్రుడు, నీలుడు, సుపాటలుడు,సునేత్రుడు మొదలగు వానర వీరుల గృహములను చూచాడు లక్ష్మణుడు.
దేవేంద్రుని భవనము వలె వెలిగిపోవుచున్న వానర రాజు సుగ్రీవుని ప్రాసాదమును చూచాడు లక్ష్మణుడు. ఆ ప్రాసాదము కైలాస శిఖరము మాదిరి తెల్లగా ప్రకాశిస్తూ ఉంది. ఆయుధములు ధరించిన వానరులు ఆ భవనమును నిరంతరమూ కాపలా కాస్తున్నారు. ముఖద్వారము గుండా లక్ష్మణుడు సుగ్రీవుని ప్రాసాదము లోనికి ప్రవేశించాడు. లక్ష్మణుడు ఏడు గవాక్షములను దాటి విశాలమైన అంత:పురములోని ప్రవేశించాడు. లోపల నుండి మధురమైన వీణానాదములు, వివిధ వాద్యధ్వనులు వినిపిస్తూ ఉన్నాయి. అత్యంత సౌందర్యవతులైన స్త్రీలు అటు ఇటూ తిరుగుతున్నారు. అందుకని లక్ష్మణుడు వెళ్లి కాస్త దూరంగా నిలబడ్డాడు. తన ధనుస్సును ఎక్కుపెట్టి వింటి నారిని మ్రోగించాడు.
ఆ ధ్వని విని సుగ్రీవుడు ఆసనముమీది నుండి లేచాడు. లక్ష్మణుడు వచ్చాడని తెలుసుకున్నాడు. పక్కనే ఉన్న తారతో ఇలా అన్నాడు. “ఓ తారా! సాధారణంగా శాంతస్వభావుడైన లక్ష్మణుడు ఎందుకు కోపంగా ఉన్నాడు? దీనికి కారణమేమి? సాధారణంగా లక్ష్మణునికి అకారణంగా కోపం రాదు కదా! లక్ష్మణుని పట్ల మనము ఏమి అపరాధము చేసాము? నీవు ఆలోచించి చెప్పు. లేకపోతే నీవు స్వయంగా వెళ్లి, లక్ష్మణునితో అనునయంగా మాట్లాడి, ఆయన కోపకారణం తెలుసుకో! సాధారణంగా ఎంత కోపంలో ఉన్నా మానవులు స్త్రీలను చూడగానే శాంతము వహిస్తారు కదా! ముందు నీవు వెళ్లి లక్ష్మణుని శాంతపరచు. లక్ష్మణుడు ప్రసన్నుడైన తరువాత నేను వెళ్లి లక్ష్మణునితో మాట్లాడతాను." అని తారతో అన్నాడు.
అప్పుడు తార లక్ష్మణుని వద్దకు వెళ్లింది. తారను చూడగానే లక్ష్మణుని కోపం తగ్గిపోయింది. ఆమె ముందు తలవంచుకొని వినయంగా నిలబడ్డాడు లక్ష్మణుడు. తార ఆయనతో ఇలా అంది.
“ఓ రాజకుమారా! నీ కోపమునకు కారణమేమి? ఇక్కడ నీకు ఎవరు ఎదురు చెప్పారు? నీ ఆజ్ఞను ధిక్కరించిన వాడు ఎవరు?" అనిసూటిగా అడిగింది.
అప్పుడు లక్ష్మణుడు తారతో ఇలా అన్నాడు.“నీ భర్త అయిన సుగ్రీవుడు, ధర్మమును విడిచి కామభోగములలో ఎందుకు మునిగి తేలుతున్నాడు. ఆయన చేసిన తప్పు నీకు తెలియడం లేదా! సుగ్రీవుడు రాచకార్యములను మరిచి, మాకు ఇచ్చిన మాట కూడా మరిచి, ఉపకారము చేసిన రాముని గురించి ఆలోచించక, కామభోగము లలో తేలియాడడం లేదా! అది నీకు తెలియదా!
సుగ్రీవుడు మాకు నాలుగు మాసములు వ్యవధి కావాలని అడిగాడు. ఆ నాలుగు మాసములు పూర్తి అయిన విషయం కూడా సుగ్రీవునకు గుర్తు లేదు. అయినా! ఈ విధంగా మద్యపాన మత్తులో, స్త్రీల సాంగత్యంలో గడపడం ధర్మము తెలిసిన వారికి తగదు. ఇది ధర్మహాని కలిగిస్తుంది. మిత్రుని వలన మేలును పొంది, దానికి ప్రతిగా మేలు చేయని వాడు ధర్మము తప్పినట్టే కదా! అటువంటి వాడు ఒక మంచి మిత్రుని పోగొట్టుకున్నవాడవుతాడు. నీభర్త అయిన సుగ్రీవుడు ధర్మమును, సత్యమును మరిచాడు. ప్రస్తుతము ఇదీ విషయము. ఇప్పుడు ఏం చేయాలో నువ్వే చెప్పు." అని అన్నాడు లక్ష్మణుడు.

లక్ష్మణుని చెప్పిన మాటలను సావధానంగా విన్న తార లక్ష్మణునితో ఇలా అంది. “రాజకుమారా! దయచేసి కోపం తెచ్చుకోకు. ఇది కోపానికి సమయం కాదు. కార్యసాధకులకు కోపం పనికిరాదు. నీ వంటి గుణవంతుడు, గుణహీనుడైన సుగ్రీవుని పట్ల కోపం తెచ్చుకో వచ్చునా! సుగ్రీవుడు మీ పట్ల అపరాధం చేసాడు. దానిని మీరు సహించండి. రాముడి కోపం గురించి నాకు బాగా తెలుసు. మేము చేసిన అపరాధము గురించి మాకు తెలుసు. దానికి ఏమి చేయాలో కూడా మాకు తెలుసు.
ఓ రాజకుమారా! మన్మధుడు ఎంత బలవంతుడో నీకు తెలుసు. సుగ్రీవుడు ఆ మన్మధ బాణములకు చిక్కుకొని, కామ సుఖములలో మునిగి తేలుతున్నాడు. అదికూడా నాకు తెలుసు. కామాసక్తుడైన వాడికి ధర్మము గురించి పట్టించుకోడుకదా! ఆ సుగ్రీవుడు కామాసక్తుడై సిగ్గు లేకుండా, ఇప్పటిదాకా నా దగ్గరే ఉ న్నాడు. నీవు అతనిని క్షమించు.
మరొక మాట! నిరంతరమూ తపస్సుచేసుకొనే మహా ఋషులు కూడా కామమునకు లోబడి ప్రవర్తించడం మనకు తెలుసు. అటువంటిది, వానరుడు, చపలస్వభావుడు అయిన సుగ్రీవుడు
కామానికి లోబడటం వింత ఏమీ కాదు కదా! ఓ రాజకుమారా! అసలు విషయం ఏమిటంటే, సుగ్రీవుడు ఎంత కామాసక్తుడైనా, తన కర్తవ్యమును పాలించాడు. వానాకాలము ముగియగానే, మీ కార్యము సాధించుటకు వానరులను సమీకరించడానికి, వార్తాహరులను నలుదిక్కులకూ పంపాడు. కాబట్టి నీవు అంతఃపురములోని వచ్చి సుగ్రీవునితో మాట్లాడు.” అని లక్ష్మణుని సవినయంగా అంత:పురములోనికి ఆహ్వానించింది తార.

తార ఆహ్వానమును మన్నించి లక్ష్మణుడు సుగ్రీవుని అంతఃపురములోనికి ప్రవేశించాడు. కనకపు సింహాసనము మీద, తన భార్య రుమతో సహా కూర్చుని ఉన్న సుగ్రీవుని చూచాడు లక్ష్మణుడు. సుగ్రీవునికి, ధనుర్బాణములు ధరించిన లక్ష్మణుడు, దండధరుడైన యముడి మాదిరి కనపడ్డాడు.
శ్రీమద్రామాయణము
కిష్కింధా కాండము ముప్పది మూడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.
Comments
Post a Comment